78-Days-to-take-Visa-Interview-Time-in-Hyderabad-Center-for-Students

వీసాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. హైద్రాబాద్‌లో అత్యధికంగా 78 రోజులు

హైద్రాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి ఏటా జనవరి-ఫిబ్రవరి నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో యూఎస్ చదువుల కోసం వెళ్లే వేలాది మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హైద్రాబాద్‌లోని వీసా కేంద్రంలో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దేశంలోని మిగతా ఐదు ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఇంటర్వ్యూల కోసం వెయిటింగ్ సమయం అధికంగా ఉంటుంది. హైద్రాబాద్ కాన్సులేట్ పరిధిలో కనిష్టంగా 25 రోజులు, గరిష్టంగా 78 రోజుల సమయం పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి  ప్రతి ఏడాది సుమారు 50వేల మంది వరకు విద్యార్థులు అమెరికాలో చదవుల కోసం వెళ్తుంటారని అంచనా. దీంతో హైద్రాబాద్ కాన్సులేట్ పరిధిలో వేచిచూసే సమయం ఎక్కువగా ఉంటుంది. 

ఇక కోల్‌కతాలో 25 రోజులు, ముంబయిలో 35 రోజులు, చెన్నైలో 40 రోజుల పాటు విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థి ఉంది. మరోవైపు అమెరికాలో విద్యా సంవత్సర ప్రారంభం సమీపిస్తున్నా వీసా ఇంటర్వ్యూ సమయం కోసం వేచి చూడాల్సి రావడం విద్యార్థులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా విద్యార్థుల వీసా(ఎఫ్-1) జారీ ప్రక్రియకు నాలుగు నెలల ముందు నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనుక వసంత మాసంలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలోని కోర్సుల్లో చేరే విద్యార్థులు అక్టోబర్, నవంబర్ నెలల్లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన.