Alabama-Man-Sentenced-to-615-Years-

వ్యక్తికి 615 ఏళ్ల జైలు శిక్ష.. అతడు చేసిన నేరమేంటో తెలిస్తే...

అలబామా: ఐదుగురు మైనర్ అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ వ్యక్తికి హూస్టన్ కౌంటీ కోర్టు 615 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలబామాకు చెందిన రావెన్ స్మిత్‌(35) కీచకపర్వంపై ఐదుగురు బాధిత బాలికలలోని ఓ అమ్మాయి తల్లి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణం బయటపడింది. కామంతో కళ్లుమూసుకుపోయి పసిమొగ్గలను చిదిమేసిన స్మిత్‌కు హూస్టన్ కౌంటీ సర్క్యూట్ జడ్జి టాడ్ డెరిక్ ఆరు శతాబ్దాలకుపైగా జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. స్మిత్ ఘాతుకానికి పాల్పడిన బాలికలందరూ 16 ఏళ్ల లోపు వారేనని కోర్టు విచారణలో తేలింది. స్మిత్ చేసిన నేరాలను వివరిస్తున్న సమయంలో డిస్ట్రిక్ట్ అటార్నీ జేటీ జోన్స్ కన్నీంటిపర్యంతమయ్యారు. పసిమొగ్గలపై దారుణానికి పాల్పడిన నీచుడికి సరైన శిక్ష పడిందని కోర్టులో కేసు వేసిన బాధిత బాలిక తల్లి హర్షం వ్యక్తం చేసింది. స్మిత్ బాధితులు ఐదుగురు అమ్మాయిలు మాత్రమే కారని.. ఇంకా చాలా మంది ఉన్నారని ఆమె తెలిపింది. కానీ స్మిత్‌కు భయపడి వారు బయటపడటం లేదని చెప్పింది. ఇప్పుడు స్మిత్ శాశ్వతంగా జైలుకు వెళ్తున్నాడు.. ఇప్పటికైన బాధితులు బయటకు రావాలని ఆమె కోరింది.