34000-Indians-Died-in-Six-Gulf-Countries-in-Five-Years

ఐదేళ్లుగా గల్ఫ్ దేశాల్లో 34వేల మంది భారతీయులు మృతి..

హైదరాబాద్: గత ఐదేళ్లలో గల్ఫ్ దేశాల్లో సుమారు 34వేల మంది భారతీయులు మృతిచెందితే, వీరిలో 1200 మంది తెలంగాణ వాసులు ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాలైన కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ప్రతిరోజూ సగటున 15 మంది భారతీయ వలసదారులు మరణిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. 2014 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 33,988 మంది భారతీయులు పైన పేర్కొన్న ఆరు గల్ఫ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం, ఇతర పనులపై వెళ్లి మృత్యువాత పడినట్టు నివేదిక తెలిపింది. ఒక్క 2019 ఏడాదిలోనే ఇప్పటి వరకు 4,823 మంది చనిపోయారు. పార్లమెంట్ శీతకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్‌సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ ఈ వివరాలను వెల్లడించారు. అలాగే అత్యధికంగా భారతీయ వలస కార్మికులు మృతి చెందుతున్నది మాత్రం సౌదీ, యూఏఈలలో అని ఆయన పేర్కొన్నారు. 

గల్ఫ్‌లోని ఆరు దేశాల్లో 2019లో భారతీయుల మరణాలకు సంబంధించిన గణాంకాలు ఇలా ఉన్నాయి. సౌదీ అరేబియాలో 1,920 మంది చనిపోతే, యూఏఈలో 1,451 మంది, కువైట్‌‌లో 584 మంది, ఒమన్‌లో 402 మంది, ఖతార్‌లో 286 మంది, బహ్రెయిన్‌లో 180 మంది... ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 4,823 మంది చనిపోయారు. అలాగే 2014-2019 వరకు వివిధ సంవత్సరాలలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే... 2014లో 5,388 మంది మరణిస్తే, 2015లో 5,786 మంది, 2016లో 6,013 మంది, 2017లో 5,604 మంది, 2018లో 6,014 మంది, 2019లో 4,823 మంది చనిపోయారు. ఈ ఐదేళ్లలో మొత్తం 33,988 మంది భారతీయులు ఆరు గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడ్డారు. 

తెలంగాణ ఎన్నారై వింగ్ ప్రతినిధి ఈ. చిట్టిబాబు మాట్లాడుతూ భారత్‌లోని తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో సంభవిస్తున్న మరణాల్లో అత్యధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఒక్క తెలంగాణ నుంచే దాదాపు 1,200 మంది చనిపోయారని ఆయన తెలిపారు. 

తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. బసంత్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల్లో అత్యధికంగా రుణభారంతో అది తీర్చే మార్గంలేక ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడి చనిపోతుంటే, మరికొందరు ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. చాలా వరకు వర్క్ వీసా పేరిట నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారని ఆయన తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే(అక్టోబర్ వరకు) 15,051 మంది గల్ఫ్ ఎన్నారైలు ఉద్యోగం పేరిట ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదులు అందాయని విదేశాంగ మంత్రిత్వశాఖ నివేదిక పేర్కొంది. వీరిలో అత్యధికులు వలస కార్మికులని మంత్రి మురళీధరన్ వెల్లడించారు.