Air-Canada-Flight-makes-Emergency-Landing-

కెనడా విమానంలో కుదుపులు.. ప్రయాణీకులకు గాయాలు...

హోనోలూలు(అమెరికా):వాంకోవర్ నగరం నుంచి సిడ్నీకి వెళుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో అత్యవసరంగా అమెరికాలోని హోనోలూలు విమానాశ్రయంలో దించారు. ఎయిర్ కెనడా విమానం 33 వాంకోవర్ విమానాశ్రయంలో బయలు దేరిన రెండు గంటలకే హవాయి ప్రాంతం దాటుతూ ఆకస్మాత్తుగా కుదుపులకు గురైంది. దీంతో పైలెట్ విమానాన్ని హోనోలూలు నగరంలోని డేనియల్ కె ఇనోయీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బలవంతంగా దించారు. విమానం కుదుపులతో కొందరు ప్రయాణికుల తలలు సీలింగ్‌కు తగిలాయి. దీంతో 35 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. విమానంలో అల్లకల్లోలం రేగగా కొందరు భయంతో కేకలు వేశారు. సంఘటన జరిగిన సమయంలో ఈ విమానంలో 269 మంది ప్రయాణికులతోపాటు 15 మంది క్రూ సభ్యులున్నారు. విమానాన్ని అత్యవసరంగా దించినపుడు విమానం 36వేల అడుగుల ఎత్తులో ఉందని ఫెడరల్ ఏవియేషన్ నిర్వహణ శాఖ అధికారి లాన్ గ్రీగర్ చెప్పారు. ప్రయాణికుల భద్రతే తమ ముఖ్య కర్తవ్యమని, హోనోలూలు విమానాన్ని అత్యవసరంగా దించాక వైద్యులతో ప్రయాణికులకు చికిత్స చేపించామని ఎయిర్ కెనడా వెల్లడించింది.