Cryptycurrency-is-not-money-says-Donald-Trump

క్రిప్టోకరెన్సీ.. కరెన్సీ కాదు..దానికి విలువలేదు: ట్రంప్

వాషింగ్టన్: బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీకి విలువలేదని, అవి గాల్లో దీపాల్లాంటివని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో కేవలం ఒకే ఒక్క కరెన్సీ ఉందని, అది అమెరికా డాలరని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ కరెన్సీని అందుబాటులోకి తెస్తున్న ఆయాసంస్థలు అమెరికాతోపాటు అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని నొక్కి వక్కాణించారు. 2009లో బిట్‌కాయిన్ విడుదలైనప్పటి నుంచి క్రిప్టోకరెన్సీకి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో చాలామంది కోటీశ్వరులయ్యారు కూడా. అలాగే దీనికి సంబంధించిన మోసాలు కూడా చాలా జరిగాయి. ఎలక్ట్రానిక్ కరెన్సీ కావడంతో దీన్ని ట్రేస్ చేయడం కష్టం. అందుకే చాలా మంది మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ రూపంలోనే మోసాలకు పాల్పడటం మొదలెట్టారు. ఇటీవలే సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా తన సొంత క్రిప్టోకరెన్సీ(లిబ్రా) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ బ్యాంకింగ్ రంగమంతా ఒత్తిడిలో పడింది. రెండు వందల కోట్లమందికిపైగా వినియోగదారులున్న ఫేస్‌బుక్ ఈ రంగంలోకి దిగితే.. ప్రపంచ బ్యాంకింగ్ రంగమంతా అతలాకుతలం అవుతుందని నిపుణులంటున్నారు. ఈ నేపథ్యంలో గాల్లో పుట్టే క్రిప్టోకరెన్సీకి ఎటువంటి విలువాలేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.