special-article-on-Oman-sultan-Qaboos

ఒమాన్‌ భాగ్య విధాత సుల్తాన్ ఖాబూస్‌

 

ఆంధ్రజ్యోతి, 11-04-2018: హిందీ భాషలో మంచి ప్రవేశం, పరిజ్ఞానం ఉన్న గల్ఫ్‌ పాలకుడు ఒమాన్‌ సుల్తాన్‌ ఖాబూస్‌. ఆయన కొంతకాలం భారత్‌లో చదువుకున్నారు. దివంగత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఈ సుల్తాన్‌కు గురువు. ఈయన రాజప్రాసాదాల నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్‌గా తెలుగువాడైన ఎ.పి. జితేందర్‌ రెడ్డి వ్యవహరించారు.
 
మన దేశంలో ఇరవై ఐదు చదరపు కిలో మీటర్ల వైశాల్యం మాత్రమే ఉన్న ఒక చిన్న నియోజక వర్గం నుంచి దశాబ్దాల పాటు వరుసగా శాసనసభకు ఎన్నికయ్యే రాజకీయవేత్త విశేష ప్రజాదరణ గల నాయకుడుగా గుర్తింపు, గౌరవం పొందడం కద్దు. మరి కీలక అంతర్జాతీయ సరిహద్దులు, జల మార్గాల మధ్య ఉన్న (మూడు లక్షల చదరపు కిలో మీటర్ల) ఒక సువిశాల దేశానికి అర్ధ శతాబ్దం పాటు రాచరిక పాలకుడుగా ఉండడం మామూలు విషయమా? అందునా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు మొదలైన ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడి దేశాన్ని ప్రగతి పథాన సుస్థిరంగా ముందుకు తీసుకు వెళ్ళడం అసాధారణమైన విషయం కాదూ?
 
సుల్తాన్ ఖాబూస్ వర్తమాన ప్రపంచంలో సుదీర్ఘ చరిత్ర గల రాచరిక పరిపాలకుడు. గల్ఫ్‌లో రెండవ అతిపెద్ద దేశమైన ఒమాన్‌ను 1970 నుంచి ఆయన ఏలుతున్నారు. ఆయన తాత ముత్తాతలు తమ సైనిక దళాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను గుజరాతీ వైశ్యుల నుంచి అప్పుల రూపేణా సమకూర్చుకున్నవారు.
 
అయితే వారి వారసుడైన సుల్తాన్‌ ఖాబూస్‌ ఒమాన్‌ను నేడు ఒక శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారు. భౌగోళికంగా ఒక వైపు ఇరాన్, మరో వైపు యమన్, మరో దిక్కు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలు ఉన్న ఒమాన్ అంతర్జాతీయ జలమార్గంలో ఉండడంతో అత్యంత కీలక ప్రాంతీయ రాజ్యంగా ప్రసిద్ధికెక్కింది. ఐరోపా, ఆసియా దేశాలను కలిపే ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాల మధ్య అదన్ సముద్ర జలాలకు కూడా ఇది కేంద్ర బిందువు. అమెరికా, పాశ్చాత్య దేశాల సైనికనౌకల తోపాటు యూరోపియన్ దేశాల వాణిజ్యనౌకలు కూడా ఒమాన్‌ ప్రాదేశిక జలాల గుండా వెళ్తాయి. యమన్‌ సరిహద్దున ఉన్న ప్రాంతాలలో వామపక్ష భావజాలం ఉన్న తెగల ప్రజలు, మరో వైపు యు.ఏ.ఇ, సౌదీ అరేబియాల సున్నీ ఇస్లామిక్‌ సంప్రదాయాలను అనుసరించే ప్రజలు ఒమాన్‌లో ఉన్నారు. భౌగోళికంగానే గాక, సామాజికంగా కూడా ఎంతో వైవిధ్య పరిస్థితులు ఉన్న ఒమాన్ చరిత్ర మిగిలిన గల్ఫ్ దేశాల కంటే విభిన్నమైనది.
 
1960వ దశకంలో ఒమాన్‌ పొరుగు దేశమైన యమన్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఒమాన్ సుల్తాన్‌ 1967లో తమ దేశంలో ఉన్న బ్రిటిష్‌ సేనలను బహిష్కరించారు. అప్పుడప్పుడే బ్రిటన్, అమెరికాల సహాయంతో చమురు ఎగుమతులను ప్రారంభించిన గల్ఫ్ దేశాలు, వాటి పాశ్చాత్య మిత్ర దేశాలు ఒమాన్‌ సుల్తాన్‌ చర్యకు ఉలిక్కిపడ్డాయి. సుల్తాన్‌ సయాద్ (సుల్తాన్‌ ఖాబూస్‌ తండ్రి) తన దేశంలో ప్రజలు పాశ్చాత్య ఉత్పాదక సిగరెట్లు, కాలి బూట్లను కూడా వాడడాన్ని ఏమాత్రం ఇష్టపడలేదు. చివరకు ఆయన తన సువిశాల రాజ్యంలో కేవలం మూడు ప్రాథమిక పాఠశాలలను మాత్రమే నిర్వహించారు. తద్వారా ఒమాన్‌ ప్రజలకు ప్రాథమిక విద్యను కూడా అందకుండా చేసారు. బ్రిటన్‌లో చదివి వచ్చిన తన కుమారుడు ఖాబూస్‌ను రాజధాని మస్కట్‌కు రానీయకుండా నిర్బంధించిన చరిత్ర సుల్తాన్‌ సయాద్‌కు ఉన్నది. రహదారులను అభివృద్ధిపరిస్తే ప్రజల మధ్య సంబంధాలు పెరుగుతాయని భయపడిన సుల్తాన్‌ సయాద్‌ తన సువిశాల దేశం మొత్తం మీద ఒకే ఒక్క రోడ్డును (రాజ ప్రాసాదం నుంచి విమానాశ్రయం వరకు) మాత్రమే నిర్మించాడు!
 
చమురు నిక్షేపాలు అపారంగా ఉన్న దేశం ఒమాన్‌. అయితే సుల్తాన్‌ సయాద్‌ వైఖరి వల్ల ఒమాన్‌తో పాటు తమకూ ఇబ్బందులు తప్పవని బ్రిటన్ భావించింది. ఈ కారణంగా తమ విశ్వవిద్యాలయాలలో చదివిన ఆయన కుమారుడు ఖాబూస్‌ను తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రోత్సహించింది. తండ్రికి అనుకూలమైన పర్వత అరబ్బు తెగలు గట్టిగా పోరాడినా బ్రిటన్ మద్దతు కల్గిన ఖాబూస్ అనుకూల సైనిక దళాలు వారిని అణిచివేసాయి. 1970లో తండ్రిని గద్దెపై నుంచి దించి ఖాబూస్ పాలనా పగ్గాలు చేపట్టారు. ఆనాటి నుంచి ఒమాన్‌ను ఆయనే ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తున్నారు.
 
ఇలా సుల్తాన్‌గా సింహాసనమెక్కిన ఖాబూస్ తన పరిపాలన ద్వారా యావత్తు ఒమాన్ దశ, దిశను మార్చివేశారు. ఆయన తండ్రి కాలంలో కేవలం కొద్ది మంది సంపన్న గుజరాతీ వ్యాపారులను మాత్రమే ఒమాన్‌ స్వాగతించింది. అయితే సుల్తాన్‌ ఖాబూస్ పాలనలో తెలుగు కార్మికులతో సహా ప్రతి ఒక్క భారతీయునికీ ఒమాన్‌ స్వాగతం పలుకుతోంది.
 
సుల్తాన్‌ ఖాబూస్‌ బ్రిటన్‌లోనే కాదు భారతదేశంలో కూడా కొంతకాలం ఉన్నత విద్యాభ్యాసం చేశారు. మన హిందీ భాషలో మంచి ప్రవేశం, పరిజ్ఞానం ఉన్న గల్ఫ్‌ పాలకుడు సుల్తాన్‌ ఖాబూస్‌. భారత్‌లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు దివంగత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆయన గురువు. కాగా తాను అధికారం చేపట్టిన తర్వాత ఖాబూస్ ముచ్చటపడి పలు రాజప్రాసాదాలను నిర్మించుకున్నారు. వాటిని నిర్మించిన సంస్థ పక్షాన ప్రాజెక్టు మేనేజర్‌గా వ్యవహరించిన యువ ఇంజనీర్‌ తెలుగువాడైన ఎ.పి. జితేందర్ రెడ్డి (ప్రస్తుతం తెలంగాణ నుంచి లోక్‌సభలో సభ్యుడుగా ఉన్నారు). సుల్తాన్‌ ఖాబూస్‌ అవివాహితుడు. ఆయనకు సోదరులు, తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన మరణం తర్వాత సీల్డ్‌ కవర్‌ను విప్పి తదుపరి సుల్తాన్ పేరు తెలుసుకోవాలని ఖాబూస్‌ హుకుం జారీ చేసారు. ‍
 మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి