American-man-Telugu-girl-love-marriage-in-Andhra

ఆంధ్రా అమ్మాయి.. అమెరికా అబ్బాయి.. అదిరిపోయేలా పెళ్లి

 గన్నవరం (కృష్ణా జిల్లా): గూడవల్లి అమ్మాయి.. అమెరికా అబ్బాయి ఒకటయ్యారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయం ప్రకారం శాస్ర్తోక్తంగా వీరిద్దరి వివాహం గన్నవరం ఏబీ కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. రూరల్‌ మండలం గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతికుమారి దంపతుల కుమార్తె డాక్టర్‌ నాగ సంధ్య అమెరికాలోని ఓరిగన్‌ రాష్ట్రంలో రీసెర్చి ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాండీ బ్యాంగ్‌, క్రిస్టినా బ్యాంగ్‌ దంపతుల కుమారుడు ఆడం బ్యాంగ్‌ ఎలక్ర్టికల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లో పెద్దలకు చెప్పటంతో అంగీకరించారు. పెద్దలు మాట్లాడి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసేందుకు నిశ్చయించుకున్నారు. అమెరికా నుంచి పెళ్లి కుమారుడి వెంట బంధువులు వచ్చారు. నాగసంధ్య, ఆడం బ్యాంగ్‌లను మంగళవారం రాత్రి సంప్రదాయ పద్ధతిలో అందరి మధ్య ఒకటి చేశారు. అమెరికన్లు రావటంతో సందడి వాతావరణం నెలకొంది. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు తదితర ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు.