145-Indians-Sent-back-by-America-with-Hands-and-Feet-Tied

అక్రమంగా తమ దేశంలో ప్రవేశించారని.. భారతీయులను కాళ్లు, చేతులు కట్టేసి..

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా 145 మంది భారతీయుల్ని అక్రమంగా తమ దేశంలో ప్రవేశించారని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. వీరందరూ బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా గత కొన్నేళ్లుగా అక్రమ మార్గంలో అంతర్జాతీయ ఏజెంట్ల ద్వారా యూఎస్ చేరుకున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అక్కడే ఉంటున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. అయితే, అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన తమను అక్కడి అధికారులు కాళ్లు, చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో పంపించారని బుధవారం స్వదేశానికి వచ్చిన 145 మంది భారతీయులు వాపోయారు. తొలుత అక్రమ వలసదారుల శిబిరంలో నిర్బంధించిన అమెరికా అధికారులకు భారత అధికారులు తాత్కాలిక అనుమతి పత్రాలు ఇవ్వడంతో తిరిగి వచ్చామన్నారు.

తాము ఈక్వెడార్‌, దక్షిణ అమెరికా దేశాల్లోని ఏజెంట్లకు రూ.25 లక్షలు చెల్లించి అమెరికాలోకి ప్రవేశించామని బాధితులు తెలిపారు. కాగా, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరో ఐదుగురు భారతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని న్యూయార్క్‌లోని ఓగ్డెన్స్‌బర్గ్ బోర్డర్ పెట్రోలింగ్ స్టేషన్‌కు తరలించారు.  వీరి వద్ద ఎలాంటి ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేవని అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగానే యూఎస్‌లోకి ప్రవేశించారని నిర్ధారించి అరెస్ట్ చేశారు. అనంతరం తదుపరి ప్రాసెసింగ్ కోసం న్యూయార్క్‌లోని ఓగ్డెన్స్‌బర్గ్ బోర్డర్ పెట్రోలింగ్ స్టేషన్‌కు తరలించారు.   

 

ఇదిలాఉంటే వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీన 311 మంది భారతీయుల్ని మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు. వీరంతా అంతర్జాతీయ ఏజెంట్లకు భారీ మొత్తంలో చెల్లించి యూఎస్‌ వెళ్లేందుకు ప్రయత్నించారని సమాచారం. అలాగే అక్టోబర్ 23న కూడా యూఎస్ 117 మంది ఇండియన్స్‌ను బహిష్కరించింది. వీరందరూ సరియైన ధృవపత్రాలు లేకుండా, వీసా గడువు ముగిసిన అక్కడే ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కొరడా ఝులిపిస్తుండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో అక్రమంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీయులు వెనక్కి తిరిగి రాక తప్పడం లేదు.