Blind-Japanese-Sailor-Sets-Record

అమెరికా నుంచి జపాన్‌కు బోటు నడుపుకుంటూ వచ్చేసిన అంధ నావికుడు

టోక్యో: జపాన్‌కు చెందిన మిట్సుహిరో ఇవామోటో(52) అనే ఓ అంధ నావికుడు చరిత్ర సృష్టించాడు. కళ్లు లేనప్పటికీ 12 మీటర్ల బోటులో అమెరికా నుంచి జపాన్‌ వరకు పసిఫిక్ సముద్రంలో(14 వేల కిలోమీటర్లు) ప్రయాణం చేసుకుంటూ వచ్చేశాడు. శనివారం జపాన్‌కు చేరుకున్న ఇవామోటోకు అనేకమంది ఘనస్వాగతం పలికారు. ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలో మరోవ్యక్తి(దారి చెప్పడానికి)తో కలిసి ప్రయాణం మొదలుపెట్టగా.. శనివారం ఫుకుషిమా పోర్టుకు విజయవంతంగా చేరుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఇలాంటి సాహసమే చేయగా.. మధ్య దారిలో తిమింగలం బోటుకు తగలడంతో బోటు మునిగిపోయింది. అయినప్పటికీ ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి అంటూ మరోసారి సాహసం చేసి విజయం సాధించాడు. విజయవంతంగా తన ఇంటికి చేరుకోవడం గర్వంగా ఉందంటూ తన కల నెరవేరిందని ఇవామోటో ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఇవామోటోకు 16 ఏళ్ల వయసులో అనుకోని పరిస్థితుల్లో చూపును కోల్పోయారు. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదంటూ అప్పటి నుంచి విరాళాలను సేకరిస్తూ ఎంతో మంది సహాయపడుతూ వస్తున్నారు.