5G-remote-surgery-conducted-in-china

5జీ పరిజ్ఞానంతో చైనాలో శస్త్రచికిత్స

చైనా: సరికొత్తగా అందుబాటులోకి వస్తున్న అధునాతన 5జీ పరిజ్ఞానాన్ని చైనా వైద్యులు శస్త్రచికిత్సలో విజయవంతంగా ఉపయోగించారు. మారుమూల ప్రాంతంలో నిర్వహించిన పిత్తాశయం శస్త్రచికిత్సను, అక్కడికి 200 కి.మీ. దూరంలో ఉన్న సర్జన్లు 5జీ సాంకేతిక నెట్‌వర్స్ ద్వారా పర్యవేక్షించారు. గతవారం చైనాలోని ఉత్తర హబెయి ప్రావిన్సులోని షెన్నోంగ్జియా జిల్లాలోని టైహె ఆసుపత్రి శాఖలో ల్యాపరోస్కోపిక్ కొలెసిస్టెక్టమీ ఆపరేషన్‌ను చేపట్టారు. సర్జరీ ప్రక్రియను షియాన్ నగరంలోని టైహె ప్రధాన ఆసుపత్రికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించారు. 5జీ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నెట్‌వర్క్‌లో ఎలాంటి ఆలస్యం లేకుండా, స్పష్టతతో ప్రసారం అందింది. ప్రధాన ఆసుపత్రిలోని నిపుణుల బృందం ఎప్పటికప్పుడు శస్త్రచికిత్సను పర్యవేక్షిస్తూ సర్జన్లకు తగిన సూచనలు అందజేసింది. సర్జరీ తర్వాత రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్య బృందం పేర్కొంది.