Another-Indian-Origin-Man-Deceived-by-Fake-Gulf-Agents

‘కేటీఆర్ సార్ మీరే నన్ను రక్షించాలి’.. ఎడారి దేశంలో సిరిసిల్ల వాసి గోడు

రాజన్న సిరిసిల్ల: గల్ఫ్ దేశాలకు ఏజెంట్ల ద్వారా వెళ్లేవారు ముందుగా వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ.. ఏజెంట్ల మాయలో పడి చాలా మంది మోసపోతున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సమీర్ అనే వ్యక్తి ఏజెంట్ల మోసానికి బలయ్యాడు. నిజామాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా సౌదీ వెళ్లి నెల రోజులుగా అక్కడ నరకయాతన అనుభవిస్తున్నాడు. ఫంక్షన్ హాల్లో ఉద్యోగం అని చెప్పి ఏజెంట్ తన దగ్గర 83 వేలు తీసుకుని సౌదీ పంపించాడని, తీరా అక్కడకు వెళ్లాక 1200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఎడారిలో గొర్రె కాపరిగా పనిచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తిండి తిని 20 రోజులు అయిందని, తాను వెళ్లిపోతానంటే కొడుతున్నారంటూ ఏడుస్తూ గోడును చెప్పుకున్నాడు. తనను తిరిగి ఇండియా తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను వీడియో సందేశం ద్వారా వేడుకున్నాడు. కాగా, సమీర్‌‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఏర్పాట్లు చేస్తోంది.