Big-Shock-to-Trump

ట్రంప్‌కు ముకుతాడు!

ఆంధ్రజ్యోతి, 09-11-2018: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బ. అధ్యక్షుడిగా ఎన్నికైన రెండేళ్ళకు ఆయన ఇంతకాలమూ అనుభవించిన ఏకచ్ఛత్రాధిపత్యానికి తూట్లు పడ్డాయి. అధ్యక్షుడి వీరంగానికి అడ్డుకట్టలు వేయగలిగే శక్తిని డెమోక్రాట్లు ఎనిమిదేళ్ళలో తొలిసారి దిగువసభలో తెచ్చుకున్నారు. డెమోక్రాట్ల ఆధిపత్యంతో ఇకపై తన పాలన నల్లేరుమీద నడక కాబోదని ట్రంప్‌కు అర్థమై ‘సయోధ్యతో వ్యవహరిస్తే సరే, వైట్‌హౌస్‌ జోలికి వస్తే మాత్రం మహా యుద్ధం తప్పద’ని హెచ్చరిస్తున్నాడు. సెనేట్‌లో రిపబ్లికన్ల ఆధిక్యం పెరగడం ట్రంప్‌కు ఉపశమనం.

 
ఫలితాలు అద్భుతం, అమోఘం అంటూ ట్వీట్లు చేస్తున్నప్పటికీ, తన రెండేళ్ళపాలనమీద రెఫరెండమ్‌ అంటున్న ఈ ఎన్నికల్లో విపక్షం అద్భుతాలు చేసిందని ట్రంప్‌కు తెలుసు. ఉభయసభల్లోనూ రిపబ్లికన్లకు మెజారిటీ సాధించి పెట్టలేక చతికిలబడిన ఆయన తన పార్టీ నాయకులను దిగువసభ వైఫల్యానికి కారకులుగా విమర్శిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవడానికి ట్రంప్‌ కొన్ని కొత్త అస్త్రాలు వెలికితీశారు.
 
అమెరికా పౌరులు కానివారు, వలసదారులకు అమెరికాలో పుట్టిన పిల్లలకు పుట్టుకతో సంక్రమించే పౌరసత్వ హక్కును రద్దుచేస్తానని ప్రకటించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రుల వలసస్థితి, పౌరసత్వంతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టే పిల్లలు అమెరికా పౌరులు అవుతున్నారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం లేకుండా అధ్యక్షాదేశంతో ఈ పని జరగదనీ, న్యాయస్థానాలు ఊరుకోవనీ ట్రంప్‌కు తెలుసు. కానీ, ఎన్నికల ముందు విద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టించి, డెమోక్రాట్ల ఓటుబ్యాంకును ఛిన్నాభిన్నం చేయడం లక్ష్యం. ఏడువేలమంది వలసదారులను అడ్డుకోవడానికి వేలాదిమంది సైనికులను అమెరికా సరిహద్దుల్లో మోహరించి తానొక యుద్ధం చేస్తున్న భావనను ప్రజలకు కలిగించే ప్రయత్నమూ చేశాడాయన. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎన్నికలకు ఒకరోజు ముందు అమల్లోకి తేవడం కూడా ఈ విన్యాసాల్లో భాగమే.
 
ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేశాయో తెలియదు కానీ, ఆయనకూ, ఆయన పార్టీకీ దేశంలో ఎదురుగాలి ఆరంభమైందనీ, రెండేళ్ళలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు కష్టాలు తప్పవని ఫలితాలు చెబుతున్నాయి. గతంలో ట్రంప్‌ విజయానికి దోహదపడిన చోట్ల ఇప్పుడు డెమోక్రాట్ల హవా కనిపిస్తున్నది. రిపబ్లికన్ల కంచుకోటలని అనుకున్నవి బలహీనపడుతున్నాయి. రిపబ్లికన్ల చేతిలోనుంచి ఏడురాష్ట్రాలు డెమోక్రాట్లకు పోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో రిపబ్లికన్లు, పట్టణ ప్రాంతాల్లో డెమోక్రాట్లు బలంగా ఉన్నారు. ఎన్నిక విధానం కారణంగా సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం దక్కినప్పటికీ, డెమోక్రాట్లకు 12 మిలియన్‌ ఓట్లు అధికంగా వచ్చినట్టు విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక, ప్రతినిధుల సభలోకి భారతీయ సంతతికి చెందిన మరికొందరి ప్రవేశం జరుగుతుందని అనుకున్నప్పటికీ, ఇప్పటికే ఉన్నవారు తిరిగి నెగ్గడం తప్ప కొత్తవారి రాక సాధ్యపడలేదు. కానీ, కనీసం వందమంది భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో ఓట్లు సాధించి మంచి పోరాటం చేశారు. అలాగే, బాల్యంలో శరణార్థులుగా దేశంలో కాలూనిన ఇద్దరు ముస్లిం మహిళలు మొట్టమొదటిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
 
ఇక, సెనేట్‌లో రిపబ్లికన్ల బలం పెరగడం, అందునా ఆయన మనుషులు గెలవడం కచ్చితంగా ట్రంప్‌కు ఉపకరించేదే. వలసలతో సహా పలు కీలకాంశాలపై ట్రంప్‌ వాదనను సమర్థించేవారి సంఖ్య పెరిగినందున రిపబ్లికన్‌పార్టీపై ఆయన పట్టు మరింత బిగుస్తుంది. డెమోక్రాట్ల బలం పెరుగుతున్న నేపథ్యంలో పార్టీలో ఆయనను వ్యతిరేకించే శక్తులు కూడా ఆయనవైపు నిలవాల్సిన అగత్యమూ ఏర్పడుతుంది. ఈ స్థితిలో రెండేళ్ళ తరువాత అధ్యక్షపదవికి తిరిగి నామినేట్‌ కావడంలో ట్రంప్‌కు పెద్ద ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. ప్రతినిధుల సభలో ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టగలిగే శక్తి ఇప్పుడు డెమోక్రాట్లకు దఖలుపడింది. సెనేట్‌లో తగినంత బలం లేకుండా అధ్యక్షుడిని అభిశంసించడం అసాధ్యం కనుక డెమోక్రాట్లు ఆ పనికి పూనుకోకపోవచ్చును. కానీ, ప్రతీ కీలకమైన నిర్ణయంలోనూ వారు ట్రంప్‌ను నిలువరిస్తారు. ఇప్పటివరకూ ఉభయసభల్లోనూ మెజారిటీ ఉన్న కారణంగా అనుకున్నది చేయగలిగిన ట్రంప్‌ ఇకపై జాతీయ, అంతర్జాతీయ నిర్ణయాల్లో డెమోక్రాట్లతో యుద్ధం చేయవలసి వస్తుంది. ట్రంప్‌ సంస్థల ఆర్థికలావాదేవీల నుంచి ఎన్నికల్లో రష్యా జోక్యం వరకూ అనేక అంశాలు కీలకమైన మలుపులు తిరిగే అవకాశమూ ఉన్నది.