A-timeline-of-US-Iran-relations

అమెరికా ‘యుద్ధ’ చరిత్రను తిరగేస్తున్న ఇరాన్‌

ఎన్నికలకి ముందు ఓ కృత్రిమ శత్రువును సృష్టించడం అమెరికా పాలకులకి అలవాటే! కానీ, ఈసారి ఇరాన్ యుద్ధ బూచి అని చిత్రించక పోవడం విశేషమే! అమెరికాపై ఒక్క సైనిక దాడికీ పాల్పడని సద్దాం హుస్సేన్‌నీ, నాటి ఇరాక్‌నీ పరమ బూచిగా చిత్రించిన అమెరికా, నేడు నిజంగానే అమెరికాపై దాడికి దిగి, వాటిని కొనసాగిస్తానని అల్టిమేటం కూడా ఇచ్చిన ఇరాన్‌ని ‘క్షమించడం’ వెనక పరిస్థితులు వేరు.

కొన్ని గొలుసుకట్టు సంఘటనలకు కొనసాగింపుగా ఇరాక్‌లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ ఈ మధ్య క్షిపణి దాడులు జరిపింది. దీనికి అమెరికా సైనిక ప్రతీకారం ఎలా వుంటుందోనని ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూసింది. కానీ, అంచనాలకి భిన్నంగా ప్రతీకారానికి బదులు ట్రంప్ ‘శాంతి’ ప్రకటన చేశారు. దానితో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇరాక్‌లోని తన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయలేదని అమెరికా ఖండించ లేదు. ఆ దాడిని తన పేట్రియట్ క్షిపణి రక్షణ వ్యవస్థ విచ్ఛిన్నం చేసిందని కూడా ప్రకటించలేదు.
 
ఇరాన్ క్షిపణి దాడిలో తన సైనికులకు ఎట్టి ప్రాణనష్టం జరగలేదని మాత్రమే అది ప్రకటించింది. ఆ కారణంగా ఇరాన్‌పై ప్రతీకార చర్యలు ఉండవని స్పష్టం చేసింది. వర్తమాన ప్రపంచ రాజకీయ గమనంలో అమెరికా స్థానంలో ఒక గుణాత్మక మార్పునకు ఇదో సుస్పష్టమైన సంకేతం! ట్రంప్ ప్రకటన అమెరికా చరిత్రలోనే కొత్త తరహా స్థితికి అద్దం పడుతోంది.
 
అమెరికాకి గతంలో ఎదురులేని చరిత్ర వుందని చెప్పడంలేదు. దానికి ఎదురు దెబ్బలు తినడం కొత్త కాదు. కాకుంటే, తనపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఎవరు, ఎంత చిన్న దాడి చేసినా, అంతకు పదిరెట్లు లేదా వందరెట్లు ప్రతీకార దాడికి నిర్దాక్షిణ్యంగా పాల్పడటం అమెరికా సహజ నైజం! నూరేళ్ళ అమెరికా చరిత్ర చాటిన విధానం ఇదే. అది ఇప్పుడు తారుమారైనది. అమెరికా సామ్రాజ్యవాద చరిత్రలో తొలిసారి తన ‘ప్రతీకార’ విధానానికి భిన్నంగా ట్రంప్ సర్కారు ‘శాంతి’ వచనాలు పలికింది.
 
నిజానికి తన సైనికులకు ప్రాణనష్టం జరిగిందా లేదా అన్నది కాక, తనపై ఇరాన్‌ దాడికి దిగిందీ లేనిదీ అమెరికా ప్రతీకారానికి కొలబద్ధ కావాలి. తన సైనిక ఆధిపత్యాన్ని ఇరాన్‌ సవాలు చేస్తున్నదా? అన్నది ముఖ్యం. ఇరాన్ ఆ పని చేసింది, చేశానని బహిరంగంగా ప్రకటించింది. ఇది అంతం కాదు, ఆరంభమే అని కూడా హెచ్చరించింది. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యం నుండి అమెరికా సైనిక ఉపసంహరణ పూర్తిస్థాయిలో జరిగేంత వరకూ తమ సైనిక దాడులు ఆగవని ఓ సాహసోపేత హెచ్చరిక కూడా ఇరాన్ చేసింది. ఇవేవీ సాధారణ ప్రకటనలు కావు. చమురు నిల్వల ప్రాంతం నుండి పూర్తి స్థాయిలో నిష్క్రమించే వరకూ ఊరుకొనేది లేదని యుద్ధ ప్రకటన చేయడమంటే, అదేదో తేలిగ్గా వదిలేయగలిగేది కాదు.
 
నిజానికి, అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి దాడి కేవలం సంకేతాత్మకం! దాని కంటే నూరురెట్ల పెద్దది ఇక ముందు కూడా దాడులు చేసి తీరతామనే అల్టిమేటం! తన సైనికులు పదిమందో వందమందో మృతిచెందిన ఘటన కంటే, పశ్చిమాసియాలో అమెరికా కాళ్ళు నరికేస్తామనడమూ, చమురు ప్రాంతంనుండి తరిమి వేస్తామనే అల్టిమేటం స్థూల విశ్లేషణలో అమెరికా మనుగడకు సంబంధించింది. ఐనా, ప్రతీకారానికి దిగకుండా వదిలేయడం అమెరికా చరిత్రలో లేదు. అందువల్ల, ఇరాన్ సైనికదాడిలో తన సైనికులకు ప్రాణనష్టం జరగలేదన్న సాకుతో ప్రతీకార దాడులు చేయబోవడం లేదన్న ప్రకటనలో విశ్వసనీయత కాక, అది తన లొంగుబాటుని కప్పిపెట్టుకునే వ్యూహాత్మక ప్రయత్నంగా కనిపిస్తోంది.
 
ఇటీవలి కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభ దిశగా దిగజారుతోంది. దాని ప్రభావం రాజకీయ, సైనిక రంగాలపై కూడా బలంగా ఉన్నది. చైనాతో వాణిజ్య యుద్ధంలోనూ, రష్యాతో ఎగుడు దిగుడు సంబంధాల్లో కూడా ఆ దిగజారుడు లక్షణాలు వ్యక్తమౌతున్నాయి. నాటోలో లుకలుకలు కూడా స్పష్టమౌతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు! ఏడెనిమిది దేశాల్లో గత రెండు, మూడేళ్లలో అమెరికా అనుసరించిన దౌత్య ఎత్తుగడలు, అనుచిత జోక్యాలు ఘోరంగా విఫలం కావడం మరో ఎత్తు!
 
ఉత్తర కొరియాపై ట్రంప్ సర్కారు తొలుత రంకెలు వేసి, తరువాత తలవంచి దౌత్యం చేసింది. ఏ తాలిబన్ ప్రభుత్వ కూల్చివేత తన ఏకైక లక్ష్యంగా 2001లో ఆఫ్ఘనిస్థాన్‌లో దురాక్రమణకు దిగిందో, అదే తాలిబన్ శక్తులతో ఒప్పందంకై నేడు తెగ ఆరాటపడుతోంది. నాటోలో రెండో అతిపెద్ద సైనిక సభ్య దేశమైన టర్కీలో ‘రాజ్య మార్పిడి’ కోసం సైనిక కుట్రను ప్రోత్సాహించి భంగపడింది. రష్యా నుండి ఎస్.400 కొనుగోలు చేస్తే, టర్కీపై ఆంక్షలకి దిగి మరో భంగపాటుకు గురైనది. సిరియాలో కూడా ‘రాజ్య మార్పిడి’కై అంతర్గత జోక్యం చేసుకొని, రష్యా సైనిక జోక్యానికి అవకాశం ఇచ్చింది. యెమెన్‌లో సైనిక జోక్యానికి సౌదీ అరేబియా నేతృత్వంలో గల్ఫ్ కూటమిని ప్రోత్సాహించి దారుణంగా విఫలమైంది. అది తుదకు సౌదీ చమురు క్షేత్రాలు, కీలక చమురు శుద్ధి వ్యవస్థపై రాజ్యరహిత తీవ్రవాద శక్తుల క్షిపణి దాడులకు దారితీసింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ ద్వారా జోక్యానికి ప్రయత్నించి భంగపడింది.లెబనాన్‌ నేడు ఇజ్రాయెల్ పక్కలో బల్లెంగా తయారైనది.
 
ఇక, ఇరాన్, ఇరాక్‌ పరిణామాణాలు మరో ఎత్తు! మెజార్టీ అరబ్ జాతి, మైనారిటీ కుర్దిష్ జాతులతో కూడిందే ఇరాక్! మతపరంగా పైరెండు జాతుల ప్రజలూ ముస్లిములే! అరబ్ జాతీయుల్లో తిరిగి సున్నీ, షియా తెగల ప్రజలున్నారు. సద్దాం నేతృత్వంలో బాతిస్టు పార్టీ పాలనలో స్థూలంగా ఇరాక్‌లో లౌకిక సంస్కృతి కొనసాగింది. ఇరాక్‌ను 2003లో అమెరికా దురాక్రమించాక జాతులు, మత శాఖల మధ్య చిచ్చు పెట్టింది. దేశ జనాభాలో సద్దాంకి చెందిన 20శాతం మంది సున్నీలపైకి 60 శాతం మంది షియాలను రెచ్చగొట్టజూసింది. ఉత్తర ఇరాక్‌లోని మరో 20 శాతం మంది కుర్దిష్ జనాభాకి అమెరికా తనదైన బాణీలో స్వయం ప్రతిపత్తి ఆశలను కల్పించి తన ప్రత్యేక నియంత్రణలోకి తీసుకుంది. ఫలితంగా సామాజిక అస్థిరత ఏర్పడింది. ట్రంప్ ఏలుబడిలో అది పరాకాష్ఠకు చేరింది. కొత్తగా కుర్దిష్ ప్రాంతాలకి కూడా అస్థిరత వ్యాపించి అమెరికా మనుగడకు సవాల్‌గా మారింది.
 
అంతేకాకుండా ఇరాక్‌కి పొరుగున గల మూడు సరిహద్దు దేశాలైన ఇరాన్, సిరియా, టర్కీలలో అమెరికా జోక్యం తీవ్రతరమైనది. ఆ మూడు దేశాలూ అమెరికాకి పరమ శత్రురాజ్యాలుగా మారాయి. టర్కీ విజృంభణతో కుర్దిష్ ప్రాంతాల నుండి తన సైనిక స్థావరాలని చాలా వరకు అమెరికా ఖాళీ చేసింది. ఇక మిగిలిన ఎర్బీల్ సైనిక స్థావరం పై మొన్న బుధవారం ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడటంలో ఆంతర్యం ఉంది. ఇక బాగ్దాద్ కేంద్రంగా షియా ప్రాంతాల్లో అక్టోబర్ ౧న ప్రారంభమైన ప్రజావెల్లువ వందరోజులుగా నిరవధికంగా కొనసాగుతూ సార్వత్రిక సాయుధ తిరుగుబాటు రూపం తీసుకోవడం గమనార్హం! అందులో భాగమే డిసెంబర్ 27న గెరిల్లా క్షిపణి దాడిలో అమెరికన్ కాంట్రాక్టర్ మృతి.
 
దానికి ప్రతీకారంగా అమెరికన్ క్షిపణి దాడిలో 29న కొందరు తిరుగుబాటుదార్లు మృతి చెందడంతో వేలాది మంది సాయుధ జనం 31న గ్రీన్‌జోన్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయ ముట్టడికి దిగారు. అది జనవరి ఒకటో తేదీ వరకూ సాగింది. వాటి కొనసాగింపులోనే బాగ్దాద్‌లో ఇరాన్ అత్యున్నత సైనిక అధికారి సులేమానీని అమెరికా డ్రోన్ దాడి ద్వారా జనవరి మూడో తేదీ హత్య చేయడం, అదే ఇరాక్‌లో రెండు అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడికి దారి తీసింది. తిరిగి ఇరాన్‌పై ప్రతీకారానికి అమెరికా తాజా వెనకడుగు నేపథ్యమిది.
 
ఇక ఇరాన్ విషయానికి వస్తే, ఒబామా హయాంలో 2015లో జరిగిన అణు ఒప్పందం నుండి ట్రంప్ ప్రభుత్వం అర్ధాంతరంగా 2018లో వైదొలిగింది. ఇండియాతో సహా వివిధ దేశాల్ని ఇరాన్ చమురు కొననివ్వకుండా చేసింది. ఆంక్షల్ని విధించి లొంగదీయ చూసినా ఇరాన్ లొంగలేదు. పైగా దాని ప్రభావం ఇరాక్, సిరియా, లెబనాన్, పాలస్తీనా, జోర్డాన్‌లపై పెరిగింది. సులేమానీ పాత్ర అందులో బహుముఖం. ఆయన్ని హత్య చేయడం ద్వారా ఇరాన్‌ని నియంత్రించగలనని అమెరికా తప్పుడు అంచనా వేసింది. అప్పటికే వంద రోజులుగా కొనసాగుతున్న ఇరాక్ ప్రజాప్రతిఘటనకు ఇరాన్ సైనికాధికారి హత్య ఇంధనంగా మారింది.
 
ప్రజా వెల్లువకు తలవంచిన ఇరాక్ పార్లమెంట్ కూడా 5వ తేదీన అమెరికాని ఉద్దేశించి విదేశీ సేనలు ఇరాక్ నుండి వెంటనే వైదొలగలంటూ తీర్మానించింది.చమురు ఇరాక్‌ను ఆధారం చేసుకుని ‘చమురు ఇరాన్’ ని కబ్జా చేయజూసింది అమెరికా. కానీ నేడు అమెరికా చేతికి ఇరాన్ చేజిక్కకపోగా, ఇరాక్‌ని కూడా కోల్పోతున్నది.
 
డెమోక్రాట్లతో పాటు స్వపక్ష రిపబ్లికన్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రస్తుతం ట్రంప్‌కి బ్రేకు వేసారు. ఫలితంగా అమెరికా వెనకడుగు వేసింది. ఇది సాధారణ పద్ధతికి భిన్నమైనది. ఎన్నికలకి ముందు ఓ కృత్రిమ శత్రువును సృష్టించడం అమెరికా పాలకులకి అలవాటే! కానీ, ఈసారి ఇరాన్ యుద్ధ బూచి అని చిత్రించకపోవడం విశేషమే! అమెరికాపై ఒక్క సైనిక దాడికీ పాల్పడని సద్దాం హుస్సేన్‌నీ, నాటి ఇరాక్‌నీ పరమ బూచిగా చిత్రించిన అమెరికా, నేడు నిజంగానే అమెరికాపై దాడికి దిగి, వాటిని కొనసాగిస్తానని అల్టిమేటం కూడా ఇచ్చిన ఇరాన్‌ని ‘క్షమించడం’ వెనక పరిస్థితులు వేరు. ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు చేసే కొద్దీ, అమెరికా నియంత్రణ నుండి ఇరాక్ చేజారే ముప్పు నేడు ఏర్పడింది.
 
సున్నీల సౌదీలో చమురు సంపన్న ప్రాంతం షియాలది. అది నేడు మండే అగ్నిపర్వతం! ఇరాన్‌పై అమెరికా సైనిక దాడి సౌదీకి సంకట స్థితిని కల్పిస్తుంది. యెమెన్ ఇప్పటికే సమస్యగా మారింది. రేపు ఇరాన్‌పై దాడి సౌదీ కూటమికి చెందిన విదేశీ సేనల్ని తరిమికొట్టే ప్రక్రియకు దారితీయొచ్చు. పక్కలో బల్లెంగా ఉన్న లెబనాన్ రేపు ఇజ్రాయెల్‌కి జీవన్మరణ సమస్యగా మారొచ్చు. ఆఫ్ఘనిస్థాన్‌లో రాజీ ఒప్పందం కోసం పలు షరతులు పెడుతున్న తాలిబన్లు మరింత మొండిగా మారొచ్చు. ఇరాన్‌ని విదేశీ ముప్పుగా చిత్రించి, దాడులకు దిగితే ఎన్నికల్లో విరుద్ధ ఫలితాలు సంభవించే కొత్త పరిస్థితి అమెరికాలో నేడు ఉన్నది. పైగా యుద్ధోన్మాదం వల్ల ఒకపార్టీకి రాజకీయ లబ్ధి చేకూరితే, అమెరికా కార్పొరేట్ వ్యవస్థ మొత్తానికి నష్టం చేకూరుతుంది. ఏదైతేనేమి, చరిత్ర గమనంలో ఇరాన్ ఓ కొత్త అధ్యాయాన్ని రచిస్తోంది. సంప్రదాయ అమెరికా యుద్ధోన్మాద చరిత్రని తిరగ రాస్తోంది.
 
పి. ప్రసాద్
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) జాతీయ కార్యదర్శి