84-Year-Old-Texas-Woman-Arrested-in-Husbands-Murder-35-Years-Later

క్రైం సినిమాను తలపించే 35 ఏళ్ల మర్డర్ మిస్టరీ.. 84 ఏళ్ల బామ్మ అరెస్ట్‌తో వీడింది

టెక్సాస్: క్రైం సినిమా స్టోరీని తలపించే విధంగా 35 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్‌ మిస్టరీని తాజాగా పోలీసులు ఛేదించారు. 1984లో భర్తను భార్య తుపాకీతో కాల్చి చంపడం.. ఆ తరువాత పోలీసులకు కథలు చెప్పి తప్పించుకోవడం జరిగింది. అయితే ఓ టీవీ ఛానెల్ నిర్వహిస్తున్న రియాల్టీ బేస్డ్ ట్రు క్రైం షో 'కోల్డ్ జస్టిస్' ద్వారా ఈ హత్య కేసును తిరిగి ఓపెన్ చేయడంతో 35 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ మిస్టరీ వీడింది. ఇన్నేళ్లు తనకేమి తెలియదంటూ తప్పించుకు తిరిగిన 84 ఏళ్ల బామ్మే తన భర్తను హత్య చేసిందని తేలింది. దాంతో ఈ నెల 1వ తేదీన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు రోజుల తరువాత 34 లక్షల పూచీకత్తుపై బామ్మను వదిలిపెట్టారు. వివరాల్లోకి వెళితే... టెక్సాస్‌లోని బఫెలోకి చెందిన 84 ఏళ్ల బామ్మ నోర్మా ఆల్బ్రిటన్ 35 ఏళ్ల క్రితం మే 14, 1984లో భర్త జానీ ఆల్బ్రిటన్‌ను  ఇంట్లోనే తుపాకీతో కాల్చి చంపింది. ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను ఎవరో హత్య చేసి పారిపోయారని చెప్పింది.

ఆమె సమాచారంతో అక్కడకు వచ్చిన పోలీసులకు తన కూతురితో కలిసి తాను బయటకు వెళ్లి వచ్చేసరికి భర్త జానీ ఆల్బ్రిటన్‌ విగతజీవిగా పడి ఉన్నాడని, ఇంటి కిటికీల వద్ద తుపాకీ దొరికినట్లు చెప్పింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెకు లైవ్ డిటేక్టర్ పరీక్ష కూడా చేశారు. అయినా ఆమెనే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించలేక పోయారు. అయితే, 2015లో ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను లియోన్ కౌంటీ పోలీస్ అధికారి కెవిన్ ఎల్లిస్ డిజిటైజ్ చేసి కోల్డ్ జస్టిస్ షో వాళ్లకు అప్పగించాడు. వారు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని పోలీసులు ఇచ్చిన ఆధారాలను వెంటబెట్టుకుని సుమారు 50 మందిని ఇంటర్వ్యూ చేశారు. షో నిర్వహకుల విచారణలో వారికి లభించిన ఆధారాల ఆధారంగా నోర్మా ఆల్బ్రిటనే భర్తను హత్య చేసినట్టు నిర్ధారించారు. వాటిని పోలీసులకు సమర్పించడంతో జూలై 1న 85 ఏళ్ల బామ్మను పోలీసులు అదుపులోకి తీసున్నారు. ఆ తరువాత 34 లక్షల పూచీకత్తుపై ఆమెను విడుదల చేశారు. అయితే షో నిర్వహకులకు బామ్మే హత్య చేసినట్టు లభించిన ఆధారాలేంటో మాత్రం పోలీసులు బయటకు చెప్పలేదు.