Are-you-travelling-from-kempegowda-airport

120 శాతం పెరిగిన విమాన ఛార్జీలు.. విదేశాలకు వెళ్లాలంటే..

బెంగళూరు: కర్ణాటకలోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణం చేసే వారికి అదనపు ఛార్జీలు పడనున్నాయి. రూ.13 వేల కోట్ల ఖర్చుతో ఎయిర్‌పోర్టులో మరో టెర్మినల్‌ను నిర్మిస్తుండటంతో ఏప్రిల్ 15 నుంచి ఆగస్ట్ 15 వరకు యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు(యూడీఎఫ్) పెంచనున్నట్టు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ(ఏఈఆర్ఏ) ప్రకటించింది. ఇప్పటివరకు డొమెస్టిక్ ప్రయాణికుల నుంచి రూ. 139 వసూలు చేస్తుండగా.. ఈ నిబంధనలు అమలు చేశాక రూ. 306 వసూలు చేయనున్నారు. అలాగే అంతర్జాతీయ విమానాల ద్వారా విదేశాలకు వెళ్లే ప్రయాణీకుల నుంచి ఇంతకుముందు రూ.558 తీసుకోగా.. కొత్త ఉత్తర్వుల తరువాత దాన్ని రూ.1226కు పెంచారు. పెరగిన ఛార్జీలు ఏప్రిల్ 16 నుంచి అమలులోకి వస్తాయని ఏఈఆర్ఏ తెలిపింది. నాలుగు నెలల కాలంలో వచ్చిన డబ్బును కేవలం ఎయిర్‌పోర్టు విస్తీర్ణానికే ఖర్చు చేస్తామని అధికారులు తెలిపారు. కొత్తగా చేపట్టబోయే నిర్మాణంతో రెండో రన్‌వే, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ రానున్నట్టు పేర్కొన్నారు. కాగా, 2008 నుంచి విమాన రాకపోకలను కొనసాగిస్తున్న కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో ముందంజలో ఉంది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎయిర్‌పోర్టు నుంచి రెండు కోట్ల 69 లక్షల మంది ప్రయాణించినట్టు ఎయిర్‌పోర్టు యాజమాన్యం ప్రకటించింది.