చికాగో: ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ చికాగో సంస్థ 34 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు సాంస్కృతిక, సేవ, క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 30న బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. 600 నుంచి 700 మందికిపైగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఆడపడచులు కన్నులు పండగగా సంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలు, పెద్దలు.. భవితరాలకు సంస్కృతిని తెలియజేసే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రై స్టేట్ తెలుగు అససియేషన్ సంస్థ సభ్యులను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బతుకమ్మ పండుగ ప్రత్యేక వంటలతో కూడిన చక్కని విందు భోజనం అందరి మన్ననలను పొందింది. చక్కగా అలంకరించబడిన మొదటి మూడు బతుకమ్మలకు ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ అక్టోబర్ 28 2017న నిర్వహించే దీపావళి కార్యక్రమంలో బహుమతులను ప్రదానం జరుగుతుంది. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ వారు మాట్లాడుతూ.. తమ ఆశయం అయిన ‘‘ తెలుగులో మాట్లాడండి-తెలుగులో మాట్లాడించండి’’లో భాగంగా తెలుగువారికి సంబంధించిన అన్ని సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించడానికి కృషి చేసినందుకు కార్యవర్గ సభ్యులు అందరీకి ధన్యవాదాలు తెలిపారు.