Deepak-Kalal-asks-Rakhi-Sawant-to-return-Rs-4-Cr-within-four-days

‘నన్ను వివాహమాడతానని మాటిచ్చి.. ఆ ఎన్నారైతో పెళ్లా..? నా రూ.4కోట్లు నాకిచ్చెయ్..’

ముంబై: వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవల యూకేకు చెందిన ఓ ఎన్నారైను రహస్యంగా వివాహమాడింది. తన పెళ్లిపై వచ్చిన వార్తలను తొలుత ఖండించిన రాఖీ.. ఆ తర్వాత నిజం ఒప్పుకుంది. ఎన్నారై రితేశ్‌ను పెళ్లి చేసుకున్నట్టు అంగీకరించింది. దీంతో ఆమె మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాకయ్యాడు. రాఖీ రహస్యంగా పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని ఆరోపించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాయమాటలు నమ్మి ఆమెకు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పాడు.
 
తానిచ్చిన నాలుగు కోట్ల రూపాయలను నయాపైసలతో సహా తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. ఇందుకోసం నాలుగు రోజులు గడువిచ్చాడు. ఆలోగా తన సొమ్ము వెనక్కి ఇవ్వకుంటే రాఖీ జీవితాన్ని సర్వనాశనం చేస్తానని హెచ్చరించాడు. దీపక్ బెదిరింపులపై రాఖీ స్పందించింది. దీపక్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను తనను ఏమీ చేయలేడని, ధైర్యం ఉంటే ఏం చేసుకుంటాడో చేసుకోవాలని గట్టిగా బదులిచ్చింది. కాగా, గతంలో రాఖీ సావంత్ మాట్లాడుతూ.. తాను త్వరలోనే రియాలిటీ టీవీ స్టార్, ఇంటర్నెట్ సెలబ్రిటీ దీపక్‌ను పెళ్లాడనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో కానీ.. దీపక్‌ను తాను పెళ్లాడటం లేదని వెల్లడించి సంచలనం రేపింది. తాజాగా యూకేకు చెందిన ఎన్నారై రితేశ్‌ను వివాహం చేసుకుంది.