Employer-Hides-Drugs-in-Empolyee-Car-for-Deported-Him

ప్రవాసీయుడు తన సంస్థలో పని చేయడం ఇష్టంలేని యజమానురాలు ఏం చేసిందంటే...

రాస్ అల్ ఖైమాహ్: ప్రవాసీయుడు అని తన సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగిపై ఈర్ష్య పెంచుకున్న యజమానురాలు అతన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పెద్ద పన్నాగమే పన్నింది. ఇక గల్ఫ్ దేశాల్లో డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయనేది అందిరికీ తెలిసిందే. దీన్ని ఆసరగా చేసుకొని ఆమె ఎలాగైన తన ఉద్యోగిని డ్రగ్స్‌తో పోలీసులకు దొరికెలా చేయాలని కుట్ర చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి సాయంతో ఆ ఉద్యోగి కారులో డ్రగ్స్(మత్తు పదార్థాలు) ఉంచడం ద్వారా అతడు పోలీసులకు పట్టుబడితే దేశ బహిష్కరణతో పాటు జైలుకు వెళ్లడం, వీసా క్యాన్సిల్ కావడం జరుగుతాయని ఆమె భావించింది. దీనికోసం డ్రగ్స్‌కు బానిసైన ఓ వ్యక్తిని ఎంచుకొని తన పథకాన్ని అమలు చేసింది. కానీ, సీన్ రివర్స్ కావడంతో పోలీసులకు చిక్కింది. రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

పోలీసుల విచారణ ఎదుర్కొన్నవారిలో యజమానురాలు, ఆమె భర్త, మేనల్లుడితో పాటు డబ్బు ఆశతో ఈ పనిచేయడానికి ఒప్పుకున్న వ్యక్తి. అయితే పోలీసుల విచారణలో ఆ ఉద్యోగి ఆసియా వాసి కావడంతో అతన్ని తమ దేశం నుంచి బహిష్కరించాలనే ఈ పని చేసినట్లు ఆ నలుగురు అంగీకరించారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో ప్రధాన నిందితుడు తాను కారులో డ్రగ్స్ ఉంచినప్పుడు మత్తులో ఉన్నానని, తనకు ఎవరు ఈ పని చేయమని అడగలేదని చెప్పాడు. దాంతో నిందితుల తరఫు న్యాయవాది తన క్లైంట్స్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. అలాగే నిందితుడు ఎవరి ప్రొద్బలం లేకుండా నేరాన్ని అంగీకరించాడు కావున తన క్లైంట్స్ నిర్దోషులని లాయర్ తెలిపాడు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు తన క్లైంట్స్ తప్పు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు. వాదోపవాదాలు విన్నా తరువాత న్యాయస్థానం తుది తీర్పును ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.