Creepy-Chinese-system-puts-your-name-and-photo-on-a-billboard

ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా రోడ్డు దాటినా.. బిల్‌బోర్డుపై ఫొటో చూపించి..

షాంఘై: రెడ్ సిగ్నల్ పడకపోయినా, ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటే పాదచారులు రోడ్డు దాటేస్తారు. అదే గనుక ఈ పని చైనాలో చేస్తే మన ఫొటో, ఐడీ నెంబర్ ఓ పెద్ద బిల్‌బోర్డుపై దర్శనమిస్తాయి. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మన వివరాలు పట్టేసే ఇక్కడి సిస్టం.. ‘పలానా వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇలా ప్రవర్తించాడు’ అంటూ అందరికీ చెప్పేస్తుంది. ఇటీవలే చైనా వెళ్లిన ఓ ప్రముఖ రచయిత బిల్‌బోర్డుపై వస్తున్న కొందరు ఫొటోలు, ఐడీ నెంబర్లు చూసి ఆశ్చర్యపోయాడు.

విషయమేంటని ఆరా తీసి షాకయ్యాడు. ఆ బిల్‌బోర్డును వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఆయన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా.. స్థానికులు మాత్రం 2018 నుంచే ఈ ప్రక్రియ మొదలైందని చెప్తున్నారు. దాదాపు చైనాలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకే ఈ పద్ధతిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.