American-based-Goldman-Sachs-Indian-VP-steals-38cr

అమెరికన్ కంపెనీకి టోపీ పెట్టిన ఇండియన్.. ఆన్‌లైన్లో గేమ్స్ ఆడి..

  • సొంత కంపెనీలో రూ.38 కోట్లు చౌర్యం
  • గోల్డ్‌మన్‌ శాచ్‌ ఉన్నతాధికారి చేతివాటం
  • జూదంలో ఓడి.. దొంగగా మారిన గోల్డ్‌మన్ శాక్స్ ఉన్నతాధికారి

బెంగళూరు: అంతర్జాతీయంగా పేరున్న ఓ కంపెనీ నుంచి ఉన్నతాధికారే రూ. కోట్లు కాజేశాడు. జూదం మిగిల్చిన అప్పులు తీర్చేందుకు దొంగగా మారి చివరికి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికన్‌ ఆర్థిక సేవల కంపెనీ గోల్డ్‌మన్‌ శాచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్వనీ ఝున్‌ఝున్‌వాలా ఆన్‌లైన్‌లో పోకర్‌ గేమ్‌ ఆడి సుమారు అర కోటి వరకు నష్టపోయాడు. పైగా, జూదం కోసం పలువురి నుంచి రూ.25 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. చేసిన అప్పులు తీర్చేందుకు సొంత కంపెనీ నుంచే రూ.38 కోట్లు దొంగిలించాడు. కానీ, చేసిన నేరం కొద్ది రోజులకే బయటపడింది. ఝున్‌ఝున్‌వాలాతో పాటు అతని సహాయకుడు, కంపెనీ మాజీ ఉద్యోగి వేదాంత్‌ రుంగ్తాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. కంపెనీ లీగల్‌ హెడ్‌ అభిషేక్‌ పర్షీరా ఈనెల 8న చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, వారిద్దరినీ అరెస్ట్‌ చేసినట్లు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ప్రాంత పోలీసు డిప్యూటీ కమిషనర్‌ ఎంఎన్‌ అనుచేత్‌ తెలిపారు. ఝున్‌ఝున్‌వాలాను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీ తెలిపింది.

 

దొంగిలించాడిలా..
పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ఝున్‌ఝున్‌వాలా తన కింద పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు గౌరవ్‌ మిశ్రా, అభిషేక్‌ యాదవ్‌, సుజిత్‌ అప్పయ్యను పావులుగా ఉపయోగించుకున్నాడు. ట్రైనింగ్‌ పేరుతో వారి కంప్యూటర్లలోకి లాగిన్‌ అయి తన చేతివాటం ప్రదర్శించాడు. శిక్షణ సమయంలో ఝున్‌ఝున్‌వాలా వారిని నీళ్లు లేదా ఆహా రం కోసం బయటికి పంపి వారి కంప్యూటర్ల నుంచి కంపెనీకి చెందిన రూ.38 కోట్ల నిధులను అక్రమంగా బయటికి తరలించేశాడు. ఈ నెల 4న సొమ్మును ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలోని ఓ ఖాతాకు రెండు విడతల్లో బదిలీ చేశాడు. ఈనెల 6న కంపెనీ అంతర్గత ఆడిట్‌లో ఝున్‌ఝున్‌వాలా మోసం బయటపడింది.