Baby-bear-killed-for-being-too-friendly

సెల్ఫీలకు ఫోజిచ్చిందని.. ఎలుగు పిల్లను చంపేసిన అధికారులు..

ఓరెగాన్: ఆ ఎలుగు అక్కడకు వచ్చే టూరిస్టులందరికీ మంచి ఫ్రెండ్. వారు తీసుకునే ప్రతి సెల్ఫీకి ఫోజిస్తుంది. దానికి ప్రతిగా వారిచ్చిన ఆహారం తిని ఆనందిస్తుంది. అయితే ఈ వ్యవహారం మంచిది కాదని అధికారులు టూరిస్టులను హెచ్చరించారు. ఆ ఎలుగుకు ఎటువంటి ఆహారం ఇవ్వొద్దని సూచించారు. కానీ చాలామంది టూరిస్టులు ఆ మాటలను పెడచెవిన పెట్టారు. అదే ఆ ఎలుగు పాలిట శాపమైంది. అధికారుల ఆగ్రహానికి గురైన ఆ మూగజీవం మృత్యువాత పడింది.

అమెరికాలోని ఓరెగాన్‌లో ఓ ఎలుగుబంటి పిల్ల నివసిస్తోంది. హెన్రీ హ్యాగ్ లేక్‌కు సమీపంలోని స్కోగ్గిన్స్ వ్యాలీ పార్క్‌లో ఉంటున్న ఈ మూగజీవి అక్కడకు వచ్చే టూరిస్టులకు సుపరిచితమే. వారు సెల్ఫీలు తీసుకుంటుంటే వారితోపాటు ఫోజిచ్చేది. దానికి ధన్యవాదాలు తెలుపుతూ వారిచ్చిన ఆహారం తినేది. ఇది తెలిసిన అధికారులు ఆ ఎలుగుపిల్లకు ఆహారం ఇవ్వొద్దని చాలామంది టూరిస్టులకు సూచించారు. అయినాసరే ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో ఆ ఎలుగును చంపేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ ఎలుగు వేటాడటం మానేసిందని, కేవలం టూరి్స్టుల ఆహారం మీదనే ఆధారపడుతోందని వారు చెప్పారు. దీన్ని చూసి మిగతా జంతువులు కూడా అలానే తయారవుతాయనే ఆందోళన వల్లే ఈ పనిచేయాల్సి వచ్చిందన్నారు. అయితే ఈ విషయం తెలియని ఆ ఎలుగుపిల్ల తనను చంపడానికి వచ్చిన అధికారుల వద్దకు కూడా టూరిస్టుల వద్దకు వచ్చినట్లే వచ్చి ఫొటోకు ఫోజిచ్చింది. కానీ అప్పుడు కెమెరా క్లిక్‌మన్న చప్పుడు కాకుండా తుపాకీ మోతతో ఆ ప్రాంతం మారుమోగింది.