ట్రంప్ పగ్గాలు చేపట్టాకే పూర్తి వివరాలు
హెచ్-1బీలో మార్పులు ఒక్క రోజులో జరగవు
ప్రస్తుతానికి అమరావతిలో కాన్సులేట్ పెట్టం
వీసాకు అప్లై చేసే అమ్మాయిల సంఖ్య పెరగాలి
అమ్మాయిల్ని తక్కువ చేసి పెంచొద్దు
అబ్బాయినే అమెరికా పంపే ఆలోచన మారాలి
అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ వెల్లడి
హైదరాబాద్ (18-01-2017): అమెరికాలోని ప్రతి నలుగురు ప్రవాసభారతీయుల్లో ఒకరు తెలుగువారు. ఆ విధంగా అమెరికా కాన్సులేట్ కూడా వారి జీవితాల్లో భాగమయిపోయింది. ‘‘వీసాలు జారీ చేయటంతో పాటుగా ఇక్కడ ప్రజలతో మమేకం కావటానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం..’’ అంటున్న అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక విషయాల గురించి చర్చించారు. నవంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వటం ఇదే తొలిసారి. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..
28 ఏళ్ల మీ ఫారిన్ సర్వీస్ కెరీర్ ఎలా సాగింది?
నేను చైనా, తైవాన్, రోమ్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్- ఇలా అనేక దేశాల్లో వేర్వేరు హోదాల్లో పనిచేశా. దౌత్య విభాగంలో పనిచేసే సమయంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. అందువల్ల అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు చైనాలో తియాన్మిన్ స్క్వేర్ సంఘటన జరిగిన సమయంలో- వాంగ్‌జో అనే ప్రాంతంలో పనిచేసేదాన్ని. ఆ సంఘటన జరిగిన వెంటనే అమెరికా దౌత్య సిబ్బందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు. అదే విధంగా రోమ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ వంటి దేశాల్లో రకరకాల అనుభవాలు. నేను లండన్‌లో పనిచేస్తున్న సమయంలో అమెరికాపై ఉగ్రదాడులు జరిగాయి. రోమ్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు- వాటికి సంబంధించిన అంశాలపై నేను పనిచేశా. ఈ అనుభవాలన్నింటి నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠమేమిటంటే- ఒక దేశం గురించి తెలుసుకోవాలంటే- అక్కడ ప్రజలను అర్థం చేసుకోవాలి. వారి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఆ దేశపు ఆత్మ అర్థమవుతుంది.
మీరు సమస్యాత్మకమైన అనేక ప్రాంతాల్లో పనిచేశారు కదా.. హైదరాబాద్ ఎలా ఉంది..
ఆ సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్నాను తప్ప.. నా వల్ల ఆ సంఘటనలు జరగలేదు.. (నవ్వులు) హైదరాబాద్‌లో ఇప్పటి దాకా ఏం జరగలేదు.. ఆ విధంగా చాలా అదృష్టవంతురాలిని..(నవ్వులు). హైదరాబాద్ కాన్సులేట్‌లో చాలా మంచి టీమ్ ఉంది. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకో విషయం గుర్తుకొచ్చింది. నా కెరీర్‌లో మొదటి పోస్టింగ్ చైనాలోని గాంగ్‌జ్వోలో. 1600 సంవత్సరంలో అక్కడి నుంచి చైనీయులు అమెరికాకు వెళ్లటం మొదలుపెట్టారు. నేను పనిచేసే సమయంలో 80 శాతం మంది చైనీయులు ఆ ప్రాంతం నుంచే అమెరికాకు వెళ్లేవారు. అందువల్ల కాన్సులేట్ వీసాలతో హడావిడిగా ఉండేది. హైదరాబాద్ కూడా అంతే. భారత నుంచి అమెరికాకు వెళ్లేవారిలో తెలుగువారి సంఖ్య చాలా ఎక్కువ. అమెరికాలో ఉన్న ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారే. అంతే కాకుండా భారత-అమెరికాల మధ్య స్నేహసంబంధాలు కూడా చాలా బావున్నాయి. అందువల్ల ఇక్కడ పనిచేయటం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.
మీ సర్వీసులో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు..
ఒక్కో దేశంలో ఒకే రకమైన సవాల్ ఎదురయ్యేది. ఉదాహరణకు రోమ్‌లో ఉన్నప్పుడు వారి ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని కోట్ల మంది యువకులు నిరుద్యోగులుగా మిగిలారు. వారికి ఉపాధి కల్పించే ప్రక్రియను ప్రారంభించటం ఒక సవాలు. ఆఫ్ఘనిస్తాన్‌లో అనేక పరిమితులకు లోబడి పనిచేయాలి. సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాం. ఆఫ్ఘనిస్థాన్ మహిళల కోసం ఒక ప్రత్యేకమైన ఫెలోషిప్ ప్రోగ్రాంను ప్రారంభించాం. అక్కడి మహిళలను కలుసుకోవటం.. వారి గురించి కార్యక్రమాలు నిర్వహించటం ఒక సవాలు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే- అమెరికా, యూర్‌పలతో పోలిస్తే ఇక్కడ ఆదాయాలు తక్కువ ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల్లో మాత్రం తమ పిల్లల భవిష్యత్తు పట్ల అపారమైన ఆశ ఉంది.
ఒక మహిళగా మీరెప్పుడూ వివక్ష ఎదుర్కోలేదా?
ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు మద్దతు ఇచ్చిన వారందరూ పురుషులే. అయితే అందరికీ నాలాంటి అనుభవాలే ఉంటాయని అనుకోను. ఇప్పటికీ స్టేట్ డిపార్ట్‌మెంట్ (అమెరికా విదేశాంగ శాఖ)లో మహిళల సంఖ్య సగం ఉందనుకోను. ఈ మధ్య కాలంలో పరిస్థితులు చాలా మారాయి. ముగ్గురు మహిళలు అమెరికా విదేశాంగ మంత్రులయ్యారు. మీకో ఆసక్తికరమైన విషయం చెబుతాను. 1974 దాకా అమెరికా విదేశాంగశాఖకు చెందిన మహిళా అధికారి ఎవరైనా పెళ్లి చేసుకుంటే తమ పోస్ట్‌కు రాజీనామా చేయాలి. అలాంటి పరిస్థితి నుంచి చాలా ముందుకు వచ్చాం. అయితే.. ఇప్పటికీ అన్‌కాన్షెస్ బయాస్ (తెలియకుండానే జరిగే వివక్ష) మన సమాజంలో ఉంది.
మీ దృష్టిలో అలాంటి వివక్ష అంటే..
చాలా సందర్భాలలో మహిళలకు తమ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉండదు. చిన్నప్పటి నుంచి వారిలో తాము తక్కువనే భావనను మన సమాజం కలుగజేస్తుంది. దీని వల్ల వారికి తమ సామర్థ్యంపై అనుమానం ఉంటుంది. అదే సమయంలో కొందరు పురుషులకు తమ సామర్థ్యంపై ఎక్కువ నమ్మకం ఉంటుంది (నవ్వులు). అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చీఫ్ సైంటిస్ట్ నాకు తెలుసు. ఆమెను కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించుకుంటూ ఉంటాం. నాసాలో మహిళల సంఖ్య ఎందుకు తక్కువ ఉంది? అనే విషయంపై చర్చ జరిగినప్పుడు- మహిళలు ఎక్కువ మంది దరఖాస్తు చేయటం లేదని తేలింది. దీనికి కారణం వారికి తమ సామర్థ్యంపై నమ్మకం లేకపోవటమే. నాసాలాంటి సంస్థలోనే ఇది జరుగుతోందంటే.. మిగిలిన చోట్ల ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
మీ దృష్టిలో దీనికి కారణమేమిటి? భారత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు..
ఇది ఏ ఒక్కరో కావాలని చూపించే వివక్ష కాదు. సహజంగా సమాజంగా మమేకమైపోయి ఉంటుంది. అయితే అందరు మహిళలకు అలాంటి అనుభవాలే ఉండాల్సిన అవసరం లేదు. మా అమ్మనాన్నలు కూడా చాలా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. వారి కుటుంబాలలో పురుషులకే ప్రాధాన్యం ఎక్కువ. మా అమ్మ హోమ్ మేకర్. పెద్దగా చదువుకోలేదు. అయినా మేమందరం చదువుకోవాలనుకుంది. ఇక భారత విషయానికి వస్తే- ఇక్కడి పరిస్థితులు నాకు పూర్తిగా తెలియవు. ఇప్పటి దాకా నేను కలిసిన వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు నాకు తెలియదు. చైనా, తైవాన్‌లలో మాత్రం సొంత వ్యాపారాలు చేసే మహిళల సంఖ్య చాలా ఎక్కువ.
హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలపై శ్రద్ధ చూపిస్తుంది?
అమెరికన్ కాన్సులేట్ కొత్త బిల్డింగ్ శంకుస్థాపన ఈ ఏడాది ఆగస్టులో జరుగుతుంది. 2020 నాటికి పూర్తవుతుంది. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లోని ప్రజల పట్ల మాకున్న కమిట్‌మెంట్‌కు దీనిని చిహ్నంగా భావించవచ్చు. కాన్సులేట్ కేవలం వీసాలు జారీ చేయటం మాత్రమే కాదు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. బాలికలు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలనేది నా ఉద్దేశం. దీనికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక బూట్ క్యాంప్ నిర్వహించాం. దీనికి చాలా స్పందన వచ్చింది. హైదరాబాద్ నుంచి ఉన్నత చదువులు చదువుకోవటానికి వీసాలు అప్లై చేసేవారిలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. బహుశా పైన మనం మాట్లాడుకున్న అన్‌బయాస్డ్ డిస్ర్కిమినేషన్ దీనికి కారణం కావచ్చు. ఇది ఒక రోజులో తొలగిపోతుందని నేను అనుకోవటం లేదు. కానీ అమ్మాయిలను అమెరికాకు పంపేలా- తల్లిదండ్రులను ప్రోత్సహించాలనేది మా ఉద్దేశం. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నా దృష్టిలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చదువుకుంటారు. వారు అమెరికాకు వెళ్లి బాగా చదువుకుంటే- మాకు మంచిది. వారు తిరిగి వచ్చి ఇక్కడ వ్యాపారాలు ప్రారంభిస్తే భారత ఆర్థిక వ్యవస్థకూ మంచిది.
చాలా సందర్భాలలో మహిళలకు తమ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉండదు. చిన్నప్పటి నుంచి వారిలో తాము తక్కువనే భావనను మన సమాజం కలుగజేస్తుంది. దీని వల్ల వారికి తమ సామర్థ్యంపై అనుమానం ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రుల తీరు మారాలి.
వీసాలకు అప్లై చేసేవారిలో అమ్మాయిల సంఖ్య తక్కువుంది. ఇది పెరగాలి. ఒక కుటుంబంలో అమ్మాయిని అమెరికా పంపాలా? లేక అబ్బాయిని పంపాలా? అనే మీమాంస వస్తే- అబ్బాయినే పంపుతారు. అలాంటి పరిస్థితి మారాలి.
గత ఏడాది హైదరాబాద్ నుంచి జారీ చేసే వీసాల సంఖ్య 25 శాతం పెరిగింది. ఇది మరింతగా పెరిగే అవకాశముంది. మేం కొత్తగా నిర్మిస్తున్న భవంతిలో వీసాలు జారీ చేయటానికి 50 విండోస్ ఉంటాయి. ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నాయి.
హెచ్1బీ వీసాలకు సంబంధించిన విషయాలలో అందరూ ఉత్కంఠగా ఉన్నారు. ఈ విషయంలో మార్పులు తప్పకుండా వస్తాయి. కానీ అవి ఎలా ఉంటాయనే విషయం- అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేసి- కొత్త పాలనావ్యవస్థ కుదురుకుంటే తప్ప తెలియదు. ఈ మార్పులు కూడా ఒక్క రోజులో జరగవు. అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్‌పై మార్పులు చేసినా.. అమెరికా కాంగ్రెస్ లో మార్పులు ప్రవేశపెట్టినా చర్చ తప్పకుండా జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో కట్టిన తాత్కాలిక కార్యాలయాలు చూశా.. చాలా బావున్నాయి. ‘‘మేము కార్యాలయం కట్టడానికి మూడేళ్లు పడుతుంది. మీరు చాలా త్వరగా కట్టేశారు..’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జోక్ చేశా. హైదరాబాద్ నుంచి విజయవాడ పెద్ద దూరం కాదు. అందువల్ల అక్కడ ప్రస్తుతానికి వేరే కార్యాలయం ప్రారంభించాలనుకోవటం లేదు.
www.usief.org.in
-సీవీఎల్‌ఎన్ ప్రసాద్
ఫొటోలు: అశోకుడు