Dead-bodies-came-from-Kuwait

కువైట్ నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహాలు

కన్నీటిరోదనల నడుమ ముగిసిన అంత్యక్రియలు

బద్వేలుటౌన్‌, జనవరి 30 : నాలుగు నెలల క్రితం కువైట్‌ నుంచి స్వగ్రామానికి వచ్చి తన భార్య, ఇద్దరి కుమారులతో సంతోషంగా గడిపి, తిరిగి కువైట్‌కు వెళ్లి విగతజీవిగామారి స్వగ్రామానికి చేరుకున్నారు. తన తండ్రి మృతదేహం వద్ద లెయ్‌ నాన్న లెయ్‌ నాన్న అంటూ కుమారులు రోదిస్తున్నతీరు అందరినీ కలచివేసింది. తమను అల్లారు ముద్దుగా పెంచిన తన తండ్రి తమను శాశ్వితంగా విడిచివెళ్లిపోయారని రోదించినతీరు అక్కడివారి హృదయాలను కలచివేసింది. అలాగే శ్రీనివాసులరెడ్డి కుమార్తె సుమ రోదించిన నాన్న నన్నువిడిచిపోయావా దేవుడా మాకు దిక్కు ఎవరూఅంటూ రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది.
 
వివరాల్లోకి వెళితే బతుకు దెరువు కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ఈ నెల 16వ తేదీన కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెన్నకేశంపల్లె గ్రామానికి చెందిన పోకల మల్లేశ్వరరెడ్డి(40), గొడుగునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి(40) పార్థివదేహాలు మంగళవారం స్వగ్రామాలకు చేరుకున్నాయి. మృత్యువాత విన్న ఆ కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతులు శ్రీనివాసులరెడ్డి, మల్లేశ్వరరెడ్డిలు తన స్నేహితులతో రోజూమాదిరిగానే రాడ్‌బెండింగ్‌ పనిచేసేందుకు పాహిల్‌ అనే ఏరియాలో విధులు నిర్వహించి మద్యాహ్నం భోజనం చేసేందుకు తిరిగి కారులో వస్తుండగా కువైట్‌లోని కింగ్‌షాహద్‌ ఆల్‌అహమ్మద్‌ ఎక్స్‌ప్రె్‌సహైవేలో ఈ ప్రమాదం జరగడంతో మృతులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి.
 
అనంతరం మృతదేహాలకు కువైట్‌లో పోస్టుమార్టం అనంతరం మృతుల స్వగ్రామాలకు బంధువుల సహకారంతో తరలించారు. పొట్టకూటికోసం కువైట్‌కువెళ్లి బాగా సంపాదిస్తూ, కుటుంబాలతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. చెన్నకేశంపల్లెలో మల్లేశ్వరరెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నేడు గొడుగునూరులో శ్రీనివాసులరెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 
మృతదేహాలకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ :
కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొడుగునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి, చెన్నకేశంపల్లె గ్రామానికి చెందిన మల్లేశ్వరరెడ్డిల మృతదేహాలకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె అన్నారు.