California-Passes-Landmark-Bill-to-Remake-Gig-Economy

కాలిఫోర్నియా కీలక నిర్ణయం.. ఇకపై ఉబెర్ డ్రైవర్లూ ఉద్యోగులే..

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉబెర్ వంటి సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వ్యక్తులకు ఉద్యోగ భద్రత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉబెర్, జొమాటో వంటి ప్రముఖ సంస్థల కోసం పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదంటూ గతంలో కొందరు డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో వీరి కోసం కొత్త చట్టం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల కాలిఫోర్నియా సెనేట్‌లో ఈ బిల్లు 29-11 ఓట్ల తేడాతో నెగ్గింది. దాంతో గవర్నర్ గావిన్ న్యూసమ్ వద్దకు చేరిన ఈ బిల్లుపై ఆయన త్వరలోనే ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అప్పుడు ఉబెర్, లిఫ్ట్, జొమాటో వంటి సంస్థల్లో కాంట్రాక్టు వర్కర్లుగా ఉన్న ఈ రైడర్లంతా ఉద్యోగులుగా మారతారు.

ఇప్పటి వరకు కనీస వేతనం, ఆరోగ్యబీమా వంటి సౌకర్యాలేవీ లేకుండానే వీరంతా సదరు సంస్థల కోసం చెమటోడుస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించామని, దీనికి సెనేట్ ఆమోదముద్ర వేయడం సంతోషకరమని కొందరు నేతలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే కాంట్రాక్టర్లకు పనిలో స్వేచ్ఛ ఉంటుందని, వారిని ఉద్యోగులుగా గుర్తిస్తే తమ వ్యాపారాలు నాశనమవుతాయని ఉబెర్ వంటి సంస్థలు వాపోతున్నాయి.

కాలిఫోర్నియా తీసుకున్న ఈ నిర్ణయంతో న్యూయార్క్, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో కూడా కాంట్రాక్టు వర్కర్ల డిమాండ్లు పెరిగిపోతున్నాయి. గతంలో ఇలాంటి చట్టాలు చేయడానికి ప్రయత్నించిన న్యూయార్క్ వంటి కొన్ని రాష్ట్రాలు మళ్లీ తమ పాత బిల్లులకు దుమ్ము దులిపి బయటకు తీస్తున్నాయి.

Related Articles