Corona-effect-on-china-economy

ఆరోగ్యంగానే కాదు.. ఆర్థికంగానూ కుంగదీస్తోన్న కరోనా

  • మూతపడుతున్న విదేశీ కంపెనీల ప్లాంట్లు
  • దిగ్గజ సంస్థల వ్యాపారం బంద్‌
  • కోట్లాది మందికి ఉపాధి కరువు
  • చమురు, పర్యాటక విపణికీ దెబ్బ
  • విశాఖ రొయ్యలకు తగ్గిన ఆర్డర్లు
  • సెల్‌ఫోన్‌ విడిభాగాల ధరలు పైకి!
  • సూరత్‌ వజ్రాల పరిశ్రమకు ‘కరోనా’ ముప్పు
  • 2 నెలల్లో 8 వేల కోట్లు నష్టం వచ్చే అవకాశం
కంటికి కనిపించని సూక్ష్మజీవి.. దాదాపు 150 కోట్ల జనాభాతో, 13.6 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో కళకళలాడే డ్రాగన్‌ సామ్రాజ్యాన్ని గడగడ వణికిస్తోంది! ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ కుంగదీస్తోంది!! చైనా పొలిమేరలు దాటి 26 దేశాలకు విస్తరించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపుతోంది. చైనాలో ప్లాంట్లు ఉన్న యాపిల్‌, ఎయిర్‌బ్‌సలాంటి దిగ్గజ బహుళజాతి సంస్థలే కరోనా దెబ్బకు ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి. ఎన్నడూ లేనివిధంగా.. అంతర్జాతీయస్థాయిలో పేరొందిన బహుళజాతి సంస్థలు చైనాలో తమ వ్యాపారాలను నిలిపివేస్తున్నాయి.
 
వివిధ దేశాలు చైనాతో వాణిజ్యసంబంధాలను పునఃపరిశీలిస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు చైనా నుంచి, చైనాకు విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. కేవలం కరోనా వైరస్‌ కారణంగా.. చైనా వృద్ధి రేటు గత ఏడాది ఉన్న 6.1 శాతం నుంచి ఈ ఏడాది 5.6 శాతానికి పడిపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.2 శాతం మేర తగ్గుతుందని అంచనా. ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌.. కరోనా కారణంగా ఈ త్రైమాసికంలో చైనా జీడీపీలో ఒక శాతం నష్టం వస్తుందని అంచనా వేసింది.
 
ఉద్యోగాల కోత
పలు కంపెనీలు చైనాలో ఉన్న తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసేయడంతో కోట్ల మంది ఉపాధి కోల్పోతున్నారు. సేవారంగంలో కేవలం 5 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారనుకున్నా.. అది 2 కోట్ల మందికి సమానం అని చైనా ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా ఉద్యోగాలు కోల్పోయేవారి సంగతి. వారిపై ఆధారపడి జీవించేవారి సంఖ్య కూడా కోట్లలో ఉంటుందని అంచనా.
 
ఉద్యోగాల కోత ప్రభావం రుణాల చెల్లింపులపై పడుతుంది. అంటే.. మంచి ఉద్యోగాలు ఉన్నవారంతా బ్యాంకుల దగ్గర రకరకాల లోన్లు తీసుకుని ఉంటారు. అలా తీసుకున్న రుణాల మొత్తం చైనా జీడీపీకి 300ు ఉంటుందని అంచనా. వారిలో కొందరు బాకీలు తీర్చలేక చేతులెత్తేసినా.. చైనా ఆర్థిక పరిస్థితి ఊహించడానికే భయంగొలిపేలా తయారవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 
చమురుకు తగ్గిన గిరాకీ
ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశం.. చైనానే. చైనా చమురు వినియోగం ఒక రోజుకు 1.4 కోట్ల బ్యారెళ్లు. ఒక బ్యారెల్‌ అంటే.. 158.987295 లీటర్లు. అంటే.. రోజుకు 2225822130 కోట్ల లీటర్లు!! ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, యూకే, జపాన్‌, దక్షిణ కొరియా దేశాలన్నిటి ఒకరోజు చమురు వినియోగాన్ని కలిపినా చైనా కన్నే తక్కువేనని బ్లూమ్‌బెర్గ్‌ అంచనా. అలాంటిది... చైనాలో ఇప్పుడు కార్యకలాపాలన్నీ స్తంభించిపోవడంతో చమురు గిరాకీ 20 శాతం మేర తగ్గిపోయింది. దీంతో ఒపెక్‌ దేశాలన్నీ వియెన్నాలో సమావేశమై చమురు ఉత్పత్తిని రోజుకు 5 లక్షల నుంచి 10 లక్షల బ్యారెళ్ల మేర తగ్గించే అంశంపై చర్చిస్తున్నాయి.
 
ఇది ప్రపంచం మొత్తానికీ ఒకరోజు చేసే సరఫరాలో ఒక శాతం. మొత్తం సరఫరాలో ఒక శాతం అంటే చాలా తక్కువగా అనిపించొచ్చుగానీ.. రూపాయల్లో చూసుకుంటే అది చాలా పెద్ద మొత్తం. 2008-09 ఆర్థిక మాంద్యం తర్వాత చమురు మార్కెట్‌ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
 
పర్యాటకానికి దెబ్బ
ప్రపంచ జీడీపీలో 10.4 శాతం వాటా పర్యాటక రంగానిదే. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో 10 శాతం పర్యాటక రంగంలోనివే. అంతటి కీలకమైన రంగంపై కరోనా వైరస్‌ దెబ్బ తీవ్రంగా పడుతోంది. 2020 తొలి త్రైమాసికంలో పర్యాటక రంగం 3 నుంచి 4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ‘యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌’ అంచనా వేసింది. కానీ, కరోనా వైరస్‌ దెబ్బకు చైనాతోపాటు, ప్రపంచంలోని పలు దేశాలు పర్యాటక ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నాయి. చైనాతో సరిహద్దు ఉండే దేశాలన్నీ తమ సరిహద్దులను మూసేసుకుంటున్నా కూడా.. ఆయా దేశాలకు వెళ్లడానికి పర్యాటకులు సాహసించట్లేదు.
 
ఫలితంగా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతోంది. కరోనా వైరస్‌ వల్ల చైనా పర్యాటక రంగమే కాక. హాంకాంగ్‌ మకావు, మంగోలియా, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, ఇండోనేసియా, కంబోడియా, జపాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల పర్యాటకం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ఆసియాపసిఫిక్‌ ప్రాంత ట్రావెల్‌-టూరిజం ఆదాయంలో 51ు ఒక్క చైనా నుంచే వస్తోంది. దానికీ దెబ్బ పడినట్టే.
 
మన రొయ్యలపైనా..
కరోనా వైరస్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులపై పడింది. చైనాలో కరోన్‌ వైరస్‌ ఉధృతంగా ఉండడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార ఉత్పత్తులపై నిశిత పరిశీలన జరుగుతోంది. దాంతో అక్కడి నుంచి ఇక్కడి వ్యాపారులకు ఆర్డర్లు రావట్లేదు. దేశంలో రొయ్యల సాగులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఏపీలో ఉత్పత్తి చేసే వనామీ రకం రొయ్యలను జపాన్‌, అమెరికా, చైనా, యూరప్‌ తదితర దేశాలకు విశాఖపట్నం పోర్టు సహా వివిధ పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఇందులో ఫ్రోజెన్‌ ష్రింప్‌ (శీతలీకరణ చేసిన రొయ్యలు)కు డిమాండ్‌ అధికం. దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో ఏపీ వాటానే అధికం.
 
సెల్‌ఫోన్‌ విడిభాగాలు భగ్గు
కరోనా ప్రకంపనలు.. సెల్‌ఫోన్‌ విడిభాగాలపైనా ప్రభావం చూపుతున్నాయి. సెల్‌ఫోన్‌ స్పేర్‌ పార్ట్స్‌ కోసం దాదాపు 99ు దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. ఈ పరిస్థితుల్లో గురువారం నుంచి అన్ని రకాల స్పేర్‌ పార్ట్సుపైన 10-25ు ధరలు పెరగనున్నాయని వ్యాపారులు బుధవారం తమ ఖాతాదారులకు సందేశాలు పంపారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచే రిటైల్‌ వ్యాపారులు ధరలు పెంచేశారు. మరో నెల వరకు కరోనా ప్రభావం ఇలాగే ఉంటే సెల్‌ఫోన్‌ చార్జర్లు, బ్యాటరీలు తదితర 40 రకాల విడిభాగాల ధరలు రెట్టింపు కావచ్చని చెబుతున్నారు.
 
సూరత్‌ వజ్రాల మార్కెట్‌ కుదేలు
కరోనా వైరస్‌ దెబ్బ సూరత్‌లోని వజ్రాల పరిశ్రమపైనా భారీగా పడబోతోంది. సూరత్‌ వజ్రాలకు అతిపెద్ద మార్కెట్‌ హాంకాంగ్‌. కానీ, వైరస్‌ కారణంగా అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో వజ్రాల వ్యాపారానికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో అక్షరాలా 8 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటా సూరత్‌ నుంచి హాంకాంగ్‌కు రూ.50 వేల కోట్ల విలువైన పాలిష్డ్‌ వజ్రాలు ఎగుమతి అవుతాయి. కరోనా కారణంగా అక్కడికి వజ్రాల ఎగుమతులు తగ్గిపోనున్నాయి. అంతేకాదు.. వచ్చే నెలలో హాంకాంగ్‌లో తలపెట్టిన ‘అంతర్జాతీయ నగల ప్రదర్శన’ కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి.
 
మాపై వాణిజ్య ఆంక్షలు వద్దు
భారత్‌కు చైనా రాయబారి విజ్ఞప్తి
 చైనాలోని భారతీయుల రక్షణకు తీవ్రంగా కృషి చేస్తున్నామని భారత్‌లోని చైనా రాయబారి సున్‌ వెయ్‌డాంగ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో భారతదేశం తమ దేశంపై వాణిజ్య ఆంక్షలు విధించదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి స్వల్పకాలిక కష్టాలు తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపుతాయని.. దాన్ని ఎదుర్కొనే సమర్థ వ్యవస్థలు తమకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలూ ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని విస్తరించుకోవాలని ఆకాంక్ష వెలిబుచ్చారు.