After-mid-term-election-result-Trump-will-may-face-critical-situations

ట్రంప్‌కు చుక్కలే!.. మధ్యంతర ఎన్నికల్లో రసవత్తర ఫలితాలు

ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల పాగా

సంవత్సరాల తర్వాత ఆధిపత్యం
ముదరనున్న ‘రాజకీయ యుద్ధం’
ట్రంప్‌ వివాదాస్పద నిర్ణయాలకు బ్రేకు
వాటిని వ్యతిరేకిస్తామన్న కాబోయే స్పీకర్‌
అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ?
అదే జరిగితే ‘యుద్ధం’ తప్పదన్న ట్రంప్‌
అటార్నీ జనరల్‌ సెషన్స్‌కు ఉద్వాసన
రష్యాతో కుమ్మక్కుపై విచారణే కారణం
సెనేట్‌పై పట్టు నిలుపుకొన్న రిపబ్లికన్లు
వాషింగ్టన్‌, నవంబరు 8: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రసవత్తర ఫలితాలు వెలువడ్డాయి. రెండు సభల్లో వేర్వేరు పార్టీలు ఆధిపత్యం సాధించాయి. ఇకపై కీలక నిర్ణయాలన్నింటిలో అనిశ్చితి తప్పని పరిస్థితి నెలకొననుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఒంటెత్తు పోకడలు, వివాదాస్పద నిర్ణయాలకు కళ్లెంపడటం ఖాయంగా మారింది. ఉభయ సభల్లో తిరుగులేని మెజారిటీ సాధించాలని భావించిన ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ వలస విధానాలు, పన్ను కోతలు, ఆరోగ్య సంరక్షణ వైఖరిపై మండిపడుతున్న అమెరికన్లు, భారతీయ అమెరికన్లు... ప్రతినిధుల సభ ఎన్నికల్లో ఆగ్రహాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేశారు.
 
ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల బలాన్ని కిందికి దించేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ట్రంప్‌ విధానాలకు చుక్కెదురవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఉండగా... గురువారం రాత్రి పొద్దుపోయే సమయానికి వచ్చిన ఫలితాల ప్రకారం 225 స్థానాలను రిపబ్లికన్లు సొంతం చేసుకున్నారు. అంటే మ్యాజిక్‌ మార్కును ఇప్పటికే దాటేశారు. డెమోక్రాట్లు 197 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు. ఎనిమిదేళ్లుగా రిపబ్లికన్ల చేతుల్లో ఉన్న ప్రతినిధుల సభను ఇప్పుడు డెమొక్రాట్లు సొంతం చేసుకోవడం విశేషం. అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ చరిత్రలో తొలిసారి వంద మంది మహిళలు ఎన్నికవడం మరో కీలక పరిణామం.
 
సెనేట్‌పై ట్రంప్‌ పట్టు
కీలకమైన సెనేట్‌పై ట్రంప్‌ పట్టు నిలుపుకొన్నారు. వంద మంది సభ్యుల సెనేట్‌లో ఇప్పటిదాకా రిపబ్లికన్లకు 51 మంది, డెమోక్రాట్లకు 49 మంది సభ్యులు ఉండేవారు. 97 స్థానాల ఫలితాలు వెలువడగా... రిపబికన్లు 51 చోట్ల నెగ్గారు. ఫ్లోరిడా, మొంతానాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాగా... సెనేట్‌లో డెమోక్రాట్ల బలం 46కు పడిపోయింది. రెండు చోట్ల ఇతరులు గెలుపొందారు. మిసిసిపీలో ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. దీంతో ఈ నెల 27న తిరిగి ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. సెనేట్‌లో రిపబ్లికన్లు ఆధిక్యత సాధించడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో వారికి ఇక తిరుగుండదు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఉభయ సభలు జనవరిలో కొలువు తీరనున్నాయి.
 
గవర్నర్లుగా డెమోక్రాట్ల బలం
గవర్నర్ల రేసులో డెమోక్రాట్లు కాస్త పుంజుకున్నారు. గతంలో ఆ పార్టీ తరఫున 16 మంది గవర్నర్లు మాత్రమే ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 23కు పెరిగింది. ఇక... రిపబ్లికన్‌ గవర్నర్ల సంఖ్య 33 నుంచి 26కు పడిపోయింది.
 
ఇక చుక్కలే...
ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల ఆధిపత్యంతో అమెరికాలో ‘రాజకీయ యుద్ధం’ జరగడం ఖాయంగా మారింది. కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఆయనకు విపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ మద్దతు తప్పనిసరి. వలస విధానాలు, పన్ను కోత, ఆరోగ్య సంరక్షణ... వంటి కీలక ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తామని ప్రతినిధుల సభకు కాబోయే స్పీకర్‌ నాన్సీ పెలోసీ (78) విస్పష్టంగా ప్రకటించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, ట్రంప్‌ సంస్థలు, ఆయన ప్రచార యంత్రాంగం రష్యాతో కుమ్మక్కుపై డెమోక్రాట్లు దర్యాప్తునకు ఆదేశించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ‘యుద్ధం తప్పదు’ అని ట్రంప్‌ హెచ్చరించారు. ఒబామా హయాంలో జరిగిన తప్పులు, రహస్య సమాచారం లీకులపై సెనేట్‌ ద్వారా తామూ విచారణ జరుపుతామని హెచ్చరించారు. ‘దర్యాప్తుల పేరిట డెమోక్రాట్లు ఆటలాడాలనుకుంటున్నారు! మేం వారికంటే బాగా ఆడగలం’ అని చురకలు అంటించారు.
 
కాగా.. ట్రంప్‌ తాను ఏరికోరి నియమించుకున్న అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ను ఆ పదవి నుంచి బుధవారం ఆకస్మికంగా తొలగించారు. రష్యా జోక్యానికి సంబంధించి విచారణాధికారిగా రాబర్ట్‌ ముయెల్లర్‌ను నియమించేందుకు సెషన్స్‌ అంగీకరించడమే ఆయనపై వేటుకు కారణం. ఆయన స్థానంలో తాత్కాలిక అటార్నీ జనరల్‌గా మాథ్యూ విటేకర్‌ను నియమించారు. నిజానికి మధ్యంతర ఎన్నికల్లో గతంలో ఏ పాలక పార్టీ సాధించని రీతిలో అద్భుత విజయం సాధించామని ట్రంప్‌ వెల్లడించారు. ప్రజలు రిపబ్లికన్‌ పార్టీకి సెనేట్‌లో స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకంలో పలు అవరోధాలు సృష్టించిన డెమోక్రాట్లకు బుద్ధిచెప్పారని అన్నారు.
 
సీఎన్‌ఎన్‌ రిపోర్టర్‌ అక్రిడేషన్‌ రద్దు

విలేకరుల సమావేశం సందర్భంగా తనను ఇరుకునపెట్టేలా ప్రశ్నలు వేసిన సీఎన్‌ఎన్‌ రిపోర్టర్‌ జాన్‌ ఎకొస్టాపై ట్రంప్‌ మండిపడ్డారు. ఆయన మూర్ఖుడు, అమెరికన్లకు శత్రువని ధ్వజమెత్తారు. సెంట్రల్‌ అమెరికా నుంచి పలువురు శరణార్థులు అమెరికాకు తరలివస్తున్న అంశంపై ఎకొస్టా అధ్యక్షుడి అభిప్రాయం అడిగారు. కోపగించుకున్న ట్రంప్‌ ఆయన్ను కూర్చోమన్నారు. ఆయన కూర్చోలేదు. ఆయన చేతిలో ఉన్న మైకును తీసుకోవడానికి వైట్‌హౌస్‌ ఉద్యోగిని ఒకరు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన చేతులు ఆమెను తాకాయి. యువ ఉద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించారంటూ వైట్‌హౌస్ లోకి అనుమతించే ఆయన అక్రిడేషన్‌ను ట్రంప్‌ ప్రభుత్వం రద్దుచేసింది.