2000-Pythons-Caught-in-Florida

2 వేల కొండచిలువలు పట్టేసిన ఫ్లోరిడా వేటగాళ్లు..

మార్టిన్ కౌంటీ: ప్రకృతిని నాశనం చేస్తున్న బర్మీస్ పైథాన్(ఓ రకం కొండచిలువ)లను పట్టుకోవడానికి దక్షిణ ఫ్లోరిడా నీటి నిర్వహణ విభాగం చేపట్టిన పైథాన్ నిర్మూలనా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 2005 నుంచి 2010 మధ్య ఈ కొండచిలువల సంఖ్య దాదాపు రెట్టింపయిందని పరిశోధకులు వెల్లడించారు. దీని వల్ల ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ ప్రాంతంలో ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలని నిర్ణయించుకున్న ఫ్లోరిడా నీటి నిర్వహణా విభాగం ఈ కొండ చిలువలను నిర్మూలించడానికి నడుం బిగించింది. వీటిని పట్టుకోవడానికి నమోదు చేసుకున్న వారికి పని చేసిన గంటల చొప్పున జీతాలిస్తామని, పట్టుకున్న ప్రతి కొండచిలువకూ అదనంగా బహుమతి అందిస్తామని ప్రకటించింది. దీంతో చాలామంది వేటగాళ్లు ఈ ప్రాంతానికి చేరుకొని కొండచిలువలను పట్టుకోవడం మొదలెట్టారు. వీరిలో ఇండియన్‌టౌన్‌కు చెందిన మైక్ కిమ్మెల్ ఒకరు. ఏకధాటిగా 72 గంటలపాటు కొండచిలువల కోసం గాలించిన ఆయన సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 7 అడుగుల ఓ చిలువను పట్టుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పట్టుకున్న కొండచిలువల సంఖ్య 2 వేలకు చేరింది. తొలి ఏడాదిలో కనీసం 60 చిలువలను బంధించాలని తాము అనుకున్నామని, కానీ రెండో ఏడాదిలోనే 2 వేల చిలువలను పట్టుకొన్నామంటే ఈ కార్యక్రమం ఏ మేరకు విజయవంతం అయిందో తెలుస్తోందని అధికారులు తెలిపారు.