Boianapalli-Vinod-Kumar-meets-with-US-Ambassador

తెలంగాణలో త్వరలో అమెరికా యూనివర్సిటీలు

తెలంగాణలో మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమలు

అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం

వాషింగ్టన్: అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్‌ను వాషింగ్టన్ డీసీలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమెరికా-తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం-2019 ముసాయిదాను రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్ అమెరికా రాయబారితో భేటీ అయ్యారు.  

త్వరలో పార్లమెంట్‌లో నూతన విద్యా చట్టాన్ని కేంద్రం తీసుకురానున్న విషయాన్ని, నూతనంగా రిసెర్చ్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వినోద్ కుమార్ అమెరికా రాయబారి దృష్టికి తెచ్చారు.  ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యున్నత విశ్వ విద్యాలయాల గురించి రాయబారితో ఆరా తీశారు. విదేశీ విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అనువైనదిగా వినోద్ అమెరికా రాయబారికి వివరించారు. అమెరికాలోని టాప్ విశ్వ విద్యాలయాలు తెలంగాణలో ఏర్పాటుకు సహకారాన్ని అందించాలని వినోద్ కుమార్ రాయబారిని కోరారు. తెలంగాణలో ఫార్మా, ఐటీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఔత్సాహిక ఎన్నారైలను ఆహ్వానించిన విషయాన్ని ఆయన అమెరికా రాయబారికి తెలియజేశారు.

అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షురాలితో భేటీ
అమెరికా-భారత వ్యాపార, వాణిజ్య మండలి అధ్యక్షురాలు, యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నిషా బిస్వాల్‌తో వినోద్ కుమార్ శుక్రవారం వాషింగ్టన్ డీసీలో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఫార్మా, ఐటీ పరిశ్రమలు మరిన్ని నెలకొల్పేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అంశంపై వినోద్ కుమార్ ఆమెతో చర్చించారు. పార్లమెంట్‌లో నూతన బీమా చట్టం ఆమోదం పొందనున్న నేపథ్యంలో బీమా రంగంలో తెలంగాణలో చేపట్టే పలు విషయాలపై ఈ సందర్భంగా బిస్వాల్‌తో వినోద్ కుమార్ మాట్లాడారు. ఆ ఇద్దరితో సమావేశమైన ప్రతినిధి బృందంలో డాక్టర్ దేవయ్య, పుష్కూర్ దయాకర్ రావు, రవి పులి తదితరులు ఉన్నారు.