Bonalu-celebrations-in-London-hosted-by-TAUK-

లండన్‌లో ఘనంగా "టాక్ బోనాల జాతర" వేడుకలు

  •  ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు వేషధారణ, తొట్టెల ఊరేగింపు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 800కి పైగా ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, ఇండియన్ హైకమిషన్  ప్రతినిథి ప్రేమ్‌జీత్, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టుగానే సంప్రదాయ బద్దంగా పూజలను నిర్వహించారు.  లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు.. ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా ముగ్దులను చేసింది. టాక్ ఎన్నో సంవత్సరాలుగా లండన్‌లో బోనాలు జరుపుతున్నప్పటికీ.. మొట్టమొదటిసారిగా పోతురాజు బోనాలు ఊరేగింపును నిర్వహించడంతో ప్రవాసీయుల నుంచి సంస్థ ప్రశంసలందుకుంది. పోతురాజు వేషధారణను ధరించిన శ్రీ. జయ్ రెడ్డి గారు ప్రత్యేకించి అమెరికా నుంచి లండన్ రావడంతో ఆయనను ప్రవాసులే కాక కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సైతం ప్రశంసించి సత్కరించారు.
 
బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి రత్నాకర్ కడుదుల స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు. భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజసేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని కొనియాడారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, అందరం ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని గమనిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా ఉన్నట్టు తెలుకున్నామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రతి పథకాన్ని ప్రవేశపెడుతోందని అన్నారు. ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
 
ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించారన్నారు. ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసి అభినందించారు. ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి ప్రేమ్‌ జీత్ మాట్లాడుతూ.. బోనాల వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరును  ప్రశంసించారు. తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.. నాడు బాద్యత గల తెలంగాణ బిడ్డలుగా ఉద్యమంలో, నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శంగా ఉందని తెలిపారు. టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు, రాష్ట్ర పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డపై చాటిచెబుతోందన్నారు. భారత హై కమిషన్ టాక్ సంస్థకు అన్ని రకాల సహాయ సహకారాలను ఎప్పటిలానే అందిస్తుందని తెలిపారు. ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
ఎంపీ రూత్ క్యాడ్బరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎదో ఒక కారణం వల్ల ఈ వేడుకలలో పాల్గొనలేకపోయానని చెప్పారు. కానీ, ఈసారి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంత గొప్ప సాంస్కృతిక వేడుకల్లో ఇంతకు ముందు పాల్గొనలేక పోయినందుకు బాధపడుతున్నానని తెలిపారు. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకుని భావితరాలకు సంస్కృతి గురించి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తోందని, ముఖ్యంగా మహిళలంతా ముందుండి ఈ వేడుకల్ని నిర్వహించడం సాటి మహిళగా గర్వంగా ఉందని తెలిపారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని, అందరం కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని చెప్పారు. సంస్థ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు.   ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపుచేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి, అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. బోనాల జాతర వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించడమే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు, సలహాలు ఇస్తూ టాక్ సంస్థను ముందుకు నడిపిస్తున్న నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు.
 
టాక్, ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందిరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందని, ఒక నాడు పండుగలంటే కేవలం సంక్రాంతి - ఉగాది మాత్రమేనని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నారైలలో ఇంతటి స్ఫూర్తిని నింపి, ముఖ్యంగా టాక్ సంస్థను ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి వచ్చి పోతురాజు వేషధారణతో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జైరెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ సంస్థ గురించి, తెలంగాణ ప్రజల కోసం, ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్నతెలంగాణ బిడ్డల కోసం తాము చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరు తాము చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి, బంగారు తెలంగాణలో  ఎన్నారైల పాత్ర గురించి అందరికి గుర్తు చేశారు. అలాగే బోనాల వేడుకైనప్పటికీ, భాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా చేనేతకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని, మాజీ రాష్ట్రమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్టు అందరం ఒక రోజు చేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు.
 
ప్రముఖ నృత్య కళాకారిణి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత రాగసుధా వింజమూరి చేసిన మహాశక్తి నృత్యం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని సంస్థ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులందజేశారు. సంప్రదాయ తెలంగాణ వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్,  హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దులను సత్కరించి జ్ఞాపికను అందచేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది. టాక్ సభ్యులు  స్వాతి బుడగం, నవీన్ రెడ్డి, సుప్రజ పులుసు, సత్య చిలుముల, ప్రవీణ్ వీర, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.
 
ఇతర ఎన్నారై సంఘాల(జాగృతి యూకే, తాల్, యుక్తా, రీడింగ్ బతుకమ్మ జాతర, హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (హెచ్‌వైఎఫ్‌వై), జీయర్ ట్రస్ట్(జెట్), ఎన్నారై టీఆర్ఎస్ యూకే’ ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, టాక్ అడ్వైజరీ చైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షులు స్వాతి బుడగం, అడ్వైజరీ వైస్ చైర్మన్ మట్టా రెడ్డి, సభ్యులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, శుషుమ్న రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, మమతా జక్కి, శ్రీ శ్రావ్య, శైలజ, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

 

Related Articles