Dubai-Based-Indian-Expat-Dies-while-Rescuing-Kids-from-Floods

కూతురి పెళ్లికి వచ్చిన ఎన్నారై.. వరదల్లో ఇద్దరు చిన్నారులను కాపాడబోయి..

మలప్పురం(కేరళ): గత కొన్ని రోజులుగా వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 85 మందికి పైగా మృత్యువాత పడగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. వరదల దెబ్బకు కేరళ పూర్తిగా కళ తప్పిందనే చెప్పాలి. ఇదిలాఉంటే మంగళవారం మధ్యాహ్నం మలప్పురం జిల్లాలో ఓ విషాద సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. దుబాయ్‌లో ఉంటున్న ఎన్నారై కూతురి పెళ్లికి వచ్చి వరదల కారణంగా మృత్యువాత పడ్డాడు. వరద నీటిలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడిన రజాక్ అక్కిపరాంబిల్ అనే వ్యక్తి అదే నీటిలో మునిగి చనిపోయాడు. రజాక్ బావమర్ది షరీఫ్ ఈ విషయాన్ని ఫోన్ ద్వారా మీడియాతో చెప్పాడు. మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... 

గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో స్కూల్ స్టాఫ్‌గా పనిచేస్తున్న రజాక్ ఇటీవల కూతురి పెళ్లి కోసం కేరళకు వచ్చాడు. ఆగస్టు 4న కుమార్తె వివాహం జరిగింది. సమయం దొరకడంతో భార్యతో కలిసి రజాక్ మలప్పురంలోని బావమర్ది షరీఫ్ ఇంటికి వెళ్లాడు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మలప్పురం జిల్లా పరిసరాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటూ పొలాల వైపు వెళ్లారు. పొలాల్లో అప్పటికే భారీగా వరద నీరు చేరింది. పిల్లలు ఆడుకుంటూ పొలాల వైపు వెళ్లడం చూసిన రజాక్ చిన్నారులిద్దరూ నీట మునడం గమనించాడు.
 
వెంటనే నీటిలో దూకి చిన్నారులను ఒడ్డుకు చేర్చిన రజాక్ బయటపడే లోపే ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తింది. దాంతో అతడు బయటపడలేకపోయాడు. ఈత వచ్చిన కొందరు నీటిలో దూకి రజాక్ కోసం 15 నిమిషాలు వెతికిన తర్వాత దొరికాడు. దాంతో అతడ్ని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే రజాక్ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. గత పదేళ్లుగా తాను, రజాక్ దుబాయ్‌లోనే ఉంటున్నామని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ముగ్గురు పిల్లల తండ్రి అయిన రజాక్ చనిపోవడంతో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయిందని షరీఫ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో రజాక్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.