Arab-Woman-knocking-door-of-Policeman

పొరపాటున పోలీస్ ఇంటి తలుపులు తట్టిన యాచకురాలు.. ఆ తరువాత ఏమైందంటే...

రాస్ అల్ ఖైమాహ్: అరబ్ దేశాల్లో యాచించడం అనేది చట్ట విరుద్ధం. బిక్షాటన చేస్తూ దొరికితే అక్కడ జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు. కానీ, కొందరు పోలీసుల కళ్ళుకప్పి వివిధ వేషాల్లో యాచకవృత్తిని కొనసాగిస్తుంటారు. తాజాగా ఓ అరబ్ మహిళ ఇలాగే బిక్షాటనకు వెళ్లి పోలీసులకు చిక్కింది. పొరపాటున పోలీస్ అధికారి ఇంటి తలుపులు తట్టిన ఆమె ప్రమాదంలో పడింది. బిక్షం కోసం ఇంటి తలుపులు తట్టగా అది కాస్తా పోలీస్ ఇల్లు కావడంతో ఆమె ఇబ్బందుల్లో పడింది. మహిళ వద్ద పెద్ద సంచి నిండా బట్టలు, భారీ మొత్తంలో నగదు ఉండడం గమనించిన అధికారి ఆమెను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. 

దాంతో వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోమవారం రాస్ అల్ ఖైమాహ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో తాను యాచించడం లేదని, తన స్నేహితురాలి ఇంటికి కోసం వెతుకుతుంటే పోలీసులు పట్టుకున్నట్లు బుకాయించింది. ఆమె చేతిలో ఉన్న బట్టల బ్యాగు గురించి ప్రశ్నించగా అది తనకు రోడ్డుపై దొరికినట్టు చెప్పింది. ఆమె వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా, యూఏఈ ఫెడరల్ చట్టం 2018లోని అర్టికల్-9 ప్రకారం యాచకులకు మూడు నెలల జైలు శిక్షతో పాటు 5వేల దిర్హామ్‌ల(రూ. 94,430) జరిమానా విధిస్తారు.