Drugs-transport-with-Unemployees

ట్రావెల్‌ ఏజెంట్ల మోసం

విజిటింగ్‌ వీసాతో అమాయకులను గల్ఫ్‌దేశాలకు

మాయమాటలు చెప్పి వారితో డ్రగ్స్‌ సరఫరా
కస్టమ్స్‌ అధికారులు, పోలీసులకు 
చిక్కి జైలుపాలవుతున్న యువత

హైదరాబాద్‌ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారా.. వెళితే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విభిన్న తరహాలో పుట్టుకొస్తున్న మోసగాళ్లు... డబ్బుకోసం ఎంతకైనా తెగించే కిలాడీలు తెరపైకి వస్తున్నారు. వారి మోసాలను గ్రహించేలోపే దేశకాని దేశం చేరుకున్న కొంతమంది అక్కడి చట్టాల ద్వారా శిక్ష అనుభవిస్తున్నారు. యువకులకు తెలియకుకుండానే మాదక ద్రవ్యాలు సరఫరా చేయించి విదేశాలకు చేరుస్తున్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా చేరితే అక్కడ ఉన్న ఈ కేటుగాళ్ల ఏజెంట్లు డ్రగ్స్‌ అమ్ముకొని లక్షలు సంపాదించుకుంటారు. ఒకవేళ పట్టుబడితే మాకు తెలియదని బుకాయించి ప్రయాణికులను బలిపశువులను చేస్తుంటారు. ఇటీవల జరిగిన ఘటనలు ఇందుకు నిదర్శనం. వ్యాపార లావాదేవీల పేరిట కొందరు, ట్రావెల్‌ ఏజెంట్ల ముసుగులో మరికొందరు యువకులను తమ బుట్టలో వేసుకొని విదేశీ జైళ్లలోకి తోసేస్తున్నారు.  
 
బ్యాగులో పార్శిల్‌ పెట్టి మాయం 
వ్యాపారం నిమిత్తం దుబాయ్‌ వెళుతున్నానని చెప్పి నీవు కూడా వస్తావా అంటూ బుట్టలో పడేస్తారు. ఖర్చేమీ ఉండదు.. అంతా నేనే చూసుకుంటానని చెబుతారు. అలా తిరిగి రావడమే కదా అని ఓకే చెప్పి కొంతమంది ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇద్దరూ కలిసి బయలుదేరిన తర్వాత పరిచయమున్న ఓ వ్యక్తి ఇచ్చాడు. అతడి సంబంధీకులు విమానాశ్రయం వద్దకు వస్తారని ఇది ఇవ్వమంటూ ఓ చిన్న పార్శిల్‌ అతడి బ్యాగులో పెట్టేస్తాడు. దుబాయ్‌ లేదా గల్ఫ్‌ దేశాలకు చేరిన తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో కస్టమ్స్‌ అధికారులు పార్శిల్‌ను తనిఖీ చేస్తుండగా దాన్ని ఇచ్చిన వ్యక్తి మాయమవుతాడు. అందులో డ్రగ్స్‌ ఉన్నాయని తెలుసుకున్న ప్రయాణికుడు ఆందోళనకు గురై అతడికోసం వెదుకుతాడు. అతను ఒకవేళ అక్కడ కనిపించినా.. తనను గుర్తుపట్టనట్టు నటిస్తాడు. డ్రగ్స్‌ సరఫరా కేసులో పోలీసులు పట్టుబడిన ప్రయాణికుడిని తీసుకెళతారు.  
 
స్నేహితులుగా నటిస్తూ... 
కొంతమంది ట్రావెల్‌ ఏజెంట్లు కూడా ఈ తరహా వ్యాపారం నిర్వహిస్తుంటారు. యూఎ్‌సఏ, యూకే వెళ్లాలంటూ వారి వద్దకు వెళ్లే విద్యార్థులను తెలివిగా తప్పుదోవ పట్టిస్తుంటారు. మీ పాస్‌పోర్టులో ఒకటి రెండు దేశాలు తిరిగినట్టు స్టాంపులుంటే యూకె, యూఎ్‌సఏ, కెనడా వీసాలు సునాయాసంగా వస్తాయని నమ్మిస్తారు. తక్కువ ఖర్చుతో కూడినదే కదా అని దుబాయ్‌, కువైట్‌, సౌదీ అరేబియా, ఖతర్‌, ఒమన్‌లాంటి దేశాలకు విజిట్‌ చేస్తారు. అన్నీ సమకూర్చిన తర్వాత వారు బయలుదేరుతున్న సమయంలో ఏజెంట్లు వచ్చి ఓ పార్శిల్‌ ఇస్తారు. అదే స్టోరీ పునరావృతమవుతుంది. కొంతమంది స్నేహితులుగా నటించి విజిట్‌ వీసాలపై గల్ఫ్‌ దేశాలకు తీసుకెళ్లడంతో డ్రగ్‌ సరఫరా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలా మోసగాళ్ల బారిన పడి అక్కడ జైలు శిక్ష అనుభవించిన చాలామంది ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత మోసపోయామంటూ న్యాయం చేయాలని కోరుతున్నారు. నగరానికి సుమారు 20 మంది ఇలాంటి మోసాలకు గురై గల్ఫ్‌లో శిక్ష అనుభవిస్తున్నారని పాతబస్తీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు.  
 
బెంగళూరు, ముంబయ్‌ విమానాశ్రయాల నుంచి... 
మోసాలకు పాల్పడే ట్రావెల్‌ ఏజెంట్లతో పాటు వివిధ రకాలుగా డ్రగ్స్‌ సరఫరాలో నిమగ్నమై  ఉన్న వారు అమాయకులను ట్రాప్‌ చేసిన తర్వాత హైదరాబాద్‌ నుంచి కాకుండా బెంగళూరు, ముంబయ్‌ విమానాశ్రయాల నుంచి బయలుదేరే విధంగా ప్లాన్‌ చేస్తారు. కారణం అక్కడి నుంచి పార్శిల్‌ వచ్చిందంటే ఆరా తీసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. హైదరాబాద్‌ వాసికి స్థానిక పార్శిల్‌ అంటే వివరాలు తెలిసే అవకాశమున్నందున్న ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ట్రాప్‌  చేస్తారు. విద్యార్థి వీసాపై పశ్చిమాసియా దేశాలకు వెళ్లే వారి వద్ద 10 నుంచి 15 లక్షల రూపాయలు ఫీజుల రూపంలో తీసుకోవడమే కాకుడా వారిని గల్ఫ్‌ ట్రిప్‌ చేయించే నెపంతో విదేశాలకు పంపుతున్నారు. 
 
మోసపోయిన వారు 
నర్కి ఫూల్‌బాగ్‌కు చెందిన హబీబ్‌ హమ్మద్‌ 2016 అక్టోబర్‌ 26న దుబాయ్‌ ప్రయాణించాడు.   ఐద్రూస్‌ అనే ట్రావెల్‌ ఏజెంట్‌ పార్శిల్‌ ఇచ్చాడు. అందులో మాదక ద్రవ్యాలున్నట్లు గుర్తించిన దుబాయ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి ఏడాది జైలు శిక్ష,  20వేల దిర్హమ్‌ల జరిమానా విధించడంతోపాటు జీవిత కాలం దుబాయ్‌ రాకుండా కోర్టు నిషేధం విధించింది. కింది కోర్టు తీర్పుతో సంతృప్తి చెందని దుబాయ్‌ పోలీసులు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లగా అతడికి ఏడేళ్ల జైలు, 50వేల రూపాయల జరిమానా విధించింది. ఇక్కడి నుంచి అతడి కుటుంబీకులు ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరకు అతడి శిక్ష 18 నెలలకు కుదించారు. శిక్ష పూర్తిచేసుకొని అతడు ఇటీవల తిరిగొచ్చాడు. 
 
గుల్బర్గాకు చెందిన మహమ్మద్‌ నఖీబ్‌ హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ చెప్పినట్లు గత ఏడాది మే 21ను దుబాయ్‌ వెళ్లాడు. విమానాశ్రయానికి ఓ వ్యక్తి వస్తాడు ఇవ్వమని చెప్పగా తీసుకెళ్లాడు. అక్కడి పోలీసులకు చిక్కడంతో ఏడాదిపాటు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు అక్కడే ఉండి తన కేసు గురించి పోరాటం చేస్తున్నాడు. మోసం చేసిన ఏజెంట్లపై చాంద్రాయణగుట్ట, గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. 
 
గత ఏడాది జూన్‌ 19న బండ్లగూడకు చెందిన షేక్‌ రిజ్వాన్‌, నిజామాబాద్‌ నివాసి ఉస్మాన్‌ అలీ, ఆబిడ్స్‌ నివాసి సయీద్‌ను స్థానిక ట్రావెల్‌ ఏజెంట్‌ బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఖతర్‌కు పంపించాడు. చివరి నిముషంలో ముగ్గురికీ ఓ ప్యాకెట్‌ ఇచ్చి ఖతర్‌లో ఓ వ్యక్తి వస్తాడని...అతడికి ఇవ్వమని చెప్పాడు. ఖతర్‌ వెళ్లిన వారిని పోలీసులు తనిఖీ చేయగా డ్రగ్స్‌ పార్శిల్‌తో పట్టుబడ్డారు. ముగ్గురికీ కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. వారు ప్రస్తుతం అక్కడ జైల్లోనే ఉన్నారు. రిజ్వాన్‌ను తీసుకెళ్లటానికి స్నేహితుడు షేక్‌ యూసుఫ్‌ విమానాశ్రయానికి రాగా అతడిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.  
 
అంబర్‌పేట్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అహ్మద్‌ ఖాద్రి యూకె వెళదామని స్థానికంగా ఉన్న ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ను సంప్రదించాడు. ముందు ఖతర్‌ వెళ్లమని ఏజెంట్‌ చెప్పగా 2017 నవంబర్‌ 27న ఖతర్‌ వెళ్లాడు.బెంగళూరు ఎయిర్‌పోర్టులో చివరి నిముషంలో ఏజెంట్‌ ఇచ్చిన పార్శిల్‌తో బయలుదేరిన ఖాద్రిని అక్కడి పోలీసులు అరెస్టు చేసి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. 
 
అంబర్‌పేట్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ సొహైల్‌ను కూడా అదే ట్రావెల్‌ ఏజెంట్‌ ఖతర్‌కు పంపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న అక్కడికి చేరుకున్న సొహైల్‌ పార్శిల్‌తో అక్కడి అధికారులకు చిక్కడంతో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విజిట్‌ వీసా లేదా ఎలాంటి వీసా ఉన్నా తమ లగేజీ తప్ప ఇతరులు పార్శిల్‌ ఇస్తే తీసుకెళ్లొద్దు.
ఎవరైనా మిమ్మల్ని గల్ఫ్‌ తీసుకెళ్తామంటే నమ్మొద్దు.
ఎయిర్‌పోర్టులో, పక్కసీట్లో కూర్చున్న వారు ఏదైనా వస్తువు ఇస్తే సున్నితంగా తిరస్కరించాలి.
మోసగాళ్ల మాటలు వినొద్దు. ఇలాంటి విషయాల్లో పోలీసుల సాయం తీసుకోవచ్చు.