Baby-Was-Born-With-Nearly-No-Skin

చర్మం లేకుండా పుట్టిన శిశువు.. బతకడం కష్టమనడంతో..

శాన్ ఆంటోనియో: అమెరికాలో శరీరంపై చర్మం లేకుండా ఓ శిశువు జన్మించింది. బిడ్డ గుండె రేటు పడిపోవడంతో ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ ద్వారా ఆపరేషన్ చేయగా.. డాక్టర్లు బిడ్డ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే బిడ్డను ఐసీయూకు తీసుకెళ్లి చికిత్స అందించడం మొదలుపెట్టారు. పుట్టిన బిడ్డను తనకు చూపించకుండా తీసుకెళ్లారేంటని తల్లి ప్రిసిల్లా ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని డాక్టర్లు వివరించారు. ఎపిడెర్మోలిసిస్ ముల్లోసో అనే వ్యాధి కారణంగా పిల్లలు ఇలా చర్మం లేకుండా పుడతారని డాక్టర్లు తెలిపారు. కేవలం తల, కాళ్లు, చేతులపై అక్కడక్కడ చర్మమున్నట్టు డాక్టర్లు గుర్తించారు. బిడ్డ బతకడం కష్టమని.. ఇంటికి తీసుకెళ్లి చనిపోయే వరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోమంటూ డాక్టర్లు బిడ్డ తల్లిదండ్రులకు సూచించారు. ప్రిసిల్లా మాత్రం తన కొడుకు చనిపోవడానికి వీలులేదంటూ.. టెక్సాస్‌లోని మరో పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రముఖ సర్జరీ స్పెషలిస్ట్ బిడ్డకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. తన జీవితంలో ఇలాంటి కేసులు 50 నుంచి 60 వరకు చూశానని, బిడ్డ శరీరంపై చర్మం ఉంది కానీ అది చాలా సన్నగా ఉండటం వలన కనిపించడం లేదన్నారు. బిడ్డకు సర్జరీలు చేస్తూ వెళ్లాలని.. మిగతాది తన చేతుల్లో లేదంటూ డాక్టర్ జెస్సే టేలర్ చెప్పారు.