Without-Nehru-Kashmir-would-have-Joined-Pakistan

నెహ్రూ లేకుంటే..

అసలు నెహ్రూ లేకుంటే కశ్మీర్, భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో చేరివుండేది. ఈ వాస్తవాన్ని దాచి నెహ్రూ దేశద్రోహానికి పాల్పడినట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోంది. స్వతంత్ర భారతదేశ తొలి వేకువలో నెహ్రూ వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాది, సుస్థిరంగా నెలకొల్పిన పార్లమెంటరీ విధానం ఆధారంగానే ఈ రోజు మోదీ సర్కారు అధికారంలోకి రాగలిగిందనేది వాస్తవం.

భాక్రానంగల్, నాగార్జున సాగర్‌లతోసహా దేశవ్యాప్తంగా పలు భారీ ఆనకట్టలకు భూమిపూజ చేసి పునాదిరాయి వేసింది ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. 1955లో నాగార్జున సాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసిన అనంతరం నెహ్రూ కొంతసేపు కూలీలతో కలిసి మట్టి తవ్వి, ఆ మట్టిని తట్టలతో మోసి ఎత్తి పోశారు. ఆ సందర్భంగా ఒక కూలీ ఆయనతో ‘ఈ ఆనకట్ట మీరు మాకు ఇస్తున్న కానుక’ అని అన్నాడు. ఆ మాట నెహ్రూ మనసులో నిలిచిపోయింది. ఆ తరువాత గుంటూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆ కూలీ చెప్పిన మాటను నెహ్రూ ఎంతో ఉద్వేగంతో ఉటంకిస్తూ ఆనకట్టలను ‘ఆధునిక దేవాలయాలు’గా అభివర్ణించారు. తదాది బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా ప్రాచుర్యం పొందాయి. కరువు రక్కసిని పారద్రోలి, దేశాన్ని సస్యశామలం చేయడానికి, పల్లెలను విద్యుత్ వెలుగులతో నింపడానికి అనేక ‘ఆధునిక దేవాలయాల’ను నిర్మించిన నవ భారత స్రష్ట, ద్రష్ట నెహ్రూ.
 
సరైన వైద్య సదుపాయాలు కొరవడి, నానా రోగాలతో సతమతమవుతున్న ప్రజానీకానికి అవసరమైన ఔషధాలు అన్నిటినీ దశాబ్దాల పాటు అతి చవగ్గా అందుబాటులో ఉంచిన (హైదరాబాద్‌లోని) ఐడిపిఎల్ ఔషధాల తయారీ కర్మాగారం నెహ్రూ చలవ అని ఎంతమందికి తెలుసు? పారిశ్రామిక అభివృద్ధికి ఉక్కు అవసరమని గుర్తించిన నెహ్రూ, అలనాటి సోవియట్ యూనియన్ అందించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పలు ఉక్కు కర్మాగారాలను నిర్మించారు. అవి దేశ పురోగతికి ఎంతగా తోడ్పడ్డాయో మరి చెప్పనవసరం లేదు. నెహ్రూ పారిశ్రామిక విధానానికి కొనసాగింపుగా నెలకొల్పిందే విశాఖ ఉక్కు కర్మాగారం. 1979లో రష్యా ప్రధాని అలెక్సి కొసిగిన్ భారత పర్యటన సందర్భంగా అప్పటి విదేశాంగ మంత్రి అటల్ బిహారి వాజపేయి, నెహ్రూ పారిశ్రామిక విధానానికి కొనసాగింపుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నెహ్రూ మరణించిన తర్వాత భిలాయికి కొనసాగింపుగా విశాఖ ఉక్కు, సింధ్రీకి కొనసాగింపుగా రామగుండం ఎరువుల కర్మాగారం తెలుగునాట ఏర్పాటయ్యాయి. ఇంతెందుకు.. ఒక్క మాటలో స్వతంత్ర భారత సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకుడు నెహ్రూ. ఇప్పుడు మనం సాధిస్తున్న, భవిష్యత్తులో సాధించబోయే అభివృద్ధిపై కూడా నెహ్రూ ముద్ర ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. వలస పాలకులు పీల్చి పిప్పి చేసిన ఆర్థిక వ్యవస్థ, నేటికీ చరిత్రలో ఘోరకలిగా మిగిలిన దేశవిభజన గాయం, పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, విద్యా పరంగా వెనుకబడినతనం మొదలైన పరిస్థితులలో స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ నిస్సందేహాంగా ఒక మహానాయకుడు.
 
నెహ్రూ ఒక్క భారతదేశానికే కాకుండా వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న, బానిసత్వ శృంఖలాలను తెంచుకున్న అనేక దేశాలకు కూడా నాయకుడుగా వెలుగొందిన మహావ్యక్తి. ప్రజల పక్షాన నిలిచిన నిజమైన ప్రజాస్వామ్యవాది. కనుకనే కశ్మీర్‌లో మహారాజా హరిసింగ్ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్వహించిన షేక్ అబ్దుల్లాను ఆయన సమర్థించారు. షేక్ అబ్దుల్లా సహాయంతోనే నెహ్రూ, కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయించారు. దేశ విభజన కాలంలో నెలకొన్న ఉద్రిక్తతలు, భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్ధితులు; అంతకు మించి గవర్నర్ జనరల్‌గా ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ ఒత్తిడి తదితర కారణాలతో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అసలు నెహ్రూ, షేక్ అబ్దుల్లా లేకుంటే కశ్మీర్, భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో చేరివుండేది. ఈ వాస్తవాన్ని దాచి నెహ్రూ దేశద్రోహానికి పాల్పడినట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోంది. జాతి అభ్యున్నతికి నెహ్రూ అందించిన సేవలను ఉపేక్షిస్తూ, ఆయన అభ్యుదయ భావాలకు వక్రభాష్యం చెబుతూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. నవ భారత నిర్మాత నెహ్రూ స్మృతికి జరుగుతోన్న ఈ అవమానాన్ని కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా గట్టిగా ఎదుర్కోలేకపోతోంది. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర వహించిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తుత నిస్సహాయ స్ధితికి ఇదొక నిదర్శనం.
 
స్వతంత్ర భారత తొలి వేకువలో నెహ్రూ వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాది, సుస్థిరంగా నెలకొల్పిన పార్లమెంటరీ విధానం ఆధారంగానే ఈ రోజు మోదీ సర్కారు అధికారంలోకి రాగలిగిందనేది వాస్తవం. ఆ కాలంలో అలీనోద్యమంలో నెహ్రూ సహచరులు మార్షల్ టిటో (యుగోస్లేవియా) సుకర్ణో (ఇండోనేషియా) నాసర్ (ఈజిప్టు)లు తమ తమ దేశాలకు స్వాతంత్ర్యం సాధించి అధికార పీఠమెక్కినా ఆ తర్వాత కాలంలో క్రూర నియంతలుగా పరిణమించారు; ప్రజాస్వామ్య పురోభివృద్ధిని అడ్డుకున్నారు. ఒక్క నెహ్రూ మాత్రమే తాను విశ్వసించిన పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని చివరి వరకు పరిపుష్టం చేశారు. భావ స్వేచ్ఛ కల్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నాలుగో స్తంభంగా గుర్తింపు పొందిన పత్రికా రంగ సిబ్బంది ఆర్థికావసరాలను గుర్తించి వేజ్ బోర్డులు ఏర్పాటు చేయించిన ఉదార పాలకుడు నెహ్రూ. ఇప్పుడు మోదీ సర్కార్ న్యూస్ ప్రింట్ దిగుమతిపై సుంకాన్ని పెంచి పత్రికారంగాన్ని కుదేలుపరుస్తోంది.
 
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నెహ్రూ అనుసరించిన విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు, మద్దతు లభించాయి. ఆ తోడ్పాటుతోనే ఆయన అలీనోద్యమానికి శ్రీకారం చుట్టారు. స్వతంత్ర విదేశాంగ విధానానికి రూపకల్పన చేసి అంతర్జాతీయ సమాజంలో భారత్‌కు ఒక గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన మహానాయకుడు నెహ్రూ. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేసి గౌరవాదరాలు పొందిన సమున్నతుడు నెహ్రూ. జవహర్ అంటే వజ్రం. అవును.. ఆయన జాతి వజ్రం. స్వతంత్ర భారతదేశానికి ఈ ‘వజ్ర’ కాంతులు దారి చూపకపోయి ఉన్నట్టయితే భారత ప్రజాస్వామ్యం ఇంత ఘనంగా వర్ధిల్లేదేనా?
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)