Special-article-about-Kuldeep-Nayyar

ప్రవాసులతో పాత్రికేయ శిఖరం

భారత, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ పత్రికలతో పాటు గల్ఫ్ దేశాలలోని దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు కుల్దీప్‌ వ్యాసాలను ప్రచురించేవి. నెహ్రూ హయాం నుండి నేటి వరకూ సాధికారికంగా కుల్దీప్‌నయ్యర్‌ వెల్లడించిన అనేక విషయాలు అత్యంత ఆసక్తికరంగా ఉండేవి. ఎంతో సామాజిక, రాజకీయ పరిజ్ఞానాన్ని అందించేవి. ఆయన వ్యాసాలను క్రమం తప్పకుండా చదివే పాఠకులకు ఆయన నిష్క్రమణ పెద్ద వెలితి.

మండే ఎండలో కొన్ని గంటల పాటు నడుచుకొంటూ, అనేకమంది భారతీయ కార్మికులను కలుసుకొంటూ, ఎడారి ప్రవాసంలో వారి అనుభవాలను, మాతృదేశంలోని పరిణామాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆ పెద్ద మనిషి ప్రదర్శించిన ఆసక్తి చాలామందికి ఆశ్చర్యాన్ని కల్గించింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం సుప్రసిద్ధ పాత్రికేయుడు కుల్దీప్‌నయ్యర్ సౌదీ అరేబియాలో పర్యటించిన సందర్భం అది. ఈ వయస్సులో ఆయనకు ఈ విషయాలపై ఎందుకంత శ్రద్ధ అని తెలియక అనేకులు అయోమయానికి గురయ్యారు. అడుగుతున్నది ఎవరు, ఎందుకు అనేది తెలుసుకోకుండా ఆయన అడిగిన తీరును చూసి గౌరవించడం మొదలు పెట్టారు. వృద్ధాప్యంలో కూడా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆయన చూపిన ఆసక్తిని చూసి అబ్బురపడ్డారు.
 
బస చేసిన హోటల్‌లో ఆయన్ను కలుసుకొన్నాను. ‘మీరు తరుచుగా మేధావులు, ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకొంటూ ఉంటారు. ఒకసారి సామాన్యుల మనోగతాన్ని కూడా తెలుసుకోండి,’ అని కోరగా, అందుకు సంతోషంగా అంగీకరించి భారతీయులు, ఇతర దక్షిణాసియా కార్మికులు శుక్రవారం గుమిగూడే బలద్ ప్రాంతానికి నాతో వచ్చారు. అక్కడి కార్మికులతో చాలా విషయాలు ముచ్చటించారు. వారితో సంతోషంగా గడిపారు. తన సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో అనేక దేశాల్ని, విభిన్న ప్రజానీకాన్ని కలిసిన తాను గల్ఫ్‌లో మొదటిసారిగా భారతీయ గ్రామీణ ప్రజల్ని కలుసుకుని చాలా విషయాలు గ్రహించానని చెప్పారు. రోడ్డుపై గద్దె మీద తెలంగాణ కార్మికులతో ఓపికగా అనేక విషయాలు మాట్లాడారు. తరువాత, నాటి సౌదీ అరేబియా రాజు సమకూర్చిన రాజప్రాసాదంలో రాజకీయ శరణార్థిగా ఉంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా కలిసి రాజకీయాంశాలు చర్చించారు.
 
భారత సినీ కళాకారులను ఆదరించినట్లుగా పాత్రికేయులు, సామాజిక, రాజకీయాంశాల రచయితలను దక్షిణాసియా దేశాల ప్రజానీకం ఆదరించడం దాదాపు అసంభవం. గల్ఫ్ దేశాలలో భారీ సంఖ్యలో నివసిస్తున్న దక్షిణాసియా దేశస్థులు తమ జాతి, కుల, మతాలకు అతీతంగా ఆదరించే వ్యక్తులలో స్వర్గీయ కుల్దీప్‌నయ్యర్ ఒకరు. భారతీయులతో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశీయులు కూడా ఆయన రచనలను అమితంగా అభిమానిస్తారు. భారత, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ పత్రికలతోపాటు గల్ఫ్ దేశాలలోని దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు ఆయన వ్యాసాలను ప్రచురించేవి. నెహ్రూ హయాం నుంచి నేటి వరకూ సాధికారికంగా కుల్దీప్‌నయ్యర్ వెల్లడించిన అనేక విషయాలు అత్యంత ఆసక్తికరంగా ఉండేవి. ఎంతో సామాజిక, రాజకీయ పరిజ్ఞానాన్ని అందించేవి. ఆయన వ్యాసాలను క్రమం తప్పకుండా చదివే పాఠకులకు ఆయన నిష్క్రమణ పెద్ద వెలితి.
 
భారతదేశ రాజకీయ, సామాజికాంశాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నయ్యర్‌ గతానికి వర్తమానానికి మధ్య ఒక వారధిగా నిలిచారు. దేశ విభజన సమయంలో తన స్వంత గడ్డ అయిన పాకిస్థాన్‌‌లోని సియాల్‌కోట్ నుంచి భారత్‌కు రావడానికి నిరాకరించి, ఆ తర్వాత గత్యంతరం లేని పరిస్థితులలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన దేశ విభజన గాయాలను వర్ణించిన తీరు మనసును కలచివేస్తుంది. తన తుది శ్వాస వరకూ ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కొరకు ఆయన చిత్తశుద్ధితో కృషి చేసారు. 1999లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి లాహోర్ బస్సు యాత్ర సందర్భంగా, బస్సులో తన సీటు ప్రక్కన కుల్దీప్‌నయ్యర్‌ను కూర్చోబెట్టుకుని మరీ పాకిస్థాన్‌‌లో అడుగు పెట్టారు. కుల్దీప్‌నయ్యర్ తరహాలో దాదాపుగా అదే సమయంలో, అదే వయస్సులో తన మాతృగడ్డ పాకిస్థాన్‌‌ను విడిచి భారత్‌కు వచ్చిన తన సహచరుడు అడ్వాణీని కాకుండా వాజ్‌పేయి కుల్దీప్‌నయ్యర్‌ను వెంట తీసుకెళ్ళడం ఆయనకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
 
గల్ఫ్ దేశాలలో సాధారణంగా ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నా, ఆసియా దేశస్థులకు, పాశ్చాత్య దేశస్థులకు చెల్లించే వేతనాలలో భారీ వ్యత్యాసం ఉంటుంది. కుల్దీప్‌నయ్యర్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘మనం భారతీయులం. చాలా కాలం పాటు ఆంగ్లేయుల వలస పాలనలో ఉండి కూడా వారిని పట్టించుకోము. కానీ ఎప్పుడూ పాశ్చాత్య దేశస్థుల పాలనలో లేని గల్ఫ్ అరబ్బులు వారిపై ఎందుకంత ప్రేమాభిమానాలు కనపరుస్తారో అర్థం కాదు’ అని ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నాకు తరుచుగా గుర్తుకు వస్తూనే ఉంటుంది.
 మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)