another-Hyderabad-man-dead-

న్యూజిలాండ్‌ ఘటనలో..మరో హైదరాబాదీ మృతి..

తెలంగాణ మృతులు ముగ్గురు
చార్మినార్‌/హైదరాబాద్‌: న్యూజిలాండ్‌లో క్రైస్ట్‌చర్చ్‌ ప్రాంతంలోని అల్‌-నూర్‌ మసీదులో శ్వేతజాతి దురహంకారి శుక్రవారం జరిపిన కాల్పుల్లో మరణించిన తెలంగాణ వాసుల సంఖ్య మూడుకు చేరింది. హైదరాబాదీ ఫర్హాజ్‌ అహ్సాన్‌, కరీంనగర్‌కు చెందిన ఎండీ ఇమ్రాన్‌ అహ్మద్‌ ఖాన్‌ మృతిచెందినట్లు న్యూజిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం ప్రకటించగా.. హైదరాబాద్‌ పాతనగరానికి చెందిన ఉజెర్‌ ఖదీర్‌ (24) అనే ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి మరణించినట్లు ఆదివారం నిర్ధారించింది. నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన ఉజెర్‌ తండ్రి ఖదీర్‌ హబీబ్‌ సౌదీలో పనిచేస్తుండగా.. అతడి పెద్దన్నయ్య ఉమర్‌ ఖదీర్‌ ఇండిగోలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. మరో ఇద్దరు అన్నయ్యలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఉజెర్‌ ఏడాది క్రితం ఏరోనాటికల్‌ ఇంనీరింగ్‌ విద్య కోసం న్యూజిలాండ్‌ వెళ్లాడు. శుక్రవారం అల్‌-నూర్‌ మసీదులో ప్రార్థనలో నిమగ్నమైన ఉజెర్‌.. దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. విషయం తెలియగానే సౌదీ నుంచి ఉజెర్‌ తండ్రి, హైదరాబాద్‌ నుంచి అతడి తల్లి న్యూజిలాండ్‌కు బయలుదేరారు. చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎమ్మెల్సీ రియాజుల్‌ హసన్‌లు.. ఉజెర్‌ సోదరులను పరామర్శించారు.