- చైనాలో అతిపెద్ద ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ వెల్లడి..
- మర్నాడే అధికారిక గణాంకాలతో సర్దుబాటు
బీజింగ్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 564 అని చైనా అధికారికంగా వెల్లడిస్తోంది. కానీ.. ఈ వైరస్ కారణంగా 24 వేల మందికిపైగా చనిపోయారంటూ చైనాకు చెందిన అతిపెద్ద ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ ‘టెన్‌సెంట్’లో ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది. కరోనా వైర్‌సపై ఆ వెబ్‌సైట్ చాలా రోజులుగా ‘ఎపిడమిక్ సిచ్యువేషన్ ట్రాకర్’ పేరుతో ఒక ట్రాకర్‌ను తన సైట్‌లో పెట్టింది. కరోనా మృతులు, అనుమానితులు, ఆ వైరస్ బారిన పడినవారి సంఖ్యను అందులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 1,54,023గా, మృతుల సంఖ్య 24,589గా ఆ ట్రాకర్ చూపించింది. అంటే.. అధికారిక గణాంకాలకన్నా మృతుల సంఖ్య 80 రెట్లు ఎక్కువ. ఈ సంఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో.. ఆ వెబ్‌సైట్ వెంటనే తన ట్రాకర్‌లో నంబర్లను అధికారిక గణాంకాలకు అనుగుణంగా సర్దుబాటు చేసింది. అంటే.. వైరస్ బారిన పడినవారి సంఖ్యను 14,446కు (ఫిబ్రవరి 1 నాటికి), మృతుల సంఖ్యను 304కు మార్చింది. చైనాలో పరిస్థితి విషమించిందని.. కానీ, ఆ విషయం బయటపడకుండా సర్కారు దాస్తోందని, టెన్‌సెంట్ ఫిబ్రవరి 1న తన ట్రాకర్‌లో పెట్టిన గణాంకాలే ఇందుకు నిదర్శనమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి 1 ముందు వరకూ టెన్‌సెంట్ వెబ్‌సైట్ వాస్తవ గణాంకాలనే ఇచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో తప్పుడు గణాంకాలు ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు. వూహాన్‌లో చాలా మంది వైరస్ బాధితులు సహాయం కోసం వీచాట్ వంటి యాప్‌ల్లో అభ్యర్థిస్తున్నారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే.. ఒక్క వూహాన్‌లోనే లక్ష నుంచి 3.5 లక్షల మందికి సోకి ఉండొచ్చని వైద్యనిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, చైనా సర్కారు మృతుల సంఖ్యపై వెబ్‌సైట్లలో వస్తున్నవన్నీ తప్పుడు గణాంకాలేనని కొట్టిపారేసింది.
27 దేశాలకు వ్యాపించిన కరోనా
అధికారిక గణాంకాల ప్రకారం.. కరోనా వైరస్ మృతుల సంఖ్య 565కు చేరింది. ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 28,018 అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ఒక్క బుధవారంనాడే వైరస్ బాధితుల్లో 73 మంది మృతిచెందారు. కరోనా ప్రబలినప్పటి నుంచి ఇంత మంది ఒక్కరోజు చనిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. బుధవారం ఒకేరోజు 3694 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ గణాంకాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెంచుతున్నాయి. మరోవైపు.. క్వారంటైన్‌గా మార్చిన జపాన్ నౌకలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 20కి చేరింది. చైనాకు ఆవల 27 దేశాల్లో దాదాపు 260 మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. కరోనా ముప్పును ఎదుర్కోవడానికి 675 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4807 కోట్లు) కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచదేశాలకు తెలిపింది. ‘‘ప్రపంచ దేశాలకు మా సందేశం ఏంటంటే.. (కరోనాపై పోరుకు) ఇవాళ పెట్టుబడి పెట్టండి.. లేదా భవిష్యత్తులో మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అని డబ్ల్యూహెచ్‌వో తేల్చిచెప్పింది. కాగా.. చైనా నుంచి తరలించిన 645 మంది భారతీయులకూ వైద్యపరీక్షలు చేయించగా.. కరోనా నెగెటివ్ వచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
13 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రి
కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు.. వైరస్‌కు కేంద్రస్థానమైన వూహాన్‌లో 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన చైనా తాజాగా మరో ఆస్పత్రిని నిర్మించింది. జనవరి 25న నిర్మించిన ఈ 1500 పడకల ఆస్పత్రి నిర్మాణం గురువారానికి పూర్తయింది. అంటే.. 13 రోజుల్లో పూర్తయిందన్నమాట. వూహాన్‌లో ఇప్పటిదాకా 132 క్వారంటైన్లను చైనా సర్కారు ఏర్పాటు చేసింది. కొత్తగా కట్టిన రెండు ఆస్పత్రులు, ఆ క్వారంటైన్లతో కలిపి మొత్తం 12,500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. కానీ.. వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకు మించి ఉంటుండడంతో ఆస్పత్రుల్లో పడకలు సరిపోక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పడకలే కాదు.. పరికరాలు, మాస్కులు సరిపోవట్లేదు. దీంతో సరైన చికిత్స అందక చనిపోయినవారి మృతదేహాలు ఆస్పత్రుల కారిడార్లలో పడి ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
చైనా ఆస్పత్రుల్లో సేవా రోబోలు
కరోనా బాధితులకు చికిత్స చేయాలంటే వైద్య సిబ్బందికీ ప్రమాదమే. ఈ నేపథ్యంలో గువాంగ్‌డాంగ్‌లోని ప్రజావైద్యశాల కృత్రిమమేధతో పనిచేసే రెండు రోబోలను ఏర్పాటుచేసింది. వాటి పేర్లు.. పింగ్ పింగ్, యాన్ యాన్. ఈ రోబోల లోపలి భాగాల్లోకి కరోనా వైరస్ వ్యాపించినా వాటిని స్వయంగా శుభ్రం చేసుకునే ఏర్పాట్లున్నాయి. ఈ రోబోలు పేషెంట్లకు మందులు ఇస్తాయి. వారు వాడేసిన పక్క దుప్పట్లను, పడేసిన చెత్తను సేకరిస్తాయి. చార్జింగ్ అయిపోతే ఇవి తమంత తాము చార్జింగ్ చేసుకుంటాయి.
కరోనా వైరస్‌కు పేరు సిద్ధం
కరోనా వైరస్.. అని యథాలాపంగా అనేస్తున్నాంగానీ, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ కరోనా కుటుంబానికి చెందినది. కరోనా కుటుంబంలో చాలా రకాల వైర్‌సలున్నాయి. సార్స్, మెర్స్ వంటివి ఇందుకు ఉదాహరణలు. కొత్త వైర్‌సను తాత్కాలికంగా 2019-ఎన్‌సీవోవీ (నావెల్ కరోనా వైర్‌స)గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్నేక్ ఫ్లూ అని.. బ్యాట్ ఫ్లూ అని పిలుస్తున్నారు. వాటన్నిటికీ చెక్ పెట్టేలా ‘ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ (ఐసీటీవీ)’ శాస్త్రజ్ఞులు ఈ వైర్‌సకు ఒక పేరు పెట్టారు. కానీ, అధికారికంగా బయటకు వెల్లడించలేదు. కరోనా వైర్‌సకు తాము పెట్టిన పేరులో ప్రాంతాల, మానవుల, జంతువుల పేర్లేవీ లేవని ఐసీటీవీ వర్గాలు తెలిపాయి.