Brit-tourist-eaten-by-shark-off-island-of-Reunion

సొరచేప పొట్టలో దొరికిన వస్తువు చూసి అధికారులు షాక్

బెల్జియమ్: పర్యాటకులకు ముప్పుగా మారిన ఓ సొరచేపను అధికారులు అంతం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మడగాస్కర్‌కు 500 మైళ్ల దూరంలో ఉన్న రీయూనియన్ ఐలాండ్‌కు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే అక్కడ బీచ్‌లలో సొరచేపలు తిరుగుతుండటంతో పర్యాటకులు స్విమ్మింగ్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో అధికారులు మనుషులపై దాడి చేసే ప్రమాదకరమైన టైగర్ సొరచేపను అంతమొందించారు. మరో ఐదు ప్రమాదకరమైన సొరచేపలను కూడా తాము ఐలాండ్‌లో గమనించినట్టు తెలిపారు. 

ఇదిలా ఉండగా... చనిపోయిన సొరచేప శరీరాన్ని కోయగా.. సొరచేప పొట్టలో అధికారులకు ఓ మనిషి చేయి కనిపించింది. ఉంగరం పెట్టుకుని ఉన్న ఆ చేయిను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. గత శనివారం స్కాట్లాండ్‌కు చెందిన ఓ పర్యాటకుడు బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తూ అదృశ్యమవడంతో.. ఈ చేయి అతడిదేమోనని అధికారులు అనుమానించారు. చేతికి ఉన్న ఉంగరం తన భర్తదేనని ఆ పర్యాటకుడి భార్య చెప్పడంతో.. చనిపోయింది అదృశ్యమైన వ్యక్తేనని అధికారులు నిర్ధారించారు. భార్యతో కలిసి ఐలాండ్‌కు వచ్చిన అతను.. శనివారం మధ్యాహ్నం నీళ్లలోకి దిగి అదృశ్యమయ్యాడని అధికారులు తెలిపారు. భార్య సమాచారం ఇవ్వడంతో బీచ్ మొత్తం వెతికామని, అయినా అతడి ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. కాగా, సొరచేప పొట్టలో చేయి దొరకడంతో అతడు నీళ్లలోనే మరణించినట్టు తెలిసిందన్నారు. అయితే.. సొరచేప అతడిని చంపిందా లేదా అతడు నీళ్లలో మునిగిపోయాక సొరచేప అతడిని తినిందా అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం వివరాలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.