Couple-face-up-to-six-years-in-jail-for-taking-sand-from-Italian-beach

40 కేజీల ఇసుక దొంగతనం.. దాదాపు ఆరేళ్ల జైలుశిక్ష

ఇటలీ: ఇటలీలోని సార్దీనియా బీచ్‌లో ఇసుకను దొంగిలించిన ఓ జంటకు కోర్టు దాదాపు ఆరేళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంది. అదేంటి ఇసుకను దొంగిలిస్తే జైలుశిక్షా? అని అనుకుంటున్నారా? గుప్పెడు ఇసుకను దొంగిలించినా కొన్ని దేశాలలో నేరమే. ఇటలీ బీచ్‌లలో ఇసుక తెలుపు రంగులో ఉంటుంది. అక్కడి బీచ్‌లో ఉన్న ఇసుకను, రాళ్లను దొంగిలిస్తే నేరం అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఓ జంట మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా 14 బాటిళ్లలో 40 కేజీల ఇసుకను తీసుకుని కారులో పెట్టుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఓ చెకింగ్ పాయింట్ వద్ద కారు అద్దంలో నుంచి ఇసుక బాటిళ్లు అధికారుల కంట పడటంతో వెంటనే వారు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఇసుకను తీసుకెళ్లడం నేరమనే విషయం తమకు తెలీదని ఆ జంట పోలీసులకు చెప్పింది. బీచ్‌లో ఎక్కడికక్కడ వివిధ భాషలలో బోర్డులను ఏర్పాటుచేశామని.. నేరమని తెలిసి కూడా వారు కావాలనే ఇసుకను దొంగిలించారంటూ పోలీసులు చెబుతున్నారు. కాగా, వారికి దాదాపు 3300 డాలర్ల(రూ. 23 లక్షల 62 వేలు) జరిమానా, ఏడాది నుంచి ఆరేళ్లలోపు జైలుశిక్షను కోర్టు విధించే అవకాశముంది.

Related Articles