Choppers-are-used-to-drop-Food-for-Animals

ఆహార వర్షం.. మూగజీవాల హర్షం

సిడ్నీ :కార్చిచ్చుతో బుగ్గి అయిన ఆస్ట్రేలియా అభయారణ్యాల్లో ఆకలితో విలవిలలాడుతున్న జంతువుల సహాయార్ధం న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం ‘ఆపరేషన్‌ రాక్‌ వల్లబీ’ చేపట్టింది. ఇందులో భాగంగా 2,200 కిలోల కేరట్‌, చిలగడదుంపలను హెలికాప్టర్ల నుంచి అడవుల్లోకి జారవిడిచారు. అడగని వరంలా.. ఆకాశం నుంచి వచ్చిపడిన దుంపలను తినేందుకు జంతువులు ఎగబడిన ఫొటోలు సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వల్లబీ’ అనేది కంగారూ జాతికే చెందిన క్షీరదం. కొండలు, పర్వత ప్రాంతాల్లోనే నివసించడం వల్ల వాటికి ‘రాక్‌ వల్లబీ’ అనే పేరొచ్చింది.

ఆస్ట్రేలియాకే ప్రత్యేకమైన వల్లబీలను కాపాడుకునేందుకు చేపట్టినందున ఈ ఆపరేషన్‌కు ‘రాక్‌ వల్లబీ’ అని పేరుపెట్టారు. అయితే ఈ సహాయక చర్యతో ఆయా అడవుల్లోని అరుదైన కంగారూలు, గ్లైడర్లు, పొటొరూస్‌, కాకటూస్‌, హనీఈటర్స్‌ల ఆకలీ తీరనుంది. కాగా, అంతరించిపోతున్న జీవరాశుల జాబితాలో కోలాలను చేర్చాలని ఆస్ట్రేలియా యోచిస్తోంది. అడవుల్లో కార్చిచ్చుతో ప్రభావితమైన ప్రాంతాల్లో మానసిక ఆరోగ్యసేవల కోసం 76 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల అత్యవసర సహాయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ ప్రకటించారు.