Brain-Dead-NRI-Gives-New-Lease-of-Life-to-Five

అవయవదానంతో ఐదుగురికి ప్రాణం పోసిన ఎన్నారై మహిళ...

అహ్మదాబాద్: యూఎస్‌లోని సౌత్ కరోలినాకు చెందిన ఎన్నారై మహిళ తాను చనిపోతూ అవయవదానంతో మరో ఐదుగురికి ప్రాణాలు పోసింది. 2018, మే నెలలో కరోలినాలో డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినప్పుడు తాను అసహజ మరణం పొందితే తన శరీర అవయవాలను అవసరమైన వారికి దానం చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో షీలా ఇటీవల ఆమె బంధువుల పెళ్లి కోసం గుజరాత్‌కు వచ్చి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను ఐదుగురికి అమర్చి వారికి కొత్త జీవితాలనిచ్చారు సూరత్ వైద్యులు. 

వివరాల్లోకి వెళితే... షీలా దేశాయ్(56) అనే ఎన్నారై మహిళ సౌత్ కరోలినాలోని గ్రీన్‌వుడ్‌లో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. షీలా ఫ్యామిలీకి అక్కడ సొంత హోటల్ ఉంది. అయితే, బంధువుల పెళ్లి కోసమని నవంబర్ 21వ తేదీన గుజరాత్‌లోని వల్సద్ జిల్లాకు వచ్చింది. డిసెంబర్ 7న పెళ్లి షాపింగ్ కోసం తన సోదరి రూపాళితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో షీలా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో షీలా తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో ఆమెను చికిత్స కోసం వల్సద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి  ఆమెను సూరత్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో న్యూరో సర్జన్ డాక్టర్ లియట్ షా ఆమెకు చికిత్స అందించారు. 

 షా వైద్య బృందం షీలాను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డిసెంబర్ 12న ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో డొనేట్ లైఫ్ ఎన్జీఓ ప్రతినిధి నిలేష్ మండ్లేవాలా.. షీలా కుటుంబ సభ్యులను ఆమె అవయవ దానం గురించి వాకాబు చేశారు. ఆ సమయంలో వారికి ఆమె కరోలినాలో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు సమయంలో తాను అసహజ మరణం పొందితే తన అవయవాలు దానం చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సమ్మతి తెలిపిన విషయం తెలిసింది. దాంతో షీలా కుటుంబ సభ్యులు కూడా అవయవ దానానికి అంగీకరించారు. వారి అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు షీలా కిడ్నీలు, లీవర్, కళ్లను అవసరమైన ఐదుగురికి అమర్చి వారికి కొత్త జీవితాలనిచ్చారు.