Doctors-were-about-to-pronounce-a-cyclist-dead-but-then

లారీ ఢీకొట్టడంతో నడుములు విరిగి.. బతికించలేమన్న డాక్టర్లు.. ఒక్క సలహాతో..

లండన్: కళ్లెదుటే ప్రేమించిన వ్యక్తిని కబళించిందా వాహనం. అక్కడితో ఆగకుండా వేగంగా తనవైపు దూసుకొచ్చింది. పక్కకు తప్పుకునే అవకాశం లేదు. అక్కడే ఉంటే ప్రాణం పోక తప్పదు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఇంతకీ గాయాలతో రోడ్డు పక్కన పడిన భర్త బ్రతికున్నాడా? ఈ ఆలోచనల్లో ఉండగానే మృత్యు శకటంలా దూసుకొచ్చిందా లారీ.. దాని కింద పడిన తర్వాత ప్రాణాలతో ఉంటానని అస్సలు అనుకోలేదంటోంది మేరీ ఎలిసన్‌. ఆమె కథేంటో చూద్దామా?

బ్రిటన్‌కు చెందిన మేరీ ఎలిసన్ ఓ రిటైర్డ్ పోలీసు. సైక్లింగ్ అంటే ఆమెకు, ఆమె భర్త డెనిస్‌కు చచ్చేంత పిచ్చి. వారంలో ఎక్కువ కాలం సైకిల్‌పైనే గడిపేస్తుందా జంట. దాదాపుగా వారానికి 150మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఇంటి దగ్గరలో ఏర్పడిన సైక్లింగ్ క్లబ్బులో కూడా వీళ్లు చేరారు. వీరి కుమారుడు ఓ స్కూల్ టీచర్. పెళ్లి కూడా చేసుకున్నాడు. అతనికి ఇటీవలే ఓ పాప పుట్టింది. మేరీ దంపతులకు కూడా మనవరాలంటే చాలా ప్రేమ. సంతోషంగా గడిచిపోతున్న వీరి జీవితాలు సడెన్‌గా అతలాకుతలం అయ్యాయి. రోజూలానే సైక్లింగ్ చేయడానికి బయటకొచ్చిన ఈ భార్యాభర్తల వెనకే ఓ లారీ వచ్చింది. ఎదురుగా ఉన్న వారిని చూడని ఆ డ్రైవర్ ముందు డెనిస్‌ను ఢీకొట్టాడు. అది చూసిన మేరీకి ఏం చేయాలో తెలియలేదు. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేక బిక్కచచ్చిపోయింది. అదే సమయంలో వేగంగా వచ్చిన ఆ లారీ ఆమెను బలంగా ఢీకొట్టింది. అంతే ఆ దెబ్బకు గాల్లోకి లేచి రోడ్డుపై 10అడుగులు దూరం వెళ్లి పడిపోయింది. పెద్దగా అరిచి స్పృహ తప్పింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వెంటనే ఆమెను, డెనిస్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉండగా డెనిస్ పరిస్థితి కొంచెం తేటపడింది. కానీ మేరీ మాత్రం బతకడం కష్టమని వైద్యులు నిర్ధారించారు. దాంతో వారి కుమారుడికి ఫోన్ చేసి ఒకసారి వచ్చి చూసుకోవాల్సిందిగా చెప్పారు.

ఆ సమయంలో తన షిఫ్ట్ కాకపోయినా ఆస్పత్రికి వచ్చాడో వైద్యుడు. ఈ ప్రమాదం గురించి తెలుసుకొని మేరీని చూడటానికి వచ్చాడు. ఆమె నడుములు, పక్కటెముకలు ముక్కలు ముక్కలైపోయి ఉన్నాయి. రక్తస్రావం అసలు ఆగడం లేదు. ఏం చేసినా ఆమెను బ్రతికించడం కష్టమని అక్కడున్న వారు చెప్పారు. ఆ మాటలు విన్న ఆ వైద్యుడు.. నడుము భాగం బాగవడానికి సహాయంగా ఓ స్టీల్ పంజరాన్ని ఆమె శరీరంలో బిగించాలని సలహా ఇచ్చాడు. ఆ సలహానే మేరీ ప్రాణాలు నిలబెట్టింది. అతను చెప్పినట్లు చేసిన తర్వాత దాదాపు మూడు రోజులపాటు కోమాలో ఉన్న మేరీ.. ఆ తర్వాత కళ్లు తెరిచింది. ఆమె ప్రాణానికి ఎటువంటి ముప్పూ లేదని చెప్పిన వైద్యులు భవిష్యత్తులో సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. కోలుకొని డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆ సలహా ఇచ్చిన డాక్టరును కలవాలని మేరీ చెప్పింది. ‘అతన్ని చూడగానే నా నోట మాటరాలేదు. ఏం చెప్పాలి? నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఎదురుగా వస్తే ఎలా పలకరించాలో నాకు తెలియదు. ఏం చేసి ఆయన రుణం తీర్చుకోవాలో అర్థంకాలేదు. చివరకు తేరుకొని ధన్యవాదాలు చెప్పా’ అని మేరీ తెలిపింది. ప్రస్తుతం తన పదేళ్ల మనవరాలితో కలిసి ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పింది.