20-Year-old-Indian-Girl-Diagnosed-with-Rare-Disease-in-UAE

యూఏఈలో 20 ఏళ్ల భారతీయ అమ్మాయికి అరుదైన వ్యాధి.. 6 నెలలుగా వెంటిలేటర్‌పైనే చికిత్స

అబుదాబి: యూఏఈలో 20 ఏళ్ల భారతీయ అమ్మాయి అరుదైన వ్యాధితో బాధపడుతున్నది. వైద్య పరిభాషలో ఆటో ఇమ్యూన్ ఎన్సెఫాలిటిస్‌గా వ్యవహరించే రుగ్మతతో నీతు షాజి పనిక్కర్(20) అనే యువతి గత ఆరు నెలలుగా అబుదాబిలోని షేక్ ఖలీఫా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది.ఈ వ్యాధి సోకిన వారి రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన మెదడు కణాలపై దాడి చేస్తుంది. దీంతో మెదడు వాపు రావడం జరుగుతుంది. దీని ప్రభావంతో రోగికి వివిధ నాడీ సంబంధిత రుగ్మతలు, మానసిక రుగ్మతలు కలుగుతాయని, ఇవే ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నీతు ఈ అరుదైన వ్యాధి బారినపడి దేశం కాని దేశంలో ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె ప్రయాణించే స్థితిలో కూడా లేదు. కాని ఆమె తల్లి బిందు లలిత మాత్రం తన కూతురికి పూర్తిగా నయం అవుతుందని, తాము తిరిగి స్వదేశానికి వస్తామనే ఆశాభావంతో ఉంది.  

పదేళ్ల కింద బతుకుదెరువు కోసం యూఏఈ వెళ్లిన బిందు లలిత...
బిందు లలిత(40)ను భర్త వదిలేయడంతో వేరే ఆధారం లేక ఇద్దరు కూతుళ్లతో కలిసి 10 ఏళ్ల క్రితం బుతుకుదెరువు కోసం యూఏఈ వెళ్లింది. చిన్న చిన్న పనులు చేస్తూ కూతుళ్లను పెంచి పెద్ద చేసింది. గతేడాది డిసెంబర్‌లో పెద్ద కూతురు నీతు షాజి పనిక్కర్(20)కు షార్జాలో పనిచేసే జితిన్ అనే యువకుడితో వివాహం జరిపించింది. పెళ్లైన నెల రోజుల తరువాత విజిటింగ్ వీసాపై నీతు యూఏఈలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చింది. నెలన్నర తల్లి వద్ద బాగానే ఉన్న నీతు ఉన్నట్టుండి మార్చి 17న వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది. దీంతో కంగారు పడిన బిందు కూతురును స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. నీతును పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని అబుదాబిలోని షేక్ ఖలీఫా ఆసుపత్రికి పంపించారు. మార్చి 27న నీతుకు టెస్టులు నిర్వహించిన వైద్యులు ఆమె ఆటో ఇమ్యూన్ ఎన్సెఫాలిటిస్‌‌తో బాధపడుతున్నట్టు తేల్చారు. అప్పటి నుంచి ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలోని వైద్యులు మా కోసం చాలా చేశారు. నా కూతురి రుగ్మతను నయం చేయడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. నేను వారికి నా కృతజ్ఞతలు అని బిందు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన కూతురు ప్రయాణించే స్థితలో లేదని చెప్పిన బిందు... వైద్యులు చికిత్స వల్ల ఆమె వ్యాధి నయమైతే స్వదేశానికి తిరిగి వస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.