Special-Story-on-Mahatma-Gandhi

మహోన్నత ప్రవాసుడు

లండన్‌లో మేధావుల సహవాసంలో ఉండి వచ్చిన నెహ్రూ, జిన్నా, వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌లు మాతృదేశీయులలో జాతీయ స్ఫూర్తిని కలిగించలేకపోయారు. దక్షిణాఫ్రికాలో నిరక్షరాస్య ప్రవాస కార్మికుల మధ్య ఉండి వచ్చిన గాంధీ మాతృభూమిలో పరిపూర్ణంగా జాతీయ స్ఫూర్తిని రగిలించారు. తద్వారా భారతదేశ స్వాతంత్ర్య సాధనలో మహోన్నత పాత్ర వహించారు.

మోహన్‌దాస్‌ కరంచంద్ గాంధీగా దక్షిణాఫ్రికాకు వెళ్ళిన ఓ విఫల యువ న్యాయవాది మహాత్మా గాంధీగా, ఒక మహానాయకుడిగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఉపాధి ఆవకాశాలను వెతుక్కుంటూ దక్షిణాఫ్రికాకు వెళ్ళిన భారతీయుల నివాస నిబంధనలపై ఆ పరాయి దేశంలో ఒక వినూత్న పద్ధతిలో పోరాడి, ఆ పోరాట లక్ష్యాలను సాధించిన క్రమంలో ఆయన మహాత్ముడుగా రూపొందారు. మహాత్ముడుగా భారతావని స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన ఒక చరిత్రాత్మక మలుపు తిప్పారు. మహాత్ముడిని అవతారపురుషుడుగా ఆరాధిస్తూ ఆయన పిలుపునకు ఆబాలగోపాలం స్పందించారు.
 
భారత్‌ శ్రేయోభిలాషులైన కొంతమంది బ్రిటిష్‌ ఉన్నతాధికారులు, దేశ హితులైన దేశీయ యువ మేధావులు తమ పరిమిత ప్రయోజనాల కోసం కలసికట్టుగా ఏర్పాటు చేసుకున్న భారత జాతీయ కాంగ్రెస్‌ను అశేష సామాన్య ప్రజానీకానికి ఒక వేదికగా మహాత్ముడు తీర్చి దిద్దారు. దేశ స్వాతంత్ర్య సాధన దిశగా ఆ మహా సంస్థను నడిపించారు. ఉన్నత విద్యాభ్యాసానికై సంపన్న కుటుంబాల యువకులు అనేకమంది ఉన్న బ్రిటన్‌లో కాకుండ, దక్షిణాఫ్రికాలో పొట్ట కూటికై చిన్నాచితక కూలీ పనులు చేసుకుంటున్న పేద ప్రవాస భారతీయుల నుంచి మహానాయకుడుగా ఆవిర్భవించిన మహోన్నతుడు మన మహాత్ముడు. విదేశీ గడ్డపై తాను అనుసరించిన అహింసా విధానాన్ని మాతృదేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ కొనసాగించి భారతావనికి ఆయన స్వాతంత్ర్యం సాధించారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన కళాశాల నుంచి న్యాయవాద పట్టా సంపాదించుకున్నా భారతదేశంలో న్యాయవాద వృత్తిలో గాంధీ రాణించలేకపోయారు. బొంబాయి హై కోర్టులో ప్రాక్టీస్ నడవని పరిస్ధితులలో ఒక దశలో పార్ట్ టైం ఉద్యోగాలను వెతుక్కోంటూ గాంధీ తన స్వరాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోయారు. రాజ్ కోట్‌లో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న తన బంధువుల వద్ద ఒక గుమాస్తాగా పని చేస్తూ మనుగడ కొరకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆయనకు విదేశీ ఉద్యోగావకాశం వచ్చింది.
 
దక్షిణాఫ్రికాలో స్ధిరపడ్డ అబ్దుల్లా దాదా అనే గుజరాతీ వ్యాపారికి అక్కడ తన వ్యాపార భాగస్వామితో వ్యాపార విభేధాలు రావడంతో 40 వేల పౌండ్ల విషయమై న్యాయస్ధానంలో కేసు నడిచింది. అబ్దుల్లా వ్యాపార సంస్ధ లెక్కల పుస్తకాలన్ని కూడా గుజరాతీ భాషలో ఉండేవి. వాటిని ఆంగ్లంలోకి అనువదించి న్యాయస్ధానంలో నివేదించడానికై 104 పౌండ్ల వార్షిక వేతనంపై 24 ఏళ్ళ గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. భారత్ నుంచి తీసుకువచ్చిన వేలాది కార్మికులు, ఉద్యోగులు తమ ఐదు సంవత్సరాల ఉద్యోగ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు.
వారికి తోడుగా పెద్ద సంఖ్యలో వచ్చిన గుజరాతీ వ్యాపారస్థులు కూడా దక్షిణాఫ్రికాలోనే స్ధిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపారు. దీంతో తమ శ్వేత జాతీయులకు ఆర్థిక ప్రమాదం పొంచి ఉందని భావించిన దక్షిణాఫ్రికా శ్వేతజాతీయుల ప్రభుత్వం అనేక కఠోర ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా, ఉద్యోగ గడువు ముగిసినా తమ దేశంలోనే నివాసముండాలనుకొంటున్న ప్రతి భారతీయుడు సంవత్సరానికి మూడు పౌండ్లు ఇమ్మిగ్రేషన్ రుసుం చెల్లించాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం షరతు విధించింది.
 
గల్ఫ్ దేశాలలో హిందూ వివాహ చట్టం ప్రకారం చేయబడిన వివాహాలను స్థానిక ప్రభుత్వాలు అంగీకరించవు. అదే విధంగా ఆ కాలంలో దక్షిణాఫ్రికాలో కూడా హిందూ, ముస్లింల వివాహాలను ఆమోదించకపోవడంతో అనేక కుటుంబాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కార్మికులు, పెద్దగా విద్యాబుద్ధులు లేని గుజరాతీ వ్యాపారస్థులకు దాదా అబ్దుల్లా తీసుకువచ్చిన ఇంగ్లీష్ మాట్లాడే మోహన్ దాస్ గాంధీ ఒక ఆశాకిరణంగా కనిపించారు. వారి తరఫున గాంధీజీ రంగంలోకి దిగారు. సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రప్రథమంగా ఆ విదేశీగడ్డపై విజయవంతంగా నిర్వహించారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయులపై పన్ను రద్దు చేసింది. అంతేగాక విద్యాధికులైన భారతీయులకు ఉచితంగా వీసా (ఇమ్మిగ్రేషన్) ఇవ్వడానికి అంగీకరించింది. అదే విధంగా హిందూ, ముస్లింల వివాహాలకు చట్టబద్ధత కల్పించి వారికి జన్మించిన పిల్లలను తమ పౌరులుగా గుర్తించడానికి అంగీకరించింది. దీంతో గాంధీ ఖ్యాతి అటు బ్రిటన్‌కు, ఇటు భారత్‌కు వ్యాపించింది. లండన్‌లో మేధావుల సహవాసంలో ఉండి వచ్చిన (విభిన్న దృక్పథాలు కల్గిన) నెహ్రూ, జిన్నా, వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌లు మాతృదేశీయులలో జాతీయ స్ఫూర్తిని కలిగించలేకపోయారు. అయితే దక్షిణాఫ్రికాలో నిరక్షరాస్య ప్రవాస కార్మికుల మధ్య ఉండి వచ్చిన గాంధీ మాతృభూమిలో పరిపూర్ణంగా జాతీయ స్ఫూర్తిని రగిలించారు. తద్వారా భారతదేశ స్వాతంత్ర్య సాధనలో మహోన్నత పాత్ర వహించారు.
 మోహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

(15-08-2018)