A-New-Trump-Policy-Could-Deny-Green-Cards-To-Immigrants-Who-Use-Public-Benefits

ట్రంప్‌ సర్కార్‌ కొత్త ప్రతిపాదన.. గ్రీన్‌కార్డులు ఇక మరింత కష్టం

  • అమెరికా ప్రభుత్వ స్కీములు... ఉపయోగించుకుంటే అనర్హులే
  • ట్రంప్‌ సర్కార్‌ కొత్త ప్రతిపాదన
  • భారతీయులకే పెద్ద దెబ్బ!
వాషింగ్టన్‌, ఆగస్టు 12: అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న వేల మంది భారతీయులకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. గ్రీన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అమెరికన్‌ ప్రభుత్వ పథకాలు, రాయితీలు గత ఏడాది కాలంగా వాడుకొంటూంటే గనక ఈ కార్డు పొందడానికి అర్హులు కాబోరని తాజాగా ప్రకటించింది. చౌక ధరలకు పోషకాహార దినుసులు పొందే ఫుడ్‌ స్టాంప్‌ పథకం, విద్యా పరమైన సబ్సిడీలు, వైద్య-ఆరోగ్య రంగాల్లో తక్కువ ధరవరలకు పొందే సేవలు, గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం.. ఇత్యాదులను ఉపయోగించుకుంటూంటే అటువంటి వారందరినీ అనర్హులుగా చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా విభాగం తాజాగా ప్రతిపాదించింది.
 
దీనికి శ్వేతసౌధం నుంచి కూడా వెంటనే సానుకూలత లభించింది. ఈ చర్య లీగల్‌ ఇమిగ్రెంట్స్‌ సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. గ్రీన్‌కార్డుల జారీ కూడా ఇక కఠినం కాబోతోంది. ఈ రూల్‌ వల్ల వీసా పొడిగింపులు కూడా భారీగా ఉండవు. ఒక అంచనా ప్రకారం... అమెరికాలో 2.2 కోట్ల మంది చట్టబద్ధ వలసదారులున్నారు. తాజా నిర్ణయం దాదాపు 3.82 లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని ఆంతరంగిక భద్రతా విభాగం ప్రకటించింది. అక్టోబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ట్రంప్‌ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త రూల్‌ ప్రభావం ఎక్కువగా పడేది భారతీయులపైనే. తాజా లెక్కల ప్రకారం 6, 32, 219 మంది భారతీయులు గ్రీన్‌కార్డుల క్యూలో ఉన్నారు.. హెచ్‌-1బీ, ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలపై ఉంటున్న ఎక్కువమంది తాత్కాలిక నివాసులే. అయితే ట్రంప్‌ నిర్ణయంపై రాజకీయంగా విమర్శలు రేగాయి.