AP-Gullyboy-Selected-for-Research-Program-in-Japan-

కూలి పనులకు వెళ్లి చదువుకుని.. నేడు జపాన్ వరకు...

సంకల్పం ముందు అడ్డురాని పేదరికం

కథనం - కుప్పం: కూలి చేసి బతుకునీడ్చే తల్లిదండ్రులు.. చెమటోడ్చితేనే పూట గడిచే బతుకులు.. బస్సు క్లీనర్‌గా చేసి పుస్తకాలు కొన్న రోజులు.. ఆ చిన్నోడి దృఢ సంకల్పం ముందు చిన్నబోయాయి. కుదిపేసిన పేదరికం.. అతడి పట్టుదల ముందు ఓడిపోయింది. మారుమూల పల్లెటూరి పిలగాడిప్పుడు పరిశోధనల పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. అతడే మురుగేశ్‌. మారుమూల గోవిందపల్లెనుంచి జపాన్‌ దాకా సాగిన అతడి స్ఫూర్తిదాయ ప్రస్థానం ‘యువ’కు ప్రత్యేకం.
 
నేపథ్యమిదీ
మురుగేశ్‌ది గుడుపల్లె మండలంలోని మారుమూల గ్రామమైన గోవిందపల్లె. తల్లిదండ్రులు మునస్వామి, ఎల్లమ్మ. వీరు కూలికి వెళ్తేనే కుటుంబం గడిచేది. అదే మండలంలోని శెట్టిపల్లె ప్రభుత్వ పాఠశాలలో అతడి విద్యాభ్యాసం మొదలైంది. ప్రాథమిక విద్యదాకా సాఫీగానే సాగింది. కూలికి వెళ్లే తల్లిదండ్రులు అప్పుడప్పుడూ పిల్లలనూ తీసుకెళ్లడం.. వాళ్లు సంపాదించింది కుటుంబం గడవడానికి చన్నీళ్లవ్వడం సాధారణం. అలా.. మురుగేశ్‌కూ తప్పలేదు. ఒకపక్క కూలిపనులకు వెళ్తున్నా, చదువును నిర్లక్ష్యం చేయలేదు. అటు బడి, ఇటు కూలి పని.. రెండూ తన బాధ్యతగానే భావించాడు. తల్లిదండ్రులెప్పుడూ చదువులు మానేయమని చెప్పలేదు. వారితోపాటు ఉపాధ్యాయుల చక్కని ప్రోత్సాహం లభించింది. క్రమేణా చదువే అతడికి మొదటి ప్రాధాన్యంగా మారింది. శెట్టిపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 2007-08 పదో తరగతి పరీక్షల్లో 600కు 542 మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు మురుగేశ్‌.
 
బస్సు క్లీనర్‌గా మారి...
పదో తరగతైతే రికార్డు సృష్టిస్తూ పూర్తయింది కానీ, ఇంటర్మీడియట్‌ మీదుగా ఇంజినీరింగు చేయాలన్న కల తొలిచేయడం ప్రారంభించింది. ఏదైనా కార్పొరేట్‌ కళాశాలలో చేరి, మంచి ఫౌండేషన్‌ వేసుకుని ఆ తర్వాత ఇంజినీరింగు సీట్‌ కొట్టాలని, సమాజానికి తనవంతుగా ఏదో ప్రయోజనం చేకూర్చాలని తపించిపోయాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పాడు. పేదరికాన్ని చూపెట్టినవారు, తమ నిస్సహాయత వ్యక్తం చేశారు. తెలిసినవాళ్లను, బందువులను ఏదైనా సహాయం చేస్తారేమోనని అడిగి చూశాడు. ఊహూ.. ఫలితం కనిపించలేదు. ఏదో ఒక సహాయం.. ఏదో ఒక రూపంలో దొరక్కపోదని భావించాడు. ఇంజినీరింగు చదవాలంటే ఆంగ్లం పరిజ్ఞానం తప్పనిసరి. ఏం చేయాలో తెలియదు. ఎలా నేర్చుకోవాలో అర్థంకాదు. ఆ సమయంలో పదో తరగతి తర్వాత వచ్చిన సెలవుల్లో బస్సు క్లీనర్‌గా చేరాడు. తమ ఇంటిపక్కనున్న ఆర్టీసీ డ్రైవర్‌ సాయంతో ఆ పని దొరికింది. అలా పనిచేసి రూ.1500 సంపాదించాడు. ఆ డబ్బులు పెట్టి, పాఠశాలలో చదివేటప్పుడు ఒక ఉపాధ్యాయురాలు సూచించిన వీటా, కోచింగ్‌ పుస్తకాలు కొన్నాడు. దానికి తోడు ది హిందూ దినపత్రిక కొని చదవడం ప్రారంభించాడు. ఏ పని చేస్తున్నా మురుగేశ్‌ ఆలోచనలన్నీ ఒకేవైపు.. ఇంజినీరింగు చేయాలి, ఏదో సాధించాలి.
 
ఇడుపులపాయ ఐఐఐటీ మొదటి మజిలీ
పడుకున్నా, మేలుకున్నా ఎప్పుడూ ఇంజినీరింగు ఆలోచనలే. మార్గం మాత్రం కనిపించలేదు. అయినా నిరాశా నిస్పృలను దరికి చేరనివ్వలేదు. అటువంటి సమయంలో కడప జిల్లా ఇడుపులపాయలో అదే ఏడాది ప్రభుత్వం ఐఐఐటీ కళాశాలను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడ్డ మండలాల్లో పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పించారు. అక్కడే మురుగేశ్‌ ఆశయ సాధనలో మొదటి అడుగు పడింది. ఐఐఐటీలో ప్రవేశమైతే లభించింది కానీ, కుటుంబ ఆర్థిక దీనపరిస్థితులు అతడిని వెంటాడుతూనే వచ్చాయి. ఆర్థిక అవసరాలు, చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితులు ఎంతగా కుంగదీస్తాయో అనుభవానికొచ్చింది. పైగా కుటుంబాన్ని వీడి వేరేగా ఉండాల్సిన ఒంటరితనం. సహ విద్యార్థులతో పోల్చుకుంటే తన దీనస్థితి రెట్టింపై కనబడింది. దీంతో ఆత్మన్యూనత, నిరాశా నిస్పృహలు లొంగదీసుకోవడం ప్రారంభించాయి. ఐఐఐటీ సరే, ఈ ఆర్థిక దీనస్థితిలో ఇంజినీరింగు చేయగలనా? అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలనా? అన్న సంశయం. తన బాధను, ఆలోచనలను ఎవరితో పంచుకోవాలో తెలియని ఒంటరితనం. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరోజు రాత్రి భరించలేక, తాను అమ్మ తర్వాత అమ్మగా భావించే పూర్వ ఉపాధ్యాయురాలొకరికి ఫోన్‌ చేసి, మనసులో వ్యథనంతా వెల్లడించాడు. ఆమె సూచనతో తనను ఒక ఆధ్యాత్మిక గురువుకు దగ్గర చేసిందని, ఆయన ఇచ్చిన ఆధ్యాత్మిక, మానసిక బలంతో దృఢంగా తయారయ్యాయని చెబుతాడు మురుగేశ్‌.
 
జపాన్‌ రీసెర్చి దాకా
అంతే మురుగేశ్‌ ఇక వెనుదిరిగి చూడలేదు. ఇడుపులపాయ ఐఐఐటీలో నాలుగేళ్ల ఇంజినీరింగును విజయవంతంగా పూర్తి చేశాడు. ఆపైన మద్రాస్‌ ఐఐటీలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎం.ఎస్‌.) అవకాశం లభించడం పెద్ద మలుపైంది. అంతకుముందు డిఫెన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యే అద్భుతమైన అవకాశం మురుగేశ్‌ పొందాడు. ఈ రీసెర్చ్‌లో భాగంగానే అస్సోం రాష్ట్రం గువాహటి ఐఐటీలో రెండు నెలలపాటు రీసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌కు వెళ్లొచ్చాడు. హైదరాబాదులో ఏడాదిన్నరపాటు వివిధ ప్రాజెక్ట్స్‌లో పనిచేశాడు. ఆ తర్వాతనే మద్రాస్‌ ఐఐటీలో ఎంఎస్‌లో ప్రవేశంతో తన రీసెర్చ్‌ కెరీర్‌ కలకు మరింత దగ్గర కాగలిగాడు. అదే ప్రాజెక్టు పనిమీద ముంబైకి మొదటిసారిగా విమానంలో ప్రయాణించానని ఎంతో ఆనందంగా చెప్పాడు మురుగేశ్‌. అనేక అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో పాల్గొన్నాడాయన. తొలిసారిగా జపాన్‌ దేశం హిరోషిమా వెళ్లి అంతర్జాతీయ సాంకేతిక సదస్సులో పాల్గొన్నాడు. నాలుగు నెలలపాటు జపాన్‌లో రీసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ రీసెర్చ్‌ పనిమీదే జపాన్‌ పర్యటనలో ఉన్నాడు మురుగేశ్‌. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తానని.. ఆనందంకన్నా మించిన సంతృప్తితో చెప్పాడా ‘కృషీ’వలుడు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం..’ మురుగేశ్‌ విషయంలో ఈ సూక్తి ప్రత్యక్షర సత్యం.