Smart-organisations-by-Gulf-expats

‘స్మార్ట్‌’ సంఘాలు!

ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పలువురు ప్రవాసులు రాత్రికి రాత్రి సంఘాలుగా ఏర్పడుతున్నారు. ఈ సంఘాల నాయకులకు సేవాభావం తక్కువ. హైదరాబాద్‌ వెళ్ళి మీడియా ముందు మాట్లాడడానికి వీరికి సమయం, సందర్భం లభిస్తుందిగానీ తమ కళ్ళెదుట ఎవరైనా నిస్సహాయంగా ఉంటే వారిని కనీసం కారులో ఎక్కించుకొని ఆస్పత్రికో లేదా లేబర్ కోర్టుకో తీసుకు వెళ్ళే తీరిక ఉండదు!

రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న ఏ దేశంలోనైనా ప్రజా సంఘాలకు స్థానముండదు. భావస్వేచ్ఛకు, వాక్‌ స్వాతంత్ర్యానికి అసలే ఆస్కారముండదు. అలనాడు హైదరాబాద్‌ సంస్థానం ప్రజా జీవితంలో ఎటువంటి సంఘాలు ఉండేవి కావు. సంఘ నిర్మాణం జరగకుండా నిజాం ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకొనేది. ప్రజలు సంఘటితమవ్వడాన్ని ప్రజాస్వామ్య పాలకులూ సహించలేరు కదా. మరి కట్టుదిట్టమైన రాచరిక పాలనలో ఉన్న నేటి గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ఎవరు కూడా ఏ రకమైన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేనే లేదు. అందునా జీవనోపాధికి వచ్చిన ఇతర దేశాల ప్రజలు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధం.
 
ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కొందరు సంఘాల పేరిట దుబాయిలో ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచారు. అయితే దుబాయి ప్రభుత్వం హెచ్చరించడంతో ఆ అకౌంట్లు డిలీట్ చేసారు. ఫేస్‌బుక్‌లో ఒక రాజకీయ వ్యాఖ్య చేసినందుకు ఒక తెలుగు ప్రవాస యువకుడు జైలు పాలయ్యాడు. కారాగారంలో మగ్గుతూ దాదాపుగా మతిస్థిమితం కోల్పోయాడు. ఆ యువకుడిని ఆదుకోవడానికి మన దౌత్యాధికారులు ప్రయత్నించినా అతనికి కనీసం బెయిల్ కూడా దొరకలేదంటే గల్ఫ్‌ దేశాలలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ఉహించుకోవచ్చు.
 
ఈ ఎడారి దేశాలలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న వివిధ దేశాల వారు, ముఖ్యంగా భారతీయులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా అప్పుడప్పుడు స్థానిక చట్టాలకు లోబడి ఏమైనా సాంస్కృతిక కార్యకలాపాలు అదీ నాలుగు గోడల మధ్య జరుపుకొంటుంటారు. అటువంటి సందర్భాలలో భారతీయ అధికారుల విజ్ఞప్తితో స్థానిక ప్రభుత్వాధికారులు అందుకు అనుమతిస్తారు. ఈ వేడుకలు, కార్యకలాపాలలో రాజకీయాలు లేదా సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ అరబ్బులను, వారి సంప్రదాయాలను, చట్టాలను వేలెత్తి చూపడం నిషేధం. నిజానికి ఈ విషయమై గల్ఫ్ దేశాల అధికారుల కంటే ముందు భారతీయ అధికారులే అభ్యంతరం తెలుపుతారు.
 
ఈ నేపథ్యంలో కార్యక్షేత్రంలో నలుగురిలో నారాయణగా ఉంటూ కొందరు సేవా దృక్పథంతో వ్యవహరిస్తుంటారు. వివిధ అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండడంతో పాటు రాజకీయ ఆసక్తిని కూడా వీరు ప్రదర్శిస్తుంటారు. ఇటువంటి వారు ప్రవాస ప్రముఖులుగా గుర్తింపు పొందేవారు. మరి కొందరు తమ కుటుంబాల ఉల్లాసం కొరకు నలుగురితో కలిసి అప్పుడప్పుడూ విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకోవడానికై భాషా సంస్కృతుల పేరిట సంఘాలు నెలకొల్పుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. ఎజెండా అవసరం లేకుండా ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చాలామంది రాత్రికి రాత్రి సంఘాలుగా ఏర్పడుతున్నారు. ఈ సంఘాలకు నాయకులు అడ్డగోలుగా పుట్టుకొస్తున్నారు. వీరికి సేవాభావం తక్కువ. ఈ నాయకుల తాపత్రయమంతా సామాజిక మాధ్యమాలలో చౌకబారు ప్రచారం కొరకేనని చెప్పక తప్పదు.
 
తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి సమస్యలను అన్వేషిస్తున్నారు. ఎవరెవరో మాటలను మరీ అరువు తెచ్చుకొని మాట్లాడుతున్నారు. తాము లేవనెత్తుతున్న సమస్యలపై వీరికి కనీస అవగాహన ఉందని కూడా చెప్పలేము. అటు ఇటు తిరిగి ఎక్కడో ఏడారిలో స్థానిక ప్రభుత్వం చేయవల్సిన పనిని స్వదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల నెత్తిన మోపి చేతులు దులుపుకొంటున్నారు. పని వేళలు ముగించుకొని వచ్చిన తర్వాత సాయంత్రం కాలక్షేపం కొరకు ఫేస్‌బుక్ సేవలు చేయడానికి వస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గల్ఫ్ దేశాలలో ఫేస్‌బుక్‌తో కాకుండా క్షేత్ర స్థాయిలో ఒక ప్రభుత్వ కార్యాలయం నుంచి మరొక ప్రభుత్వ కార్యాలయానికి తిరగవల్సి ఉంటుంది. ఇది డిజిటల్‌గా సాధ్యం కాదు. అదే కనుక సాధ్యమైతే సినీ నటి శ్రీదేవి కేసు వ్యవహారం ఈ–-మెయిళ్ళ ద్వారా జరిగివుండాల్సింది. కానీ ఆ విధంగా జరుగలేదనే వాస్తవాన్ని గుర్తించాలి.
 
మన కేరళ సోదరులు క్షేత్రస్థాయిలో ఉండి పని చేస్తారు. అందరికీ వీలైన విధంగా తోడ్పాటు అందిస్తారు. మరి మనమో? మనతో అది కాని పని. అదే ఫేస్‌బుక్‌లో కామెంట్ అంటే ఒకే గానీ కష్టాల్లో ఉన్న వ్యక్తిని, ఎంతదూరంలో ఉన్నా వెళ్ళి ఆదుకోవడం అంటే కుదరని పని. హైదరాబాద్‌ వెళ్ళి మీడియా ముందు మాట్లాడడానికి తెలుగు ప్రవాస నాయకులకు సమయం, సందర్భం లభిస్తుంది. అయితే తమ కళ్ళెదుట ఎవరైనా నిస్సహాయంగా ఉంటే వారిని కనీసం కారులో ఎక్కించుకొని ఆస్పత్రికో లేదా లేబర్ కోర్టుకో తీసుకు వెళ్ళే తీరిక ఈ నాయకులకు ఉండదు.
 మొహమ్మద్ ఇర్ఫాన్‌
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి