Unknown-facts-of-Article-370-Kashmir-issue-and-the-role-of-Lord-Mountbatten

కుంకుమ పువ్వులు, కల్లోల దృశ్యాలు

1970 దశకం తుదినాళ్ళ దాకా హిందీ సినిమాల షూటింగ్‌కు కశ్మీర్‌లో ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు ఉండేవి కావు. షమ్మీ కపూర్, శశి కపూర్, అమితాబ్ బచ్చన్ మొదలైన హేమాహేమీలైన నటులు ఎలాంటి భయం లేకుండా షూటింగ్‌లలో పాల్గొనేవారు. ఆ సుందర భూమిలో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడేవారు.
 
‘చాహె ముజే జంగ్లీ కహో’ అంటూ 1964లో ‘జంగ్లీ’ సినిమాలో షమ్మీ కపూర్ అపూర్వంగా అభినయించిన పాట ఇప్పటికీ ఒక హిట్ సాంగ్. ఈ తరంవారినీ అమితంగా ఆకట్టుకొంటున్న అలనాటి పాటల్లో అదొకటి. ఆ పాటకే కాదు, 1976లో ‘కభీ కభీ’ సినిమాలో అమితాబ్ బచ్చన్ అభినయించిన ‘కభీ కభీ మేరా దిల్ మే ఖ్యాల్ ఆ తా హై’ అనే పాటకూ అందాల హరివిల్లు కశ్మీర్ లోయే నేపథ్యం. ఈ రెండు పాటలకే కాదు మరెన్నో హిందీ సినిమా పాటలకు కూడా కశ్మీర్ సుందర, శోభాయమాన ప్రకృతే నేపథ్యంగా ఉన్నది. కశ్మీర్‌ను సందర్శించ లేని కొందరు సామాన్యులు ఆ కాలంలో హిందీ సినిమాలలో ఆ ‘భూలోక స్వర్గాన్ని’ చూసి ముచ్చటపడేవారు. అయితే కాల క్రమేణా పరిస్థితి మారిపోయింది, 1992 వచ్చేసరికి కశ్మీర్‌లో పెచ్చరిల్లుతున్న హింసాకాండ నేపథ్యం ఇతివృత్తంగా ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘రోజా’ సినిమాకు కశ్మీర్ లోయలో షూటింగ్ చేయడమే సాధ్యం కాలేదు. ఆ తర్వాత మరింతగా పెట్రేగిపోయిన ఉగ్రవాదం నేపథ్యంగా 2006లో అమీర్ ఖాన్ నటించిన ‘ఫనా’ చిత్రాన్ని నిర్మించే నాటికి కశ్మీర్‌లో పరిస్ధితి పూర్తిగా దిగజారిపోయింది.
 
1947లో దేశ విభజన, దాని పర్యవసానాలు కశ్మీరీల మనస్సును అమితంగా గాయపరిచాయి. అయినా 1970 దశకం తుదినాళ్ళ దాకా హిందీ సినిమాల షూటింగ్‌కు కశ్మీర్ లో ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు ఉండేవికావు. అంతా సాఫీగా జరిగిపోయేది. షమ్మీ కపూర్, శశి కపూర్, అమితాబ్ బచ్చన్ మొదలైన హేమాహేమీలైన నటులు ఏలాంటి భయం లేకుండా కశ్మీర్‌లో జరిగే తమ సినిమాల షూటింగ్‌లో పాల్గొనేవారు. ఆ సుందర భూమిలో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడేవారు. ఆ మాటకు వస్తే, అమితాబ్ బచ్చన్ తన తల్లిదండ్రులతో సహా వెళ్ళి తీసుకెళ్ళి ‘కభీ కభీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్లా సరదాగా శ్రీనగర్‌లో తన మోటార్ సైకిల్ పై విహరిస్తుండేవారు.
 
1947 నుంచే కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటే అక్కడి పట్టణాలు, నగరాలలో సైన్యాన్ని ఎందుకు మొహరించలేదు? 1990 తర్వాత మాత్రమే పరిస్థితి ఎందుకు దిగజారింది? ఈ వైపరీత్యానికి కారకులు ఎవరు అనే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం దొరకడం అంత సులభం కాదు. ఫారుఖ్ అబ్దుల్లా తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా, కశ్మీర్ సమస్య మధ్య అవినాభావ సంబంధమున్నది. సీనియర్ అబ్దుల్లాను విస్మరించి, కశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. దేశ విభజన సందర్భంగా ఒక క్లిష్టమైన సమయంలో (నెహ్రుతో ఉన్న స్నేహం కారణాన) భారతదేశం పక్షాన నిలబడ్డ కశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా. కశ్మీర్ వివాదాస్పదం కావడంలో, దేశ విభజన సమయంలో భారత్‌కు గవర్నర్ జనరల్‌గా ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ పాత్ర ఎంతైనా ఉన్నది. ఈ చారిత్రక వాస్తవాన్ని విస్మరించి అధికరణ 370 విషయంలో కేవలం నెహ్రును నిందించడం సబబు కాదు. భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగం కావడానికి మహారాజా హరిసింగ్ కంటే ఎక్కువగా షేక్ అబ్దుల్లానే కారకుడు. అయితే ఆ తర్వాత పరిస్ధితులలో మార్పు వచ్చింది.
 
1965లో హజ్ యాత్రకు వెళ్ళిన షేక్ అబ్దుల్లా మక్కా నుంచి స్వదేశానికి తిరిగివస్తూ అల్జీరియాలో ఆగారు. అక్కడ ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గోనడానికి వచ్చిన చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లై తో షేక్ అబ్దుల్లా సమావేశమయ్యారు. దేశ అంతర్గత విషయాలపై విదేశీ అధినేతలతో మాట్లాడం పట్ల అప్పుడు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి హర్షించలేకపోయారు. వీలైనంత త్వరగా దేశానికి తిరిగి రావాలని లేనిపక్షంలో పాస్‌పోర్టులను రద్దు చేస్తామని షేక్ అబ్దుల్లాకు సమాచారాన్ని పంపించారు. న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన షేక్ అబ్దుల్లాను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసి తమిళనాడుకు తరలించి గృహనిర్బంధం చేశారు. అలా ఏడు సంవత్సరాల పాటు గృహనిర్బంధంలో ఉన్న షేక్ అబ్దుల్లా, 1970 దశకంలో ఇందిరా గాంధీతో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం మేరకు గృహ నిర్బంధం నుంచి ఆయన విడుదలయ్యారు. అయితే అప్పటికే భారతదేశంలోనే కాక ఇరుగు పొరుగు దేశాలలో కూడ పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.
 
గృహ నిర్బంధం నుంచి విడుదలయిన తర్వాత షేక్ అబ్దుల్లా జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అనతి కాలంలోనే ఇందిరా గాంధీతో ఆయనకు బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇందిరా గాంధీ తన రాజకీయాధికారాన్ని దుర్వినియోగం చేసి కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహసించారు. బ్రిటన్‌లో వైద్యవృత్తిలో ఉన్న ఫారుఖ్ అబ్దుల్లా తన తండ్రికి రాజకీయ వారసుడు అయ్యారు. జమ్మూ-కశ్మీర్ కు ముఖ్యమంత్రి అయ్యారు. తమ ప్రియతమ నాయకుడయిన షేక్ అబ్దుల్లా వారసుడిగా ఫారుఖ్ అబ్దుల్లాకు కూడ కశ్మీర్ ప్రజలు పట్టం కట్టారు. అయితే ఆయన ప్రభుత్వాన్ని కూడా ఇందిరా గాంధీ బర్తరఫ్ చేసారు. ఆ రకంగా ఫారుఖ్ అబ్దుల్లా అప్పట్లో తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్‌కు సన్నిహితుడయ్యారు. ఆ విధంగా వారిరువురూ దేశంలో కాంగ్రేసేతర ప్రతిపక్షాల కూటమికి నాంది పలికారు.
 

మరో వైపు సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ పూర్తి స్ధాయిలో పెంచి పోషించి భారత్‌కు కునుకు లేకుండా చేసింది. అదే సమయంలో కశ్మీర్ లోయలోని కశ్మీరీలలో తమ పట్టు నిలబెట్టుకోవడంలో ఫారుఖ్ అబ్దుల్లా, ఇతర కశ్మీరీ నేతలు విఫలమయ్యారు. తత్ఫలితంగా పాఠశాలలకు వెళ్ళే చిన్నారులు కూడా రాళ్ళు రువ్వే పరిస్ధితి దాపురించింది. ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతకు సైన్యాన్ని వినియోగించడం అవసరమే. అయితే ఉగ్రవాద భావజాలాన్ని అంతమెందించడానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. మరి అధికరణ 370 రద్దుతో పరిస్థితి మారుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)