28-years-Young-men-married-65-years-old-woman

విదేశీ కోడళ్లు.. అమ్మాయిలు దొరక్క బ్రహ్మచారుల అవస్థలు

హరియాణాలో ఫారిన్‌ వధువుల సందడి

అమెరికా వృద్ధ మహిళతో యువకుడికి పెళ్లి

ఫేస్‌బుక్‌ పరిచయాలతో నలుగురికి అమెరికా పెళ్లాలు
పంజాబ్‌, హరియాణాల్లో పెరుగుతున్న దేశాంతర వివాహాలు

అతను ఆమె ఫొటోకి లైక్‌ కొట్టాడు. ఆమె అతని పోస్ట్‌కి కామెంట్‌ పెట్టింది. చాటింగ్‌లో అభిప్రాయాలు కలిశాయి. వీడియో కాలింగ్‌లో ఒకరినొకరు చూసుకున్నారు. ఆన్‌లైన్‌లో మనసులు షేర్‌ చేసుకున్నారు. ఎనిమిది నెలలపాటు డిస్టెన్స్‌ లవ్‌ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
 
కట్‌ చేస్తే.. హరియాణాలో కైథల్‌ జిల్లాలో ఒకటే సందడి..! సైర్‌ గ్రామానికి చెందిన ప్రవీణ్‌ అనే ఆ యువకుడి కోసం అమెరికా నుంచి ఎబ్నర్‌ అనే 65 ఏళ్ల మహిళ వచ్చేసింది. ఎంఏ చదివిన ప్రవీణ్‌ (28) ఉద్యోగం రాకపోవడంతో కార్మికుడిగా మారాడు. తమది పేద కుటుంబమనీ, చిన్న ఇంట్లో అమ్మా నాన్నలతో కలిసి ఉంటానని ఎబ్నర్‌కు చెప్పాడు. అమెరికా నుంచి వస్తే..ఎయిర్‌పోర్టుకి రావడానికి కూడా తన దగ్గర డబ్బుల్లేవన్నాడు. ప్రవీణ్‌ను ఇష్టపడిన ఆ మహిళ.. ‘నేనే బస్సులో మీ ఊరికి వస్తాన’ంది. నిజాయితీగా తన గత జీవితం గురించి చెప్పింది. ప్రమాదంలో భర్తను కోల్పోయిన తాను ఒంటరిగా బతుకుతున్నానని వెల్లడించింది. తర్వాత ప్రవీణ్‌- ఎబ్నర్‌ సిక్కు మత సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
 
హరియాణా మొగుడు..కాలిఫోర్నియా పెళ్లాం..
కొంతమంది హరియాణా యువకులు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. లైఫ్‌ పార్ట్‌నర్‌ కోసం సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. ఫేస్‌బుక్‌ పుణ్యామాని ఇటీవల నలుగురు హరియాణా యువకులు అమెరికాలో వధువులను వెతుక్కున్నారు. హరియాణాలోని సోనిపత్‌ జిల్లాకు చెందిన అరుణ్‌ ఖత్రీ, అమెరికాకు చెందిన తమతా కుజన్‌షవిలీ మధ్య ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఇటీవలే వారికి కవల ఆడపిల్లలు పుట్టారు. అలాగే ముఖేష్‌ కుమార్‌ అనే యువకుడిని కాలిఫోర్నియాకు చెందిన అడ్రియానా పెరల్‌ (41) ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాలిఫోర్నియాకే చెందిన జునా పోలైన్‌ (33) జింద్‌కు చెందిన రాజు పహిల్వాన్‌ను పెళ్లి చేసుకుంది. కర్నాల్‌కు చెందిన ఖాన్కర్‌కు అమెరికాకు చెందిన చనితా డొవిల్లా రోబ్సన్‌తో పెళ్లైంది.
 
అమెరికా కోడళ్లు
హరియాణా పల్లెలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి.. ఈ అమెరికా కోడళ్లను చూడటానికి జనం క్యూ కడుతున్నారు. ‘నా భర్తతో కలిసి బయటకు వెళితే చాలు..బంధువులు వింతగా చూసేవారు.. మా పెళ్లైన కొత్తల్లో పొరుగూళ్ల నుంచి కూడా నన్ను చూడ్డానికి వచ్చేవారు. కొత్తవారితో కూడా కోడలు గలగల మాట్లాడుతోందని సంతోషం వ్యక్తం చేసేవారు’ అంటోంది రాజు పహిల్వాన్‌ని మనువాడిన జునా పోలైన్‌. అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని.. ఈ విదేశీ కోడళ్లు హరియాణా పల్లెల్లో ఎలా ఉండగలరు? అనే అనుమానం రాకమానదు.
 
దానికి వారిచ్చే సమాధానం..భారత్‌లో మగాళ్లు మంచి జీవిత భాగస్వాములని! ‘నేను ఇలాంటి చోట ఉంటానని కలలో కూడా ఊహించలేదు. కానీ భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, తల్లిదండ్రులతో కలిసి పిల్లలు జీవించడం నాకు నచ్చాయి. అమెరికాలో బంధాలు కొన్నేళ్లు మాత్రమే! కానీ భారతీయ పురుషులు మంచి జీవిత భాగస్వాములు. నమ్మదగినవారు’ అని ఖాన్కర్‌ను పెళ్లి చేసుకున్న చనితా రోబ్సన్‌ పేర్కొంది. అయితే అరుణ్‌ ఖత్రీని పెళ్లి చేసుకున్న చనిత మాత్రం భర్తతో కలిసి జార్జియా వెళ్లిపోయుంది. మొత్తానికి ఈ నలుగురి లవ్‌ స్టోరీ తెలుసుకుని హరియాణాలో చాలామంది బ్రహ్మచారులు స్మార్ట్‌ ఫోన్లు అందుకున్నారు.
 
వధువులను కొనుక్కొంటున్నారు
భ్రూణహత్యల పాపం హరియాణా ప్రజలను వెంటాడుతోంది. పెళ్లి కూతుళ్లు దొరక్క హరియాణాలో బ్రహ్మచారులు ముదిరిపోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆడపిల్లల కొరత హరియాణాలో ప్రధానాంశమయింది. రాష్ట్రంలోని యువకులకు బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ల నుంచి పెళ్లికూతుళ్లను తీసుకువస్తామని కొందరు నాయకులు హామీలు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదమయిందిగానీ.. వాస్తవంగా అదే జరుగుతోంది. పొరుగునున్న హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు వెళ్లి పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంతోపాటు.. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ల నుంచి వధువులను కొనుక్కొంటున్నారు. ఇటీవల కురుక్షేత్రకు చెందిన జోగిందర్‌ సింగ్‌ పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమ్మాయి కుటుంబానికి రూ.20 వేలు ఎదురిచ్చి పెళ్లి చేసుకున్నాడు.