Chemistry-noble-goes-to-Lithium-battery-innovators-

లిథియం అయాన్‌ బ్యాటరీ సృష్టికర్తలకు నోబెల్ పురస్కారం

  • 97ఏళ్ల వయసులో గుడ్‌నౌకు దక్కిన బహుమతి
స్టాక్‌హోమ్‌, అక్టోబరు 9: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌ నుంచి రహదారులపై రయ్య్‌మని పరుగులు తీసే ఎలక్ట్రిక్‌ బస్సు దాకా.. నడిపించే ‘శక్తి’ లిథియం అయాన్‌ బ్యాటరీ! చిన్న సైజు.. రీచార్జింగ్‌లో రారాజు! ఎలకా్ట్రనిక్‌ యు గాన్ని కొత్తమలుపు తిప్పిన లిథియం అయాన్‌ బ్యాటరీ సృష్టికర్తలు ఈ ఏటి నోబెల్‌ బహుమతి విజేతలుగా నిలిచారు. అమెరికాకు చెంది న జాన్‌ గుడ్‌నౌ, బ్రిటన్‌ శాస్త్రవేత్త విట్టింగ్‌హామ్‌, జపాన్‌ శాస్త్రవేత్త అకీరా యోషినోలను సంయుక్తంగా రసాయన శాస్త్ర నోబెల్‌ వరించింది.
 
వీరిలో జాన్‌ గూడ్‌నౌ వయసు 97 ఏళ్లు కావడం విశేషం! అత్యం త పెద్దవయస్కుడైన నోబెల్‌ విజేతగా ఆయన చరిత్ర సృష్టించారు. నీటిలో తేలేంత తేలికగా ‘లిథియం’ను బ్యాటరీగా మార్చడం వెనుక ఈ ముగ్గురి కృషి, మేథస్సు దాగి ఉన్నాయి. ‘‘స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు మొదలుకుని ఎలక్ట్రిక్‌ వాహనాలను నడిపించే.. సౌర, పవన విద్యుత్తును భారీగా నిల్వ చేసుకోగలిగే లిథియం అయాన్‌ బ్యాటరీల ఆవిష్కరణ ఒక విప్ల వం. 1991లో అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాటరీ మానవ జీవితాలను మార్చేసింది’’ అని నోబెల్‌ విజేతలను ఎంపిక చేసే రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం ప్రకటించింది.
 
ఎవరేం చేశారు?
విట్టింగ్‌హ్యామ్‌ (77): 1970లలో ప్రపంచాన్ని చమురు సంక్షోభం చుట్టుముట్టింది. ప్రత్యామ్నాయ ఇంధనం వనరును సృష్టించడంపై విట్టింగ్‌హ్యామ్‌ దృష్టి సారించారు. నీటిలో సైతం తేలియాడే లోహం లిథియంతో ప్రయోగాలు చేశారు. ఎలకా్ట్రన్‌లను వెలువరించే లక్షణమున్న ఈ లోహం ద్వారా శక్తిని బదిలీ చేయవచ్చునని గుర్తించారు. పాక్షికంగా లిథియంను ఉపయోగిస్తూ బ్యాటరీని తయారు చేశారు. అయితే... ఇది స్థిరమైన పనితీరును కనపరచలేకపోయింది.
 
జాన్‌ గుడ్‌నౌ (97): విట్టింగ్‌హ్యామ్‌ పరిశోధనను గుడ్‌నౌ మరింత ముందుకు తీసుకెళ్లారు. లిథియంకు తోడుగా మరో రకం లోహాన్ని ఉపయోగించి... శక్తిని నిల్వ చేసే సామర్థ్యాన్ని నాలుగు వోల్టులకు పెంచగలిగారు. విట్టింగ్‌హ్యామ్‌ రూపొందించిన తొలి బ్యాటరీ సామర్థ్యం రెండు వోల్టులు మాత్రమే.
 
అకీరా యోషినో (71): లిథియం అయాన్‌ బ్యాటరీని పూర్తిస్థాయిలో రూపొందించిన ఘనత అకీరా యోషినోకు దక్కుతుంది. ఆయన లిథియం అయాన్లను నిల్వ చేసుకునే కార్బన్‌ బేస్డ్‌ పదార్థంతో తన ప్రయోగాలు కొనసాగించారు. చివరికి... 1991లో లిథియం అయాన్‌ బ్యాటరీ మార్కెట్‌లోకి వచ్చింది.
 
‘ఖగోళ’ శోధకులకు భౌతిక నోబెల్‌
విశ్వాంతరాళాన్ని మరింత విడమరిచి చెప్పేందుకు అనేక పరిశోధనలు చేసిన ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్‌ పీబుల్స్‌, వ్యోమగాములు మిషెల్‌ మేయర్‌, డిడీర్‌ క్వెలోజ్‌లను భౌతిక శాస్త్ర నోబెల్‌ వరించింది. కెనడా సంతతికి చెందిన అమెరికన్‌ జేమ్స్‌కు సగం.. మరో ఇద్దరికి మిగిలిన సగం బహుమతి దక్కుతుందని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. మహా విస్ఫోటం(బిగ్‌బ్యాంగ్‌) తర్వాత ఈ విశ్వం ఎలా ఏర్పడిందో మరింత విశదీకరించే సిద్ధాంతాలను జేమ్స్‌ పీబుల్స్‌ రూపొందించారు. విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు, మానవాళిని కలిపినా 5 శాతమేనని, మిగిలిన 95% అంతుతెలియని ‘డార్క్‌ మ్యాటర్‌ - డార్క్‌ ఎనర్జీ’తోనే తయారైందని జేమ్స్‌ పీబుల్స్‌ పేర్కొన్నారు. భౌతిక నోబెల్‌లో మరో సగ భాగాన్ని దక్కించుకున్న మేయర్‌, క్వెలోజ్‌లు సౌర వ్యవస్థకు ఆవల, పాలపుంతలోని ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని 1995లో గుర్తించారు. దీనికి ‘51 పెగాసస్‌ బి’ అని పేరు పెట్టారు.